బాధితులకు పునరావాసం కల్పించాల్సిందే
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. విచారణ 2 వారాలకు వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఏపీలో వివిధ అభివృద్ధి కార్య క్రమాల కోసం 2013 చట్టం కింద భూ సేకరణ జరుపుతున్న నేపథ్యంలో, ఆ భూ సేకరణ వల్ల ప్రభావిత మయ్యే వారి పునరావాసం కోసం ఏం చర్యలు తీసు కుంటున్నారో వివరించాలని ఉమ్మడి హైకోర్టు మంగళ వారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభావిత కుటుం బాలు, వ్యక్తులకు పునరావాసం కల్పించి తీరాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా ధర్మాసనం గుర్తు చేసింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం చేస్తున్న భూ సేకరణ వల్ల ప్రభావితమవుతున్న వారి పునరావాసం కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడం లేదంటూ ఏపీ వ్యవసాయ కార్మికుల సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గ్రామసభ నిర్వహించకుండా భూములెలా సేకరిస్తారు?
పశ్చిమ గోదావరి జిల్లాలోని స్వర్ణవారి గ్రామ పరిధిలో గిరిజన ప్రాంతంలో గ్రామసభ ఆమోదం లేకుండానే ప్రభుత్వం భూ సేకరణ చేస్తోందంటూ దాఖలైన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు స్పందించింది. గ్రామసభ నిర్వహించకుండా భూ సేకరణ ఎలా చేస్తున్నారో చెబుతూ కౌంటర్లు దాఖలు చేయాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్‌లను ఆదేశించింది. విచారణను జూన్‌కు వాయిదా వేసింది.