హైదరాబాద్: ప్రభుత్వానికి నిజంగా రైతులను ఆదుకోవాలనే చిత్తశుద్ధి ఉంటే కౌలు, పోడు రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి నాలుగు వేలు అందించాలని తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్ డిమాండ్ చేశారు. కౌలు, పోడు రైతులకు రైతుబంధు పథకం వర్తింపచేయాలనే డిమాండ్‌తో వచ్చే నెల రెండవ తేదీన∙అన్ని సంఘాలతో కలసి పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. మరునాడు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.
గురువారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడారు. వ్యవసాయాన్ని లాభసాటి వ్యవహారంగా చేయాలంటే ముందుగా గిట్టుబాటు ధర నిర్ణయించాలని, ప్రతి క్వింటా పంటకు వెయ్యి రూపాయల బోనస్ ఇవ్వాలని సూచించారు. వీటిని పట్టించుకోకుండా ఎన్ని జిమ్మిక్కులు చేసినా రైతులకు లబ్ధి చేకూరదని అభిప్రాయపడ్డారు.
వందలాది ఎకరాల భూములున్న అనేకమంది వ్యాపారులు, భూస్వాములు, ఉన్నతాధికారులకు రైతుబంధు ద్వారా లక్షలాది రూపాయలు అందిస్తూ కౌలురైతులను విస్మరించిందని అన్నారు. ఈ పథకం వల్ల సామాన్య రైతులకు లబ్ధి చేకూరడంలేదని, ప్రభుత్వం ఆర్భాటంగా ఇతర భాషల్లో కూడా ప్రచారం చేసి వంద కోట్లు ఖర్చుపెట్టిందని విమర్శించారు. ప్రచారానికి వెచ్చించిన ఆ డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇవ్వొచ్చుకదా? అని ప్రశ్నించారు.
రైతుబంధు పథకాన్ని పునఃపరిశీలించి కౌలు, పోడు రైతులకు వర్తింపచేయాలని, రైతులందరికీ వడ్డీలేని రుణాలివ్వాలని, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అవసరం మేర రైతులకు అందించాలని, ప్రతి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్ సాంబశివ గౌడ్, ఓట్ నీడ్ గ్యారెంటీ వ్యవస్థాపకురాలు సోగరా బేగం, మోహన్‌రాజ్, వేదవికాస్, సలీం, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment