సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా భూ సేకరణ నోటిఫికేషన్లు జారీ చేయడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కేంద్రం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునేంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. భూ సేకరణను వెంటనే నిలిపేయాలని, భూముల స్వాధీన ప్రక్రియ కూడా చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మంగళవారం ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారి విస్తరణకు అవసరమైన భూ సేకరణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘానికి చెందిన వెంకటేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ, గిరిజన ప్రాంత పరిధిలోని భూముల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చాయని, తెలంగాణ ప్రభుత్వం భూములను స్వాధీనం విషయంలో ప్రజలను ఒత్తిడికి గురి చేస్తోందని తెలిపారు.
అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, సమన్వయ లోపం వల్లే రెండు నోటిఫికేషన్లు వచ్చాయని, వివాదమంతా రెండు గ్రామాలకు సంబంధించినది మాత్రమేనని తెలిపారు. కేంద్రం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునే అవకాశం ఉందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, కేంద్రం తన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకునేంత వరకు జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి ఎలాంటి భూ సేకరణ చేయడానికి వీల్లేదని ఆదేశించింది.
భూ సేకరణను నిలిపేయండి
Published Wed, Mar 14 2018 4:22 AM | Last Updated on Fri, Aug 31 2018 8:42 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment