సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ సముదాయం కోసం సేకరించిన భూములకు నాలుగున్నర రెట్లు అధికంగా చెల్లించినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి స్పష్టమవుతోంద ని హైకోర్టు అభిప్రాయపడింది. సూర్యాపేటకి సమీపంలో ప్రభుత్వ భూములున్నా వాటిని కాదని కుడకుడ, బీబీగూడెం గ్రామాల పరిధి లోని ప్రైవేట్ భూముల్ని సేకరించడాన్ని సవాల్ చేస్తూ చకిలం రాజేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ఉమ్మడి హైకోర్టు మంగళవారం మరోసారి విచారణ జరిపింది.
ప్రాథమిక నివేదికల ప్రకారం ఆ రెండు గ్రామా ల్లోని ప్రైవేట్ భూములకోసం నాలుగున్నర రెట్లు ఎక్కువగా పరిహారం చెల్లించినట్లు అర్థమవుతోందని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని తెలిపిం ది. ఇలాంటి సందర్భాల్లో భవన నిర్మాణ పనుల నిలిపివేత ఉత్తర్వులు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
సూర్యాపేటకు సమీపంలోనే ప్రభుత్వ భూమి ఉన్నా ప్రైవేటు భూముల్ని సేకరించడానికి కారణం, అక్కడే ఉన్న శ్రీసాయి డెవలపర్స్ భూముల విలువల్ని పెంచేందుకేనని పిటిషనర్ వాదన. భూసేకరణ వివరాలు, భూయజమానుల వివరాలు తెలిపేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు కోరారు. అంగీకరించిన ధర్మాసనం విచారణను బుధవారానికి (నేడు) వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment