రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పరిస్థితి బాధాకరం
జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: ప్రస్తుతం రాష్ట్రంలో న్యాయవ్యవస్థ పరిస్థితి బాధాకరంగా ఉందని, దీనికి ముఖ్యకారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేనని రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014 సెక్షన్ 30లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు కట్టేవరకు హైదరాబాద్ హైకోర్టే ఉమ్మడి కోర్టుగా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారని ఆయన అన్నారు. తాళాలు చంద్రబాబు చేతిలో పెట్టి ఢిల్లీ వెళ్లి ధర్నా చేస్తామంటే లాభం లేదన్నారు. విభజన చట్టంలోని ఆర్టికల్ 30ని సవరించాలని కేంద్ర ప్రభుత్వంపై ఏనాడైనా ఒత్తిడి తెచ్చారా..? లేక కనీసం ఓ లేఖైనా రాశారా అని ఆయన ప్రశ్నించారు.
మంగళవారం ఇక్కడ తెలంగాణ ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కోర్టులు పనిచేయడం లేదని, అడ్వొకేట్లు కోర్టును బాయ్‌కాట్ చేస్తున్నారని, ఊహించని విధంగా న్యాయమూర్తులు ఊరేగింపులు తీసే విచిత్ర పరిస్థితులు ఎదురౌతున్నాయని అన్నారు. దీనివల్ల కొంతమంది జైల్‌లోనే ఉండటం చాలా బాధాకరమన్నారు. చట్టం చేసే సమయంలో అశ్రద్ధ వహిస్తే ఇలానే ఉంటుందని పేర్కొన్నారు. సెక్షన్ 30తో పాటు ఆప్షన్స్ ఇచ్చే రూల్స్ మార్చాలని దీనిద్వారా ఒక అధికారి స్థానికత ఆధారంగా వారి ప్రాంతాలకు పంపవచ్చునని అన్నారు. తెలంగాణ ఉద్యమ వేదిక కన్వీనర్ చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయమూర్తులు, న్యాయవాదుల ఆందోళనలో న్యాయం ఉందని అన్నారు. ఢిల్లీలో ఉండే వెంకయ్య నాయు డు ఇప్పట్లో ఆంధ్రాలో ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేసుకోకుండా సవరణ శక్తిని ఉపయోగిస్తున్నారన్నారు.