భూముల వివరాలు ఇప్పించండి
సభా సంఘం చైర్మన్‌ను కోరిన సభ్యులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తేల్చేందుకు తమకు రెండు వారాల్లో వివరాలు అందించాలని ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటైన అసెంబ్లీ సభాసంఘం (హౌస్ కమిటీ) సభ్యులు కమిటీ చైర్మన్‌ను కోరారు. సంఘం చైర్మన్ సుధీర్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై పలువురు సభ్యులు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. భూదాన్ భూములు, ఎస్సీ, ఎస్టీలకు అసైన్ చేసిన భూములు, ఇనాం భూములు, సీలింగ్ భూములు, దేవాదాయ భూములతో పాటు అప్పటి ఏపీఐఐసీకి కేటాయించిన భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అక్రమ విక్రయాలు, కబ్జాల పాలైన భూముల నిగ్గు తేలాల్సి ఉంది.
అయితే, తమ వద్ద ప్రాథమిక సమాచారం కూడా లేకుండా సమావేశంలో ఏం మాట్లాడలేమని కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కనీసం రెండు వారాల్లోగా తమకు ఆయా భూముల వివరాలు అందించి, మరో వారం రోజులు ఆ వివరాలు చదివేందుకు గడువు ఇవ్వాలని, ఆతర్వాతే మరో సమావేశం పెట్టాలని వీరు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని రకాల భూముల మొత్తం విస్తీర్ణం ఎంతన్న వివరాలను సర్వే నెంబర్లతో సహా జిల్లాల వారీగా తమకు అందించాలని వీరు కోరారు. ఏపీఐఐసీకి కేటాయించిన భూముల విషయంలో అనుకున్న లక్ష్యం నెరవే రిందా? అర్హులకే భూములు అందాయా, అవి వారి నుంచి ఇతరులకు బదిలీ అయ్యాయా అన్న వివరాలను సభ్యులు సేకరించనున్నారు. ప్రభుత్వం భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేయడం, ఆ తర్వాత హైకోర్టు బోర్డుకే అనుకూలంగా తీర్పు ఇచ్చినందున, అసలు భూదాన్ భూముల వ్యవహారం ప్రభుత్వం పరిధిలో ఉందా లేదా అని సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం. , ఏపీఐఐసీ భూములతో పాటు, ఎస్సీ, ఎస్టీ అసైన్డు భూములను తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భూముల వ్యవహారం కూడా కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది.