Justice chandrakumar
-
బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లే మోదీతో కేసీఆర్‌కు లోపాయికారీ ఒప్పందం
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.60 వేల కోట్ల వరకు దోపిడీ చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకే జాగో తెలంగాణ పేరుతో ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి చైతన్యం చేస్తున్నామని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేసి గల్లీకొక బెల్టు షాపు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇసుక, మట్టి, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు చెలరేగుతున్నాయని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భయంకరమైన అవినీతి కనిపిస్తోందని ధ్వజమెత్తారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వి నర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమకాలంలో ఎలా ఉందో ప్రస్తుతం అలాగే ఉందని, వలసలు ఏమాత్రం ఆగలేదన్నారు. పాలమూరు రాజకీయ నేతల బానిసత్వం కూడా పోలేదన్నారు. సమావేశంలో జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధులు ఖలీదా ఫరీ్వన్, ప్రొఫెసర్ వినాయకరెడ్డి, ప్రొఫెసర్ పద్మజాషా, జావిద్ ఖాద్రి పాల్గొన్నారు. -
ఇది ప్రజాస్వామ్య వైఫల్యం
హైదరాబాద్: పరిపాలన ప్రజలకు అర్థం కాకపోవటం అంటే అది ప్రజాస్వామ్య వైఫల్యమేనని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ లోక్ సత్తా పార్టీ ఆధ్వర్యంలో ‘స్థానిక ప్రభుత్వాలు– సాధికారత, ఆవశ్యకత’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. సామాన్య ప్రజలకు విద్య అందటం లేదంటే సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు. ఇన్నాళ్ల ప్రజాస్వామ్యంలో పిల్లలకు చదువు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 40 వేల కోట్లు పాఠశాల విద్యకు ఖర్చు అవుతున్నా నూటికి 60 శాతం మందికి చదువు రావటం లేదన్నారు. స్థానిక నాయకత్వ లోపం వల్లనే మెరుగైన విద్య అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నామమాత్రంగా విద్యకు ఖర్చు చేసినప్పుడే మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఇప్పుడు కోట్లు ఖర్చు చేసినా ఫలితాలు లేవన్నారు. ఇన్ని అనర్థాలకు మూలం అధికారాన్ని ప్రజలకు దూరం చేయటమేనన్నారు. మనుషులు మారుతున్నారే తప్ప పాలన మారటం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం వేల కోట్ల మిగులు తో ఏర్పడినప్పటికీ ఇప్పుడు ఏమీ లేదని, వృథా ఖర్చులు పెరగటం వల్లనే అప్పుల పాలవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, లోక్‌సత్తా పార్టీ కన్వీనర్ తుమ్మనపల్లి శ్రీనివాసు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం, కటారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించండి
సాక్షి, న్యూఢిల్లీ : బంజారాలు, లంబాడీ, సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ సుప్రీం కోర్టులో శుక్రవారం పిల్ దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ (సవరణ) చట్టం, 1971 ప్రకారం తెలంగాణ ప్రాంతంలో నివసిస్తున్న వీరిని ఎస్టీలుగా గుర్తించటం రాజ్యాంగ వ్యతిరేకమని, ఇది ఆర్టికల్ 342ను ఉల్లంఘించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. బంజారాలు, లంబాడీలు, సుగాలీలు ఎస్టీలు కాదని, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస వచ్చి ఎస్టీలకు చెందవలసిన ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. లంబాడీలు, సుగాలీలు క్షత్రియ కులానికి చెందిన వ్యాపారులని తెలిపారు. 1976లో తెచ్చిన చట్టం ఎలాంటి విచారణ జరపకుండానే వీరిని ఎస్టీ జాబితాలో చేర్చిందని, అప్పటి వరకు వీరు బీసీ జాబితాలోనే ఉన్నారని వివరించారు. కాగా, పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎం.ఎన్.రావు వాదనలు వినిపించనున్నారు. -
కౌలు, పోడు రైతులకు వర్తింపజేయాలి
హైదరాబాద్: ప్రభుత్వానికి నిజంగా రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే కౌలు, పోడు రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి నాలుగు వేలు అందించాలని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కౌలు, పోడు రైతులకు రైతుబంధు పథకం వర్తింపచేయాలనే డిమాండ్‌తో వచ్చే నెల రెండవ తేదీన∙అన్ని సంఘాలతో కలసి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరునాడు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గురువారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటి వ్యవహారంగా చేయాలంటే ముందుగా గిట్టుబాటు ధర నిర్ణయించాలని, ప్రతి క్వింటా పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇవ్వాలని సూచించారు. వీటిని పట్టించుకోకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా రైతులకు లబ్ధి చేకూరదని అభిప్రాయపడ్డారు. వందలాది ఎకరాల భూములున్న అనేకమంది వ్యాపారులు, భూస్వాములు, ఉన్నతాధికారులకు రైతుబంధు ద్వారా లక్షలాది రూపాయలు అందిస్తూ కౌలురైతులను విస్మరించిందని అన్నారు. ఈ పథకం వల్ల సామాన్య రైతులకు లబ్ధి చేకూరడంలేదని, ప్రభుత్వం ఆర్భాటంగా ఇతర భాషల్లో కూడా ప్రచారం చేసి వంద కోట్లు ఖర్చుపెట్టిందని విమర్శించారు. ప్రచారానికి వెచ్చించిన ఆ డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వొచ్చుకదా? అని ప్రశ్నించారు. రైతుబంధు పథకాన్ని పునఃపరిశీలించి కౌలు, పోడు రైతులకు వర్తింపచేయాలని, రైతులందరికీ వడ్డీలేని రుణాలివ్వాలని, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అవసరం మేర రైతులకు అందించాలని, ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ సాంబశివ గౌడ్, ఓట్ నీడ్ గ్యారెంటీ వ్యవస్థాపకురాలు సోగరా బేగం, మోహన్‌రాజ్, వేదవికాస్, సలీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై అక్రమ కేసులు దారుణం
హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వస్తే విద్య పూర్తిగా వ్యాపారంగా మారుతుందని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో రిజర్వేషన్లు ఉండవని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు. ఈ అరెస్టులను చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రాథమిక హక్కులనేవి ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అంకెళ్ల పృధ్వీరాజ్, చందన్‌లను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, పీవోడబ్ల్యూ సంధ్య, వేదిక కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ పాల్గొన్నారు. -
తెలంగాణ ప్రజల పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ యవనికపై మరో ప్రాంతీయపార్టీ పురుడు పోసుకుంది. బహుజనులకు రాజ్యాధికారం, సామాజిక న్యాయమే ధ్యేయంగా ఏర్పడింది. ఆదివారం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో తెలంగాణ ప్రజల పార్టీ(టీపీపీ) ఆవిర్భావ కార్యక్రమం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ‘మాది దొరల పార్టీ కాదు, కుట్రలు, కుతంత్రాలు ఉండవు, ఇది బహుజనుల పార్టీ’అని స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే తమ పాలన ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే లక్షలాది ఉద్యోగాలు వస్తాయని, రైతుల ఆత్మహత్యలు ఉండవని, అవినీతి అక్రమాలు జరగవని చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాటలకే పరిమితం అయ్యారని విమర్శించారు. కుడిచేతితో నోటిఫికేషన్లు ఇచ్చి ఎడమచేతితో హైకోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటున్నారని అన్నారు. సమాజంలో 50 శాతం ఉన్న మహిళలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీని విస్మరించారని అన్నారు. విద్య, వైద్యం పేదలకు దూరమైందని అన్నారు. అన్ని ఉద్యోగాలు ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన నియమిస్తున్నారని, చివరకు మంత్రి పదవులను కూడా ఔట్ సోర్సింగ్‌లో నియమిస్తారేమోనని ఎద్దేవా చేశారు. ఎంబీసీలకు రూ. 1000 కోట్లు కేటాయించి ఒక్క పైసా ఖర్చు చేయలేదని ఆరోపించారు. పేదల ఆకాంక్ష నెరవేర్చడానికే తాము కొత్త పార్టీని పెట్టామని చెప్పారు. తెలంగాణ ప్రజల పార్టీ నూతన కార్యవర్గం... తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడిగా జస్టిస్ బి.చంద్రకుమార్, ఉపాధ్యక్షులుగా వేదవికాస్, సుతారి లచ్చన్న, ముప్పారపు ప్రకాశ్, మోహన్‌రాజ్, సెక్రటరీ జనరల్‌గా డాక్టర్ పీవీ రామనర్సయ్య, ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సాంబశివగౌడ్, కోశాధికారిగా రఘు, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఏలేశ్వరం వెంకటేశ్, జయరాజ్, భద్రయ్య, జాయింట్ సెక్రటరీగా సందీప్‌కుమార్ ఎన్నికయ్యారు. మహిళా విభాగం నాయకులుగా డాక్టర్ ఆత్మీయ నిర్మల, జి.స్వర్ణ, విద్యార్థి విభాగం నాయకుడిగా అంజి, యువజన విభాగం నేతగా సూరజ్‌గౌడ్, రైతు విభాగం నేతగా ఏసీ రెడ్డి, రామకృష్ణ, మైనార్టీ విభాగం నాయకుడిగా కేఏ రహమాన్, మీడియా విభాగం ఇన్చార్జిగా దేవరశెట్టి వేణుమాధవ్, సలహాదారులుగా ప్రొ.తిరుమలి, రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్, మురళీమనోహర్, న్యాయవాది రామరాజు, ప్రభాకరాచారి నియమితులయ్యారు. -
బహుజనులకు రాజ్యాధికారమే లక్ష్యం
హైదరాబాద్: బాబాసాహెబ్ అంబేఛ్కిర్ రాజ్యాంగంలో పొందుపరచిన సామాజిక, ఆర్థి«క న్యాయం.. అందరికీ సమాన అవకాశాలు.. కుల వివక్ష నిర్మూలన కోసం రాష్ట్రంలో నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ హస్తినాపురం షిర్డిసాయినగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నిరుపేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించడమే తాను స్థాపించబోయే పార్టీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గత ఆరు దశాబ్దాలుగా రాష్ట్రంలో పాలకులు నిరుపేదలను ఎన్నడూ పట్టించుకోలేదన్నారు. అవినీతి, అక్రమాలు, కల్తీ పెరిగిపోయి బడుగు, బలహీన వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చకపోగా.. అవినీతిని పెంచిపోషించాయని చంద్రకుమార్ విమర్శించారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్, డాక్టర్ దేశగాని సాంబశివుడుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలపై జస్టిస్ చంద్రకుమార్ దీక్ష
హైదరాబాద్: రైతుల ఆత్మహత్యలను ఆపడానికి ప్రభు త్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్, హైకోర్టు మాజీ న్యాయ మూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ డిమాండ్ చేశారు. గురు వారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్ర కుమార్ ‘రైతు రక్షణ దీక్ష’ను చేపట్టారు. ఈ దీక్షకు పలు రైతు సంఘాలు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలి పారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లా డుతూ అందరికీ ఆహారాన్ని అందించే తల్లిలాంటి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ రంగం మూతపడ్డా నష్టం జరగదని, కానీ వ్యవసాయ రంగం మూత పడితే పరిణామాలు తీవ్రస్థాయిలో ఉంటాయని అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా రైతులను మోసం చేస్తూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల వడ్డీ అంటే అది ముగిసిన ముచ్చట అని సీఎం అంటున్నారని, మరి రైతాంగాన్ని కాపాడటానికి ఏమి భరోసా ఇస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల జీతాలు పెంచారు.. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల జీతాలను విపరీతంగా పెంచారు.. మరి రైతుల పంటకు గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రైతు సంఘం నాయకులు సారంపల్లి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను చెల్లించడం లేదన్నారు. కార్యక్రమంలో ఏఐకే ఎంఎస్ నాయకుడు కెచ్చల రంగయ్య, రైతు సంఘం కార్యదర్శి టి.సాగర్, అఖిల భారత రైతు కూలీ సంఘం నేత అచ్యుత రామారావు, రైతు స్వరాజ్య వేదిక నాయ కులు కొండల్, ఏఐకేఎఫ్ నాయకులు ప్రభులింగం, మన్నారం నాగరాజు, మాజీ ఎంపీ సోలిపేట రాంచంద్రా రెడ్డి, ప్రొఫెసర్లు అరిబండి ప్రసాద రావు, లక్ష్మణ్, పీఎల్ విశ్వేశ్వర్ రావు, చంద్రన్న తదితరులు పాల్గొని దీక్షకు మద్దతు తెలిపారు. కాగా, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య రాత్రి 7 గంటలకు జస్టిస్ చంద్రకుమార్ తదితరులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. -
సామాజిక మార్పులో కవులే కీలకం
సాక్షి, హైదరాబాద్: సామాజిక మార్పునకు కవులు, రచయితలు కీలకపాత్ర పోషించాలని ఏపీ, తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రపంచంలో ఏ ఉద్యమం జరిగినా అందులో సాహిత్యకారుల పాత్ర ఉంటుందని, ఇందుకు రష్యా, చైనా, వియత్నాం, భారత స్వాతంత్య్ర సంగ్రామం, తెలంగాణ సాయిధ పోరాటం, ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలే నిదర్శనమని అన్నారు. ఆదివారం ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ కాలేజీలోని చల్లా సోమరాజు, రామ్ ఆడిటోరియంలో విజయవాడ తాపీ ధర్మారావు వేదిక ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయుడు, రచయిత, సాహితీ విమర్శకుడు సతీశ్‌చందర్‌కు తాపీ ధర్మారావు పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ తాపీ ధర్మారావు మూఢనమ్మకాలను పారద్రోలేందుకు విశేషంగా కృషి చేశారని, అణగారిన వర్గాలకు బాసటగా నిలిచారని అన్నారు. సతీశ్‌చందర్ ఆధునిక సాహిత్యంలో కవిసామ్రాట్ అని కొనియాడారు. స్పందించే హృదయంతో రాసినందునే ఆయన కవితలు, రచనలు, చీకట్లో వెలుగు కిరణాలయ్యాయని పేర్కొన్నారు. సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ సతీశ్‌చందర్ పలు పత్రికల్లో పనిచేసిన అపార అనుభవంతో జర్నలిజం పాఠశాలను పాతికేళ్లుగా నిర్వహిస్తూ అనేకమంది జర్నలిస్టులను సమాజానికి అందించారన్నారు. 25 నుంచి 80 ఏళ్ల వయసున్న వారితో సతీశ్‌కు పరిచయాలున్నాయని, అందువల్ల ఆయన ఆలో చనా ధోరణి విస్తృతంగా ఉందని అన్నారు. ఒక్క సినిమా పాటల్లో తప్ప, మిగిలిన అన్నింట్లోనూ తాపీకి, సతీశ్‌కు సారూప్యం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి మాట్లాడుతూ అలసిపోని రచయిత సతీశ్‌చందర్ అని పేర్కొన్నారు. దళిత దృక్పథాన్ని తన రచనల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని ప్రభావితం చేశారని అన్నారు. సతీశ్‌చందర్ మాట్లాడుతూ కొత్తపాళీ – పాతపాళీతో రాసినా తాను తాపీగానే రాస్తానని చమత్కరించారు. ఏబీకే ప్రసాద్ నుంచి అధ్యయనం, రామచంద్రమూర్తిని నుంచి వ్యంగ్యాధిక్షేపణ, పతంజలి నుంచి సూటిగా వ్యవహరించటం అలవరచుకొన్నానని చెప్పారు. ఉత్పత్తితో సంబంధంగల భాషే అసలైన తెలుగు భాష అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇక్కడివారు తెలంగాణ సాహితీ పౌరసత్వం ఇస్తారో లేదో అనే అనుమానం కల్గుతోందని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఏటుకూరి ప్రసాద్, సమావేశకర్త డాక్టర్ సామల రమేశ్‌బాబు, తాపీ ధర్మారావు మనవరాలు విమలా సోహన్, కవులు, రచయితలు, పాత్రికేయులు, తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. -
జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో జేఏసీ?
హైదరాబాద్: తెలంగాణ జేఏసీలో లుకలుకలు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పార్టీ పెడుతున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో మరో జేఏసీ పురుడు పోసుకోనున్నదా? జేఏసీపట్ల అసంతృప్తిగా ఉన్న వ్యక్తులు, శక్తులను కూడగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి పలు ప్రజా సంఘాలు. ప్రజాసంఘాలు, మేధావులు, నేతలు కలసి మరో టీజేఏసీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ల ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలువులు ప్రజా సంఘాల నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికా జాత్యహంకార దాడులను ఖండించిన నేతలు ఇకపై తమ అంతర్గత సమావేశం ఉంటుందని, మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని కోరారు. ఐతే విలేకరులు స్పందించి సమావేశం అనంతరం విలేకరులకు ఏమైన వివరాలు చెబుతారా అని అడిగినప్పటికీ అలాంటిదేమీ లేదని జస్టిస్ చంద్రకుమార్ సమాధానం చెప్పారు. డాక్టర్ చెరుకు సుధాకర్ జోక్యం చేసుకుని వివరాలను విలేకరులకు చెప్పాలి కదా అన్నప్పటికి జస్టిస్ చంద్రకుమార్ సమాధానం దాటవేశారు. ఏది ఏమైనప్పటికీ త్వరలో మరో జేఏసీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి జేఏసీ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోపు జేఏసీకి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఆ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. -
ఆ పార్టీలకు పొత్తుల ఆలోచనలు వద్దు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కమ్యూనిస్టులు ఏ పార్టీతోనూ పొత్తుల కోసం ఆలోచించవద్దని.. దీని వల్ల పార్టీ క్యాడర్ దెబ్బ తింటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం–వామపక్షాల ఐక్య కార్యాచరణ, కమ్యూనిస్టుల ఐక్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆర్థిక పోరాటాలను రాజకీయ పోరాటాలుగా మార్చాలని సూచించారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తనది కమ్యూనిస్టు కులమని, తాను ఎప్పుడూ ప్యూడల్ విధానాన్ని ప్రోత్సహించలేదని అన్నారు. ఇవాల్టిదాకా కేసీఆర్‌ను కలవలేదని చెప్పారు. సీపీఐ శాసన సభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి ఎం.డి గౌస్, ఐఎస్యూసీఐ(సి) రాష్ట్ర నాయకులు మురహరి, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాధగోని రవి, రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, మాస్టార్జీ, నాయకులు కాలువ మల్లయ్య, ప్రొఫెసర్ విజయలక్ష్మి, సీపీఎం నాయకులు జి. రాములు తదితరులు పాల్గొన్నారు. -
మెదక్ ‘లాఠీచార్జీ’పై విచారణ జరిపించాలి
భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్ బహిరంగ చర్చకు మంత్రి హరీశ్ సిద్ధమా?: జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: మెదక్ జిల్లాలో భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జీ ఘటన, పూర్వాపరాలపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బయటి నుంచి వచ్చిన వారు రెచ్చగొట్టడం వల్లనే లాఠీచార్జీ జరిగిందని మంత్రి హరీశ్‌రావు చెబుతున్నారని.. లాఠీచార్జీలో గాయపడిన 175 మంది వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఘటన వివరాలను వారి ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది. ప్రాజెక్టుల కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నందున, నిర్వాసితులకు పరిహారంపై ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర కమిటీల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో కమిటీ గౌరవాధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, నిర్వాసితుల సమస్యలపై సమావేశాలు పెట్టే వాళ్లను, ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్లను జైళ్లలో వేస్తామని హెచ్చరించడానికి హరీశ్‌రావు ఎవరని ప్రశ్నించారు. భూములిచ్చేం దుకు రైతులు అంగీకారంతో ఉన్నారని హరీశ్ చెబుతున్నారని, దీనిపై బహిరంగచర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు భూసేకరణపై సీఎం జోక్యం చేసుకుని, వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కమిటీ కన్వీనర్ బి.వెంకట్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా రెఫరెండం నిర్వహించకపోతే తామే దానిని నిర్వహిస్తామన్నారు. భూ సేకరణలో రెవెన్యూ యంత్రాం గం టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. సమావేశంలో కమిటీ నాయకులు బొంతల చంద్రారెడ్డి, మచ్చా వెంకటేశ్వర్లు, మూడ్ ధర్మానాయక్, బండారు రవికుమార్, టి.సాగర్, బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు. -
అణచివేయాలని చూస్తే పుట్టగతులుండవు
మల్లన్నసాగర్ ఘటనపై జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్ : ‘ప్రజల్ని అణచివేసిన ప్రతి ప్రభుత్వం కూలిపోయింది. ప్రజల రక్తం చవి చూసిన ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పో యింది. ఇది సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలి. మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల చర్యను ఖండిస్తున్నాం’ అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ భూనిర్వాసితుల పోరాట కమిటీ సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొంతు నొక్కితే ఊరుకోం: చాడ చాడ మాట్లాడుతూ.. ‘ఉద్యమ పార్టీ అని చెప్పుకొంటూ టీఆర్ఎస్ ఉద్యమాలను అణచివేస్తోంది. అణచివేతే లక్ష్యంగా ప్రజల గొంతు నొక్కితే ఊరుకోం’ అన్నారు. నిరసనకారులను ఇంత దారుణంగా హింసించడం సరికాదని, దీని వెనుక కేసీఆర్, హరీశ్‌రావుల హస్తం ఉందని తమ్మినేని అన్నారు. రైతులు, మహిళలను హింసించడం సిగ్గుచేటని కోదండరెడ్డి అన్నారు. సీపీఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకుడు రంగారావు, సీపీఐఎంఎల్ అచ్యుతరావు, రైతు సంఘాల నాయకులు చంద్రారెడ్డి, రాంనర్సయ్య, రంగన్న, పీఓడబ్ల్యూ ఝాన్సీ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పరిస్థితి బాధాకరం
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పరిస్థితి బాధాకరంగా ఉందని, దీనికి ముఖ్యకారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 సెక్షన్ 30లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు కట్టేవరకు హైదరాబాద్ హైకోర్టే ఉమ్మడి కోర్టుగా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. తాళాలు చంద్రబాబు చేతిలో పెట్టి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామంటే లాభం లేదన్నారు. విభజన చట్టంలోని ఆర్టికల్ 30ని సవరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఏనాడైనా ఒత్తిడి తెచ్చారా..? లేక కనీసం ఓ లేఖైనా రాశారా అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం ఇక్కడ తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కోర్టులు పనిచేయడం లేదని, అడ్వొకేట్లు కోర్టును బాయ్‌కాట్ చేస్తున్నారని, ఊహించని విధంగా న్యాయమూర్తులు ఊరేగింపులు తీసే విచిత్ర పరిస్థితులు ఎదురౌతున్నాయని అన్నారు. దీనివల్ల కొంతమంది జైల్లోనే ఉండటం చాలా బాధాకరమన్నారు. చట్టం చేసే సమయంలో అశ్రద్ధ వహిస్తే ఇలానే ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 30తో పాటు ఆప్షన్స్ ఇచ్చే రూల్స్ మార్చాలని దీనిద్వారా ఒక అధికారి స్థానికత ఆధారంగా వారి ప్రాంతాలకు పంపవచ్చునని అన్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదుల ఆందోళనలో న్యాయం ఉందని అన్నారు. ఢిల్లీలో ఉండే వెంకయ్య నాయు డు ఇప్పట్లో ఆంధ్రాలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసుకోకుండా సవరణ శక్తిని ఉపయోగిస్తున్నారన్నారు. -
రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి
► సమస్య పరిష్కారానికి పోరాడుతాం ► తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ► రైతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీ కల్పించాలి : జస్టిస్ చంద్రకుమార్ ► వరంగల్ మార్కెట్లో రైతులతో మాటామంతీ ► రైతు సంక్షేమం పట్టించుకోవాలి జస్టిస్ చంద్రకుమార్ వరంగల్ సిటీ : తీవ్ర వర్షాభావంతో పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని తెలంగాణ జేఏ సీ చైర్మన్ప్రొఫెసర్ కోదండరాం కోరారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ గేట్ సమీపంలో గురువారం తెలంగాణ కార్మిక రైతు రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మార్త రాజయ్య అధ్యక్షతన గురువారం రైతు చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ మేరకు తొలుత కోదండరాం మార్కెట్‌ను సందర్శించారు. మిర్చి, పసుపు, పల్లి,పత్తి, మక్కల యూర్డులను ఆయన సందర్శించి రైతులతో మాట్లాడారు. పంట దిగుబడి, అందుతున్న ధరపై ఆరా తీయగా.. వర్షాభావ పరిస్థితులతో దిగుబడి తగ్గగా, మిర్చి యూర్డులో దళారుల బెడద ఉందని రైతులు వాపోయూరు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కరువు, రైతుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి.. వారికి న్యాయం చేసేంత వరకు పోరాడుతామని కోదండరాం తెలిపారు. ప్రోత్సాహకాలు, సబ్సిడీ కల్పించాలి పంటలు సాగు చేసే చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం నుంచి ప్రో త్సాహకాలు, సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ రైతు జేఏసీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. రైతు సదస్సులో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బ తింటే ఆదుకోవాలని కోరారు. సదస్సులో ఉత్తమ రైతు అవార్డు గ్రహీతలు బచ్చు వీరారెడ్డి, వి.వెంకటేశ్వర్రావు, ప్రతినిధులు అర్షం స్వామి, రాజు, ఈశ్వర్ పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యలను నివారిద్దాం
మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: రైతు ఆత్మహత్యల నివారణకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రైతన్నల ఆత్మహత్యలను నివారిద్దాం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం సంక్షేమంగా ఉండదన్నారు. పెట్టుబడి కూడా రాకపోవటంలో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వాలు గుర్తించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. మాజీ ఎంపీ మధుయాస్కీ మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతుకు మేలు చేసే విధానాలను అమలు చేసినప్పుడే బాధలు దూరమై సుస్థిరంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. ప్రొఫెసర్ జానయ్య మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభంలో లేదని, పాలకుల విధానాల వల్ల రైతులు మాత్రమే సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ పంటను నే రుగా ప్రభుత్వాలు తీసుకోకుండా దళారి వ్యవస్థను ప్రోత్సహించటంతో మార్కెట్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డా రు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల్లో కల్తీని అరికట్టాలని, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న 40 మంది రైతు కుటుంబాలకు తె లంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రూ.10 వేల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, బాబురావు, ఉమామహేశ్వర్, జితేందర్‌రెడ్డి, రమణమూర్తి, నాగరత్నం, నైనాల గోవర్ధన్, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జీవించే హక్కు లేకుండా పోతోంది
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ ప్రజల భవిష్యత్ రాజ్యాంగ చట్టాలపై ఆధారపడి ఉందని, చట్టాలను అమలు చేసే వారు సక్రమంగా అమలు చేస్తే అందరికీ సముచిత న్యాయం లభిస్తుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ, సంత్ రవిదాస్ చైతన్య వేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యంగ దినోత్సవం, మహాత్మజ్యోతిరావు పూలే వర్ధంతి సభ సందర్భంగా పూలే, అంబేద్కర్ల భావ జాలం - రాజ్యాంగం - సామాజిక న్యాయం అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ.. పాలనలో ఉన్నవారు చేసిన దుర్మార్గాల వల్ల జీవించే హక్కు లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ వై.బి.సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగంలో సవరణలు చేయవచ్చు కానీ ఎలాంటి మార్పులు లేకుండా చూడాలని ఆయన కోరారు. ప్రభంజన్‌యాదవ్, బంధు సొసైటీ అధ్యక్షులు పి. వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.