
సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కోసం బీబీగూడెం, కుడకుడ గ్రామాల్లో జరిపిన భూసేకరణ ప్రక్రియకు సంబంధించిన రికార్డులన్నింటినీ తమకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కలెక్టరేట్ నిర్మాణానికి వచ్చిన మొదటి రెండు ప్రతిపాదనల్ని కాదని మూడో ప్రతిపాదనను ఆమోదించడానికి కారణాలు చెప్పాలని స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.
సూర్యాపేటకు సమీపంలోనే ప్రభుత్వ భూమి ఉందని, అయినా దూరంగా బీబీగూడెంలోని సర్వే నంబర్ 29, కుడకుడ గ్రామంలోని సర్వే నంబర్ 301, 302, 303ల్లోని ప్రైవేటు భూముల్ని సేకరించి కలెక్టరేట్ నిర్మించాలనే ప్రయత్నాలను అడ్డుకోవాలని చకిలం రాజేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని ధర్మాసనం మంగళవారం విచారించింది.
ఆ రెండు గ్రామాల్లోని భూముల్ని శ్రీసాయి డెవలపర్స్ సంస్థ కొనుగోలు చేసిందని, ఆ భూముల విలువలు పెరిగేందుకు వీలుగా ఆ గ్రామాల మధ్యలోని ప్రైవేటు భూముల్లో కలెక్టరేట్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. పిటిషనర్ రాజకీయ లబ్ధి కోసం పిల్ దాఖలు చేశారని, దానిని కొట్టేయాలని ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచందర్‌రావు ప్రతివాదన చేశారు. విచారణ ఈ నెల 24కి వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment