నిషేధిత భూముల నిగ్గు తేల్చుదాం!
♦ 22(ఏ) భూములపై రెవెన్యూ శాఖ కసరత్తు
♦ హైకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాల్సింది జూన్ 2016 నాటికే
♦ మరో వారంలో పూర్తవుతుందంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత భూముల లెక్క తేల్చే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ భూముల జాబితా త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ తన కసరత్తును ముమ్మరం చేసింది. ప్రస్తుతం ఒకే సర్వే నంబర్‌లో కొంత నిషేధిత, మరికొంత ప్రైవేటు పట్టా భూములు న్నాయి. ఈ సర్వే నంబర్‌ను వేరుచేయకుండా నిషేధిత జాబితాలో పేర్కొనడంతో ప్రైవేటు భూముల బదలాయింపునకు అడ్డంకిగా మారింది. దీంతో కొందరు ప్రైవేటు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు.
సవరణ జాబితాకు ఆరు నెలల గడువు ఇచ్చి జూన్, 2016 కల్లా అందుబాటులో ఉంచాలని జనవరి, 2016లో కోర్టు ఆదేశిం చింది. అయితే, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న రెవెన్యూ యంత్రాంగం ఈ ప్రక్రియను వాయిదా వేసుకుంటూ వచ్చిం ది. ఇటీవల వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైన ఘటనలు వెలుగుచూసిన నేపథ్యంలో ఈ జాబితాపై రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తోంది. మరో వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.
నిషేధిత భూములివే....
22(ఏ) సెక్షన్ కింద కొన్ని రకాల భూము ల బదలాయింపును నిషేధించారు. అందులో 22(ఏ) 1(ఏ) కింద ప్రభుత్వం పేదలకు అసైన్ చేసిన భూములు, 1(బీ) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న భూములు, 1(సీ) కింద దేవాదాయ, వక్ఫ్ భూములు, 1(డీ) కింద వ్యవసాయ సీలింగ్, అర్బన్ సీలింగ్, 1(ఈ) కింద రెవెన్యూ, సివిల్ కోర్టులు అటాచ్ చేసినవి, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రెవెన్యూ, ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సైజ్ శాఖలు తమ బకాయిల కింద ఆధీనంలో పెట్టుకున్న భూములు ఉన్నాయి.