![Justice Chandrakumar Comments on BRS and BJP - Sakshi](/styles/webp/s3/article_images/2023/09/2/CHENDRAKUMAR.jpg.webp?itok=q4WV0I-Z)
మాట్లాడుతున్న రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధి, రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌కు ప్రధాని నరేంద్రమోదీతో లోపాయికారీ ఒప్పందం ఉందని ఆయన ఆరోపించారు. లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. జాగో తెలంగాణ సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రకుమార్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం రూ.60 వేల కోట్ల వరకు దోపిడీ చేసినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించేందుకే జాగో తెలంగాణ పేరుతో ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహించి చైతన్యం చేస్తున్నామని చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థను ధ్వంసం చేసి గల్లీకొక బెల్టు షాపు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విధ్వంసకర పాలన సాగుతోందని, ఇసుక, మట్టి, ల్యాండ్, లిక్కర్ మాఫియాలు చెలరేగుతున్నాయని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో భయంకరమైన అవినీతి కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
పాలమూరు అధ్యయన వేదిక కన్వి నర్ రాఘవాచారి మాట్లాడుతూ పాలమూరు జిల్లా తెలంగాణ ఉద్యమకాలంలో ఎలా ఉందో ప్రస్తుతం అలాగే ఉందని, వలసలు ఏమాత్రం ఆగలేదన్నారు. పాలమూరు రాజకీయ నేతల బానిసత్వం కూడా పోలేదన్నారు. సమావేశంలో జాగో తెలంగాణ సంస్థ ప్రతినిధులు ఖలీదా ఫరీ్వన్, ప్రొఫెసర్ వినాయకరెడ్డి, ప్రొఫెసర్ పద్మజాషా, జావిద్ ఖాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment