సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాష్ట్రంలో ఏ పార్టీ గాలి వీచినా, ప్రాబల్యం పెంచుకుంటున్నా దానికి మొదటి అడుగు ఇందూరులోనే పడుతుందనేది స్పష్టమవుతోంది. బీఆర్‌ఎస్ ఉద్యమ పార్టీలతో ప్రజల్లోకి వెళ్లడం, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించడానికి పునాదిగా నిలిచింది కూడా ఇందూరు జిల్లానే. ఇక్కడ జిల్లా ప్రజాపరిషత్ గెలుపుతో కేసీఆర్ తన ప్రస్థానాన్ని మరింత పెంచుకుంటూ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా బీజేపీకి కూడా ఇందూరు జిల్లానే ఊతంగా నిలుస్తోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి అనూహ్యంగా బీజేపీ తరుపున బరిలో నిలిచిన అర్వింద్‌ను ఎంపీగా ఎన్నుకున్నారు ఇక్కడి ఓటర్లు.
కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు..
ప్రస్తుత ఎన్నికల్లో పూర్తిగా జవసత్వాలు కోల్పోయిన కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు కట్టబెట్టి రాష్ట్రంలో అధికారం వచ్చేలా చేయడంలో ఇందూరు పాత్ర చెప్పు కోదగింది. మరోవైపు బీజేపీని మూడు స్థానా ల్లో గెలిపించడం విశేషం. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీని గెలిపించడంతో పాటు ఈసారి ఏకంగా బీజేపీకి మూడు సీట్లు కట్టబెట్టడం విశేసం. గతంలో ఇక్కడ మొదటి జిల్లా ప్రజాపరిషత్‌కు పట్టం గట్టి రాష్ట్రం వచ్చాక వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసేలా అవకాశం ఇచ్చిన జిల్లా ప్రజలు ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీకి గేట్‌వే మాదిరిగా బాటలు వేస్తుండడం గమనార్హం. ఇందూరు ఉమ్మడి జిల్లా ప్రజలు రాష్ట్రంలోనే ప్రత్యకంగా తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 4, బీజేపీకి 3, బీఆర్‌ఎస్‌కు 2 సీట్లు ఇచ్చారు. కాగా బీజేపీ జాతీయ నాయకత్వం కూడా పసుపు బోర్డు ప్రకటన నుంచి నిజాం షుగర్స్ తెరిపిస్తామనే వరకు, ఇతర అంశాల్లో ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుండడం విశేషం.
తాజాగా కామారెడ్డి శాసనసభ స్థానంలో నిలిచిన సీఎం కేసీఆర్‌కు, సీఎం అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఏకకాలంలో ఓటమి రుచి చూ పించారు ఓటరు మహాశయులు. వీరిద్దరినీ కాదని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి పట్టం కట్టారు. దీంతో కామారెడ్డి ప్రజలు చరిత్రపుటల్లో తమకు తిరుగులేని ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్నారు. ఈ ఫలితం జాతీయస్థాయిలో సంచలనం కలిగించింది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉమ్మడి ఇందూరు ప్రత్యేకతలు అనేకం ఉన్నాయి.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో..
రాష్ట్రంలోనే అత్యధికంగా బీజేపీకి ఓట్లు ఇచ్చిన ఇందూరు జిల్లా పార్టీకి ప్రాబల్యం పెంచే విషయంలో గేట్‌వేగా నిలిచింది. ఇప్పటికే మూడుసీట్లు దక్కించుకున్న బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య రానున్న పార్లమెంట్ ఎన్నికలు పోటాపోటీగా జరిగే అవకాశాలు పెరిగాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో కవిత బీజేపీ చేతిలో ఓడిపోగా ఈసారి కేసీఆర్ కామారెడ్డిలో ఓటమి చవిచూశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నిజామాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలో 45.22 శాతంతో 4,80,584 ఓట్లు వచ్చాయి. ఇక తాజా శాసనసభ ఎన్నికల్లో కూడా ఉమ్మడి జిల్లాలో, నిజామాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలోని కోరుట్ల, జగిత్యాల సెగ్మెంట్లలో సైతం బీజేపీకి భారీగా ఓట్ల శాతం పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment