మూడు దశాబ్దాల పైగా యాక్టివ్‌గా సాహిత్యరంగంలో ఉన్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 11 కవితాసంపుటాలు, వైపని కథా సంకలనం వెలువరించారు. తాజాగా ఆయన కవిత్వసంపుటి ‘చెట్టును దాటుకుంటూ...’ విడుదలైన సందర్భంగా ఆయనతో మద్దికుంట లక్ష్మణ్ జరిపిన సంభాషణ:
మీ గత సంపుటాలకూ ఈ కొత్త సంపుటానికీ తేడా ఏమిటి?
తెలంగాణ ఏర్పడిన తరువాతి పరిణామాలనూ, జీవితంలోని చీకటి వెలుగులనూ మరింత లోతుగా చిత్రీకరించాను. అంతేకాక, ప్రకృతి, సహజ వనరుల విధ్వంసాన్ని కవిత్వీకరించాను.
తెలంగాణ ఉద్యమకాలంలో సాహిత్యం పాత్ర, నూతన సాహిత్యకారుల ఆవిర్భావాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఉద్యమకాలంలో సాహిత్యం అంతా తెలంగాణ కోల్పోయిన సంస్కృతి, సంపదల గురించి వివిధ ప్రక్రియల ద్వారా ప్రజలను సిద్ధం చేసింది. హక్కులకై గొంతెత్తింది. ఇక కొత్త సాహిత్యకారులు అంటే మీ దృష్టిలో తెలంగాణ అనంతరకాలంలో సాహిత్యరంగంలో ఏర్పడిన సమీకరణల గురించి అనుకుంటాను. ఇటువంటి కవిసమయాలు కొత్తేం కాదు. 1956 తరువాత కూడా కొంతమంది అధికారపక్షం వహించారు. వీరు ప్రజాసంబంధాల అధికారుల పాత్రల్లోకి కుంచించుకుపోయారు.
విభజన తర్వాత సాహిత్యకారుల పాత్ర ఎలా ఉండాల్సింది?
తాను నొవ్వక ఇతరులను నొప్పించక రాసుకుపోతున్నారు. వ్యూహాత్మక మౌనం పాటించడం సుతారమూ తగదు. కవుల మౌనం ప్రజాద్రోహంతో సమానం.
తొంభై దశకంలో ప్రపంచీకరణ దుష్ర్పభావాల మీద తొలికోడై కూసిన మీరు ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారా?
ప్రపంచీకరణ పరిణామాలు ఇప్పుడు గ్రామాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది రైతాంగం, నేతకార్మికుల ఆత్మహత్యలుగా దాపురించింది. ప్రపంచీకరణ అనివార్యం కాకున్నా, వివిధ దౌర్జన్యకర ఒప్పందాల ద్వారా పాలకులు తప్పనిసరి చేసారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న శరణార్థుల సమస్య, యూరపుదేశాలలో ఆర్థిక సంక్షోభాలు, అమెరికా కర్రపెత్తనం మూలంగా ఉగ్రవాదుల పుట్టుక తదితరాలన్నీ ప్రపంచీకరణకు జన్మించిన కుత్సితరూపాలే!
సాహిత్యకారులు ఉద్యమాల్లో పాలుపంచుకోవడాన్ని ఎలా అవగతం చేసుకోవాలి?
తమ రచనలకు పరిమితమవుతారో, లేక ఉద్యమాలలో చేరి మరింత నిర్మాణాత్మక భూమిక పోషిస్తారో అది ఆయా సృజనకారుల చేతనకు చెందిన వ్యవహారం.
- జూకంటి ఫోన్: 9441078095
‘అసలు మహాత్ముడు’
నేటి భారతీయ సమాజానికి ‘స్వామి శ్రద్ధానంద’ పేరు తెలియదంటే ఆశ్చర్యం లేదు. తెలిసిన కొద్దిమందికి ‘శుద్ధి’ ఉద్యమం నడిపి, మహమ్మదీయుల ఆగ్రహానికి గురై హత్యగావించబడిన ఆర్యసమాజ్ నాయకుడుగా తెలుసు! నిజానికి, హిందూ ముస్లిం ఐక్యత కోసం గాంధీ కంటే ముందునుంచే నిబద్ధుడై, మహమ్మదీయుల విశ్వాసాన్ని చూరగొన్న స్వామి సమకాలీన నాయకుల కుట్రలవల్ల తన ప్రాణాల్నే బలియివ్వాల్సి వచ్చింది. చరిత్రలో ఎవరూ తలపెట్టనివిధంగా విద్య ద్వారా జాగృతి, అభ్యున్నతి మంత్రాలను ఉపదేశించిన ఋషిప్రోక్తుడు శ్రద్ధానందుడు. అలాంటి మహాత్ముడి పలు జీవన పార్శ్వాలను ఆవిష్కరించిన పుస్తకం ‘అసలు మహాత్ముడు’.
ప్రముఖ సంపాదకుడు, పలు గ్రంథకర్త ఎం.వి.ఆర్.శాస్త్రి ఈ పుస్తక రచయిత. చారిత్రక గతినీ, పరిణామాన్నీ అర్థం చేసుకోవడానికి నిశ్చితమైన సూత్రాలున్నాయనే నమ్మకాన్ని చరిత్ర రచన మనలో కలిగిస్తుంది. సామాజిక వర్గాల ప్రవర్తన, ఆర్థిక శక్తులే సమకాలీన అభివృద్ధికి చోదక శక్తులనేది సుస్పష్టం. మనుషుల్లో మహాత్ముడనే వాడుకూడా ఈ చోదక శక్తులు నిర్ణయించే పరిమితుల్లోనే ఒదిగిపోయి వుంటాడు. సరిగ్గా అలాంటి పోత పోసిన పాత్రలో సామాజిక, రాజకీయ, సేవానాటక రంగాన్ని రక్తికట్టించిన ‘మహాత్ముని’ అసలు బండారాన్ని బట్టబయలు చేస్తూ... చోదక శక్తులు గీత గీసిన పరిమితులకు లొంగక, అస్పృశ్యతకు ఎదురొడ్డి, పరమత సహనపు సేతువు నిర్మిస్తూ, హిందూజాతిని సంఘటితం చేయ ప్రయత్నించాడు శ్రద్ధానంద. ‘ఇన్‌సైడ్ కాంగ్రెస్’, ‘హిందూ సంఘటన్: సేవియర్ ఆఫ్ ఎ డైయింగ్ రేస్’ గ్రంథాలు రచించాడు.
వివిధ ఉద్యమాల్లో మహాత్మాగాంధీ కప్పదాటు వ్యవహారాన్నీ, హరిజనోద్ధరణ ఉద్యమాన్ని నీరుగార్చిన విధానాన్నీ, ముస్లింలీగ్ ఆగడాల్ని అడ్డుకట్టవెయ్యలేక పోయిన అశక్తతనూ పుస్తకంలోని ఇరవై ప్రకరణాల్లో తెల్పుటయే కాక వాస్తవాల వెలికితీత కోసం పలు గ్రంథాల్ని ఉటంకించారు శాస్త్రి.
పథకం ప్రకారం జరిగిన జాతీయోద్యమ చరిత్రలో ఎన్నో వెల్లవేతలు, ఎన్నో తిరగమోతలు. తత్ఫలితంగా పలు కీలక ఉద్యమాల్లోని నేతలు విస్మృతి పాలయ్యారు. అలా మరుగున పడ్డ మహనీయుడే శ్రద్ధానందుడు.
ఒక మూస వ్యవస్థ మరొక కొత్త వ్యవస్థలోకి పరిణామం చెందుతున్న దశలో, భారత జాతీయోద్యమాన్ని అసిధారావ్రతంగా భావించి, భారతీయ తత్వచింతనతో పాటు ప్రజానీకపు దారిద్య్రాన్ని పోగొట్టడానికి పాలకవర్గాల పాత్రను ఆకళింపు చేసుకొని వాటి సమతౌల్యానికి అహరహం శ్రమించిన నాయకుడు స్వామి శ్రద్ధానంద అని పుస్తకం ద్వారా పాఠకులు గ్రహిస్తారు.
- నాదెండ్ల మీరా సాహెబ్
9441630392
భరించడు సుఖ పాఠకుడు
కొందరికి రచనలలో ఆనందం కావాలి, అంటే సమాజం ఎలా ఉంటే ఆదర్శప్రాయంగా ఉంటుందని వారి సంస్కారం చెబుతుందో, అలాంటి జీవితం రచనలలో కనబడాలి. సాహిత్యాన్ని ఈ దృష్టితో చూసేవారికి ప్రతినిధులు పిల్లలు. వాళ్లకు ఆనందం యిచ్చే కథలలో మంచివాడు జయిస్తాడు. చెడ్డవాడు అణగారిపోతాడు. ఆదర్శ పాత్రలు ధైర్యం కలిగి, ఎలాటి కష్టాలనైనా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. కుట్రలూ, కుహకాలూ పనికిరావు. స్వార్థం చాలా చెడ్డది. ఇలా ఉంటుంది పిల్లల అభిరుచి.
సుఖంగా జీవిస్తూ, మెత్తని పరుపూ, వడ్డించిన విస్తరీ లాటి జీవితం గలవాళ్లు దారిద్య్రం గురించీ, పేదల కష్టాలను గురించీ, వాళ్లకు జరిగే అన్యాయాలను గురించీ వాస్తవ విషయాలు చదివితే బాధ పడతారు. అలాటి జీవితం నుంచి విముక్తి పొందటానికి ఆ అభాగ్యులు కత్తి పట్టిన రచనలు చదివితే ఆగ్రహా వేశులైపోతారు.
- కొడవటిగంటి కుటుంబరావు
‘సాహిత్య ప్రయోజనం లేని రచన గొప్పదిగా ఉండగలదా?’(1980) వ్యాసం నుంచి...
అసహాయత
‘బాగా లేదా సార్’
అడిగింది ఆమె
‘అలా కన్పడుతున్నానా’
అతని ప్రశ్న.
‘అవును సార్
ఎంతోదూరం నడిచినట్టు
ఎన్నో ఎడారుల్ని మోస్తున్నట్టు
ఎప్పుడూ ఏదో స్వరాలు మోగుతున్నట్టు
అస్వస్థత కాదుగానీ, అలిసిపోయినట్టు’
‘రాత్రి నిదర లేదు’
అబద్ధ మాడాడతను-
తననుభవిస్తున్న దుఃఖాల్ని
విపత్తుల్ని, వినూత్న విధ్వంసాల్ని
మంటల జీవితాన్ని
మూట విప్పి
ఆమె ముందు గుమ్మరించలేక-
- శివారెడ్డి
040-24064195
ఎందుకు?
గుండెల్లో గూడు కట్టుకున్న వైరాగ్యం
ఎందుకు? అని ప్రశ్నిస్తుంది
సమాధానం తెలియని మనస్సు
మౌనంగా రెక్కలు విప్పుకొని దిక్కులకు ఎగిరిపోతుంది
ఇంతకూ దేవుడున్నాడా?
లేకనేం? సకల చరాచర జగత్తుకు
సృష్టికర్త ఆయనే కదా!
మరి ఆయనను సృష్టించిన కర్త ఎవరో?!
తర్కం మొగ్గ తొడిగిన చోట
విశ్వాసం ముక్కలు చెక్కలై భళ్లున పగిలిపోతుంది
పోనీ మహావిస్ఫోటం, తారలు, గ్రహాలు అంతా నిజమేనా?
చూస్తుంటే నిజమేననిపిస్తోంది
మరి ఏ ప్రమేయమూ లేకుండానే
ఇదంతా ఇట్లాగే ఎందుకు సంభవించడం?
మళ్లీ అంతే... తర్కం మొగ్గ తొడిగిన చోట
నమ్మకం ముక్కలు చెక్కలై భళ్లున పగిలిపోతుంది
మనస్సు రెక్కలు విప్పుకొని
మళ్లీ మళ్లీ దిక్కులకు ఎగిరిపోతుంది
- వైరాగి యెద్దుల
9052032198
రచయితలతో సంభాషణ
ఒకే లక్ష్యం కోసం భిన్న మార్గాల్లో పనిచేస్తున్న రచయితలతో సంభాషణ కోసం ‘వర్తమాన సామాజిక సంక్లిష్టతలు-రచయితల బాధ్యత’ అంశంపై ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ నేడు హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మధ్యాహ్నం 1:30 నుంచి 5 వరకు ఒక సమావేశాన్ని నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల సాహిత్య సంఘాలను, సాహిత్యకారులను పాల్గొనాల్సిందిగా ఆహ్వానిస్తోంది.
మౌళికి యువక పురస్కారం
‘బహుజన రచయతల వేదిక-ఆంధ్రప్రదేశ్’ ఆధ్వర్యంలో, కలేకూరి ప్రసాద్ (యువక) స్మారక సాహిత్య పురస్కార సభ- నేడు సాయంత్రం 6 గంటలకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్‌లో జరగనుంది. పురస్కార గ్రహీత: బాలసుధాకర మౌళి. ఈ సభలో చల్లపల్లి స్వరూపరాణి, ఎం.ఎం.వినోదిని, ఖాజా, కోయి కోటేశ్వరరావు, బద్దిపూడి జయరావు, ఎన్.జె.విద్యాసాగర్, ముప్పవరపు కిషోర్, ఎ.సుబ్రహ్మణ్యం, మిరియం అంజిబాబు పాల్గొంటారు.
ఒక విజేత ఆవిష్కరణ
అబ్దుల్ కలాంపై 190 మంది కవుల కవితా సంకలనం ‘ఒక విజేత’ ఆవిష్కరణ కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 29న మధ్యాహ్నం 3 గంటలకు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో జరగనుంది. సంపాదకుడు: మాడభూషి సంపత్‌కుమార్. ఆవిష్కర్త: వైస్ ఛాన్సలర్ ఆర్.తాండవన్. తొలిప్రతి స్వీకర్త: కలాం మనవడు షేక్ సలీం. జి.వి.ఎస్.ఆర్.కృష్ణమూర్తి, ఎ.ఎన్.రావు, నర్రావుల వెంకటరమణ, మేడిపల్లి రవికుమార్, విస్తాలి శంకరరావు పాల్గొంటారు.
కొత్త పుస్తకాలు
బులుసు సుబ్రహ్మణ్యం కథలు (‘నవ్వితే నవ్వండి’ బ్లాగులో రాసినవి)
పేజీలు: 206; వెల: 150
ప్రతులకు: రచయిత, ప్లాట్ నం.139, రోడ్ నం.7, సౌత్ ఎండ్ పార్క్, మన్సూరాబాద్, ఎల్బీ నగర్, హైదరాబాద్-68. ఫోన్: 040-24124494
నిండు పున్నమి పండు వెన్నెల
(బాలసరస్వతీదేవి అభినందన సంచిక)
కూర్పు: మోదుగుల రవికృష్ణ
పేజీలు: 152; వెల: 100
ప్రతులకు: కూర్పరి, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూరు-4; ఫోన్: 9440320580
మా ఊరు చెప్పింది (చిన్న చిన్న కథలు)
రచన: ప్రశాంత్ విఘ్నేశ్
పేజీలు: 150; వెల: 180; ప్రతులకు: ముఖ్య పుస్తకకేంద్రాలు; రచయిత ఫోన్: 9177177777
కవుల మౌనం ప్రజాద్రోహం
Published Sun, Oct 25 2015 5:05 AM | Last Updated on Mon, Aug 13 2018 7:57 PM
Advertisement
Advertisement