
సాక్షి, హైదరాబాద్: రైతులకు అందుబాటులో ఉండటం,వారికి సాగు అంశాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం, ఏటా రైతు చైతన్య యాత్ర లు జరపడంలో బాధ్యత వహించాల్సిన క్షేత్రస్థాయి వ్యవసాయాధికారులు ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టాల్సి వస్తోంది. రైతుబంధు, రైతుబీమా పథకాలు వచ్చాక డేటా సేకరణ, పంపిణీ వంటి వాటిలో మునిగిపోవాల్సి వచి్చంది. రైతుబీమాతో ఇతర వ్యవ సాయ సంబంధిత పనులన్నింటినీ పక్కన పెట్టాల్సి వస్తోందన్న చర్చ జరుగుతోంది. దీనిపై క్షేత్రస్థాయిలో ఉండే వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) గగ్గోలు పెడుతున్నారు.
రైతుబీమాతోనే సరి: గతేడాది ఆగస్టు 14 నుంచి రైతుబీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే సంబంధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇవ్వడమే దీని ఉద్దేశం. ఈ పథకం అమలును ఏఈవోలపైనే పడేశారు. రైతు చని పోతే సంబంధిత వివరాలను ఎల్‌ఐసీ ఏజెంటు లేదా ఆ సంస్థ ప్రతినిధి తీసుకోవాలి. తదుపరి రైతు మరణ ధ్రువీకరణ పత్రం, ఇతరత్రా వివరాలన్నింటినీ వారే సేకరించి డాక్యుమెంటేషన్ చేయాలని వ్యవసాయ అధికారులు అంటున్నారు. కానీ రైతు చనిపోయిన పది రోజుల్లోనే వారి కుటుంబానికి పరిహారం అందాలంటే తామే అన్నీ భుజాన వేసుకోవాలని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఎల్‌ఐసీ ప్రతి నిధుల పనిని ఏఈవోలే చేయాల్సి వస్తోందని అంటున్నారు.