ఈ ఎన్నికలు.. రాహుల్‌ వర్సెస్‌ రైతన్నలు | BRS MLC K Kavitha slams Rahul Gandhi | Sakshi
Sakshi News home page

ఈ ఎన్నికలు.. రాహుల్‌ వర్సెస్‌ రైతన్నలు

Published Fri, Oct 27 2023 5:05 AM | Last Updated on Fri, Oct 27 2023 5:05 AM

BRS MLC K Kavitha slams Rahul Gandhi - Sakshi

నిజామాబాద్‌ నాగారం: రాష్ట్రంలో ఎన్నికలు రాహుల్‌గాంధీ వర్సెస్‌ రైతన్నల మధ్య జరుగుతున్నా యని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ వాళ్లకు రాహుల్‌ గాంధీ ఉంటే... తమకు రైతన్నలు ఉన్నారన్నారు. రైతుబంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని కోరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు, దళితబంధు ఆపాలని ఆ పార్టీ నాయకులు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌ చెబుతు న్నట్లు రైతుబంధు మాత్రమే ఆపేయాలా... లేక అన్ని పథకాలను ఆపేయాలా అని ప్రశ్నించారు. గురువారం నిజామాబాద్‌లో కవిత మీడియాతో మాట్లాడుతూ... సంక్షేమ పథకాల సృష్టికర్త కేసీఆర్‌ అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇస్తున్న పథకాలు ఆపుకుంటూ వెళ్లాలంటే ముందు కరెంట్‌ కట్‌ చేయాలని, ఆ తర్వాత మిషన్‌ భగీరథ నీళ్లు ఆపాలన్నారు. ఇలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ కూడా ఆపాల్సి వస్తుందన్నారు. వీటిని ఆపడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించారు. పదేళ్లుగా నడుస్తున్న ఈ పథకాలు కొత్తవని భావిస్తుంటే కాంగ్రెస్‌ ఎంతటి అభద్రతాభావంతో ఉందో అర్థమవుతోందన్నారు. సంక్షేమ పథకాలు నిలిపివేయాలని చూస్తే, రైతులను బాధపెడితే కాంగ్రెస్‌కే నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.

సోని యాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాహుల్‌ గాంధీలు ఏ హోదాలో గ్యారంటీలు ఇస్తున్నారని... ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గేను పక్కకు పెట్టి వారు గ్యారంటీలు ఇవ్వడమేంటని ప్రశ్నించారు. గాంధీలకే గ్యారంటీ లేదని వారిచ్చే గ్యారంటీలను ఎలా నమ్మాలని నిలదీశారు. రేవంత్‌ కామారెడ్డికి వచ్చినా, ఈటల గజ్వేల్‌లో పోటీ చేసినా తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కోరుట్లలో ఎమ్మెల్యేగా పోటీచేస్తే ఓడించడానికి తమ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారన్నారు. బోధన్, నిజామాబాద్‌తోపాటు పార్లమెంట్‌ నియోజకవర్గం జగిత్యాల నుంచి బోధన్‌ వరకు ప్రచారం చేస్తానని కవిత చెప్పారు. ఈసారి ఎన్నికల్లో హ్యాట్రిక్‌ కొట్టడమే కాకుండా 100కు పైగా సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement