రైతు ఆత్మహత్యాయత్నం | farmer commit to suicide attempt | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యాయత్నం

Published Tue, Feb 27 2018 1:11 PM | Last Updated on Mon, Oct 1 2018 2:47 PM

farmer commit to suicide attempt - Sakshi

ఆర్డీఓ ఎదుట పురుగుల మందు డబ్బాతో ఉన్న రైతు ఆదిరెడ్డి

శాయంపేట(భూపాలపల్లి): వారసత్వంగా వచ్చిన భూమిని రికార్డుల్లో నమోదు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ రైతు ఆర్డీఓ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి యత్నించిన సంఘటన సోమవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట తహసీల్దార్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొత్తగట్టుసింగారం 114 సర్వే నంబర్‌లో ఎనిమిది మందికి కలిపి 14.30 ఎకరాల పట్టాభూములున్నాయి. అందులో కర్రు ఆదిరెడ్డి వారసత్వంగా తండ్రి నుంచి పొందిన 2.21 ఎకరాల భూమి ఉంది. 2008 వరకు రికార్డుల్లో వివరాలు సరిగ్గానే ఉండగా.. 2010 తరువాత 1.31 ఎకరాలు మాత్రమే ఉంది. దీంతో బాధిత రైతు ఆరు నెలలుగా రెవెన్యూ అధికారులు చుట్టూ, గ్రీవెన్స్‌ ద్వారా ఫిర్యాదు చేసినా స్పందనలేదు.

ఇదే విషయమై సోమవారం ఆదిరెడ్డి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చాడు. ఆ సమయంలో మండలంలో డబుల్‌ బెడ్రూం నిర్మాణ పనులను పరిశీలించడానికి వచ్చిన ఆర్డీఓ మహేందర్‌జీ ఎమ్మార్వోతో మాట్లాడి బయటకు వెళ్తున్న క్రమంలో.. ఆదిరెడ్డి తన సమస్యను ఆర్డీఓ దృష్టికి తీసుకొచ్చాడు. ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదు.. ఇక నా భూమి నాకు దక్కదంటూ.. అప్పటికే సంచిలో తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా తీసిన ఆదిరెడ్డి తాగేందుకు ప్రయత్నించగా గమనించిన ఆర్డీఓ వెంటనే డబ్బాను లాక్కుని వారించాడు. రెండు రోజుల్లో తహసీల్దార్, సర్వేయర్‌ మోఖాపైకి వచ్చి విచారణ చేపట్టి సమస్య పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒక వేళఅధికారులు రాకుంటే తనకు నేరుగా ఫోనుచేయాలని తన ఫోన్‌నంబర్‌ సైతం ఇవ్వడంతో బాధిత రైతు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం సంబంధిత అధికారులపై ఆర్డీఓ మండిపడ్డారు. సకాలంలో విచారణ పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement