సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్ చంద్రకుమార్. చిత్రంలో సామల రమేశ్‌బాబు, సతీశ్ చందర్, సాక్షి ఈడీ కె. రామచంద్రమూర్తి
సాక్షి, హైదరాబాద్: సామాజిక మార్పునకు కవులు, రచయితలు కీలకపాత్ర పోషించాలని ఏపీ, తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా అందులో సాహిత్యకారుల పాత్ర ఉంటుందని, ఇందుకు రష్యా, చైనా, వియత్నాం, భారత స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ సాయిధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలే నిదర్శనమని అన్నారు. ఆదివారం ఇక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్ కాలేజీలోని చల్లా సోమరాజు, రామ్ ఆడిటోరియంలో విజయవాడ తాపీ ధర్మారావు వేదిక ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుడు, రచయిత, సాహితీ విమర్శకుడు సతీశ్‌చందర్‌కు తాపీ ధర్మారావు పురస్కారం ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ తాపీ ధర్మారావు మూఢనమ్మకాలను పారద్రోలేందుకు విశేషంగా కృషి చేశారని, అణగారిన వర్గాలకు బాసటగా నిలిచారని అన్నారు. సతీశ్‌చందర్ ఆధునిక సాహిత్యంలో కవిసామ్రాట్ అని కొనియాడారు. స్పందించే హృదయంతో రాసినందునే ఆయన కవితలు, రచనలు, చీకట్లో వెలుగు కిరణాలయ్యాయని పేర్కొన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సతీశ్‌చందర్ పలు పత్రికల్లో పనిచేసిన అపార అనుభవంతో జర్నలిజం పాఠశాలను పాతికేళ్లుగా నిర్వహిస్తూ అనేకమంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు. 25 నుంచి 80 ఏళ్ల వయసున్న వారితో సతీశ్‌కు పరిచయాలున్నాయని, అందువల్ల ఆయన ఆలో చనా ధోరణి విస్తృతంగా ఉందని అన్నారు.
ఒక్క సినిమా పాటల్లో తప్ప, మిగిలిన అన్నింట్లోనూ తాపీకి, సతీశ్‌కు సారూప్యం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ అలసిపోని రచయిత సతీశ్‌చందర్ అని పేర్కొన్నారు. దళిత దృక్పథాన్ని తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని ప్రభావితం చేశారని అన్నారు. సతీశ్‌చందర్ మాట్లాడుతూ కొత్తపాళీ – పాతపాళీతో రాసినా తాను తాపీగానే రాస్తానని చమత్కరించారు. ఏబీకే ప్రసాద్ నుంచి అధ్యయనం, రామచంద్రమూర్తిని నుంచి వ్యంగ్యాధిక్షేపణ, పతంజలి నుంచి సూటిగా వ్యవహరించటం అలవరచుకొన్నానని చెప్పారు. ఉత్పత్తితో సంబంధంగల భాషే అసలైన తెలుగు భాష అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడివారు తెలంగాణ సాహితీ పౌరసత్వం ఇస్తారో లేదో అనే అనుమానం కల్గుతోందని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఏటుకూరి ప్రసాద్, సమావేశకర్త డాక్టర్ సామల రమేశ్‌బాబు, తాపీ ధర్మారావు మనవరాలు విమలా సోహన్, కవులు, రచయితలు, పాత్రికేయులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment