తెలంగాణ రాజకీయాలలో పార్లమెంటు ఎన్నికలు కీలకం కాబోతున్నాయి. ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ఒక పెద్ద పరీక్ష కాబోతుండగా, బీజేపీకి ఒక గేమ్‌గా మారబోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. దానికి కారణం తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండి ప్రతిపక్షంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ తన ఉనికిని నిలబెట్టుకుంటుందా? లేదా? అన్నది ఒకటైతే.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఆధిక్యతను రుజువు చేసుకోలేకపోతే తదనంతర పరిణామాల వల్ల నష్టపోయే అవకాశం ఉందన్న భావన మరొకటి అని చెప్పాలి.
బీఆర్‌ఎస్ విషయం చూద్దాం. రాజకీయాలలో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రుజువు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అభివృద్ది సంగతి ఎలా ఉన్నా, వ్యక్తిగతంగా అహంభావంతో వ్యవహరించారన్న విమర్శ తెలంగాణ వ్యాప్తంగా ఉంది. సొంత పార్టీవారిని కూడా పెద్దగా కలవకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, శాసనసభ ఎన్నికలలో కొంతమంది అభ్యర్ధులను మార్చవలసి ఉన్నా, మార్చకపోవడం, తనపైనే అంతా నడుస్తుందన్న అభిప్రాయంతో రాజకీయం చేయడం వంటి కారణాల వల్ల ప్రజలలో అసమ్మతి ఏర్పడింది. నిజానికి ఆయన ఓ ఇరవై, ముప్పై మంది అభ్యర్దులను మార్చి ఉంటే తిరిగి అధికారంలోకి వచ్చేవారన్నది ఎక్కువ మంది ఫీలింగ్.
సాధారణ ఎన్నికల ముందు వివిధ ఉప ఎన్నికలలో డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారం చేజిక్కించుకుందంటే ప్రజల అభిప్రాయాలు ఎంత త్వరగా మారతాయో గమనించవచ్చు. ఆ విషయాన్ని కేసీఆర్ పసికట్టలేకపోయారు. అక్కడికీ హైదరాబాద్ ప్రాంతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన వివిధ అభివృద్దిపనులు, విద్యుత్ సరఫరాలో ఇబ్బంది లేకుండా చూడడం వంటి కారణాలతో బీఆర్‌ఎస్ స్వీప్ చేసింది. కానీ ఇతర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాలలో బాగా దెబ్బతింది. ఫలితంగా అధికారాన్నే వదలుకోవల్సి వచ్చింది. అధికారం పోయిన తర్వాత సొంత పార్టీ నేతల వ్యవహార సరళి ఎలా మారిపోయిందో చూడవచ్చు. అంతవరకు కేసీఆర్ పిలిస్తే చాలు అన్నట్లుగా ఉన్న నేతలు కొందరు ఓటమి తర్వాత మొహం చాటేసేవారు.
కేసీఆర్ సొంత పార్టీని పునాదుల నుంచి నిర్మించుకోవడం కన్నా ఇతరపార్టీల నేతలను తీసుకు వచ్చి అందలం ఎక్కించడం ద్వారా బలపడదామని అనుకున్నారు. కానీ అదే బెడిసికొట్టింది. ఉదాహరణకు సీనియర్ నేత కే. కేశవరావు మూడుసార్లు రాజ్యసభ సభ్యుడు అయ్యారంటే అది కేసీఆర్ పుణ్యమే అని చెప్పకతప్పదు. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన జారుకున్నారు. కేశవరావుకు ఉన్న ప్రజాబలం పునాది చాలా తక్కువే అయినా, కేవలం నోరు పెట్టుకుని రాజకీయాలలో చెలామణి అయ్యారంటే అతిశయోక్తి కాదు. మరో నేత కడియం శ్రీహరి టీడీపీ నుంచి వచ్చిన నేత అయినా.. ఆయన్ని ఉప ముఖ్యమంత్రిని చేశారు. కానీ ఆ తర్వాత కాలంలో ప్రాధాన్యత తగ్గించారన్న భావన ఉంది. కడియం శ్రీహరి కోరుకున్నట్లు ఆయన కుమార్తెకు ఎంపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అయినా దానిని వదలుకుని కాంగ్రెస్‌లోకి వెళ్లడం పార్టీకి పెద్ద షాక్ అని చెప్పాలి. దాంతో బీఆర్‌ఎస్ బలహీనపడుతోందన్న సంకేతం జనంలోకి వెళ్లింది.
మరో కాంగ్రెస్ నేత దానం నాగేందర్‌కు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌లోకి వెళ్లి ఎంపీ అభ్యర్థి అయ్యారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ బాటలోనే ఉన్నారు. కానీ వారంతా పార్లమెంటు ఎన్నికల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌కు నాలుగు, ఐదు సీట్లు వస్తే వలసలు తగ్గుతాయి. కరీంనగర్, మెదక్, సికింద్రాబాద్, వరంగల్, పెద్దపల్లి, ఖమ్మం, నాగర్ కర్నూలు సీట్లలో కొన్ని రాకపోతాయా? అని ఆశాభావంగా ఉంది. కానీ ఇప్పుడు ఉన్న అంచనాల ప్రకారం ఒకటి లేదా రెండు వస్తే గొప్పేనని అంటున్నారు.
మెదక్ సీటుపై కొంత ఆశ ఉంది. సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలలో వచ్చే మెజార్టీతో గట్టెక్కవచ్చన్నది వారి ఆలోచనగా ఉంది. ఒకవేళ ఈ సీటు కూడా రాకపోతే పార్టీకి కష్టాలు తప్పవు. కేసీఆర్ జారి గాయపడి కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వెళ్లకపోవడం కొంత నష్టం చేసిందని చెప్పాలి. ఎమ్మెల్యేలలో విశ్వాసం తగ్గింది. కేటీఆర్, హరీష్‌రావు వంటివారు ఎంత గట్టిగానే పనిచేసినా, ప్రతిపక్ష నేత అసెంబ్లీలోకి రాకపోవడం బలహీనతగానే చూడాలి. పార్లమెంటు ఎన్నికలలో కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టిన తర్వాతే పార్టీకి మళ్లీ ఊపిరి పోసినట్లయింది. జనం పెద్ద ఎత్తున తరలిరావడం ఉపశమనం కలిగించింది. అయినా ఓట్లు పడతాయా?లేదా? అనేది చెప్పలేని పరిస్థితి.
పార్లమెంటు ఎన్నికలలో ఐదు సీట్లు గెలిచినా, లేకపోయినా కేసీఆర్ వ్యవహరించే శైలిపైనే ఆయన పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రజలు తమ ఓట్లను ఈ ఎన్నికలలో బీజేపీకి వేశారన్న అభిప్రాయం ప్రబలింది. బీఆర్‌ఎస్ గెలవలేదన్న భావనతో పలువురు ఇలా చేశారన్నది ఒక వాదన. దీనిని కేసీఆర్ కానీ, ఆయన పార్టీవారు కానీ అంగీకరించకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఈ ఐదేళ్లు నిలబడుతుందా? లేక బీజేపీ పుంజుకుని బీఆర్‌ఎస్‌ను దెబ్బతీస్తుందా? అన్నది ఫలితాలను బట్టి ఉండవచ్చు.
కాంగ్రెస్ పార్టీ కనీసం ఏడెనిమిది సీట్లు తెచ్చుకోగలిగితే ఆ పార్టీవైపు బీఆర్‌ఎస్ నేతలు చూడవచ్చు. అదే బీజేపీ కనుక ఎనిమిది పైగా సీట్లు తెచ్చుకుంటే బీఆర్‌ఎస్ పై నమ్మకం కోల్పోయినవారు ఆ పార్టీవైపు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. బీఆర్‌ఎస్‌ను పూర్తిగా దెబ్బతీయడం ద్వారా తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ యత్నిస్తోంది. ముందుగా దీనిని నిరోధించడం పెద్ద సవాలు అవుతుంది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీలనుంచి ఫిరాయింపులపైన అధిక దృష్టి పెట్టారు. ఇతర పార్టీలను బలహీనపర్చడం వేరు. తనపార్టీని క్షేత్ర స్థాయి నుంచి పటిష్టం చేసుకోవడం వేరు. కేసీఆర్ మొదటి నుంచి ఈ విషయంలో అంత గట్టిగా లేరనే చెప్పాలి.
తెలంగాణ ఉద్యమం పెరగడానికి కారణం అయనే అయినప్పటికీ 2009లో టీఆర్ఎస్‌కు పది అసెంబ్లీ సీట్లే రావడం అప్పట్లో అశనిపాతం అయింది. ఆ రోజుల్లో ఆయన ఒక దశలో నిస్పృహలోకి వెళ్లారన్న వార్తలు కూడా వచ్చాయి. అంతలో ఆనాటి సీఎం రాజశేఖరరెడ్డి మరణంతో రాజకీయ పరిణామాలు వేగంగా ఆయనకు అనుకూలంగా మారాయి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం రావడం, కేసీఆర్ సీఎం కావడం, తొమ్మిదిన్నరేళ్లు నిర్విఘ్నంగా కొనసాగడం జరిగాయి. టీఆర్ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం, ఇతర రాష్ట్రాలలో పార్టీని విస్తరింప చేయడం కోసం ప్రయత్నించడం వంటివి కూడా జనానికి పెద్దగా నచ్చలేదు. పేరు మార్చడమే చాలా మందికి ఇష్టం లేదు.
అప్పట్లో కాంగ్రెస్‌ను వీక్ చేయడానికి కేసీఆర్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలను బట్టి వారు బీఆర్‌ఎస్‌లో కొనసాగడమా? లేక కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరడంపై ఆలోచన చేస్తారు. కేసీఆర్ వీటిని పట్టించుకోనవసరం లేదు. ఆయన నిత్యం ప్రజలలో ఉంటూ, ఐదేళ్ల పాటు పార్టీని నిలబెట్టుకుంటే వచ్చే ఎన్నికలలో బీఆర్‌ఎస్ విజయావకాశాలు పెంచుకోవచ్చు. కానీ కేసీఆర్ అంత సహనంతో, ఓపికతో రాజకీయం చేయవలసి ఉంటుంది. గత పార్లమెంటు ఎన్నికలలో నాలుగు సీట్లు బీజేపీ గెలుచుకున్నప్పుడే కేసీఆర్ అప్రమత్తం అయి ఉండవలసింది. బీజేపీతో అనవసర వివాదాలకు వెళ్లి కొంత నష్టపోయారు. తన కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టు అవడం కూడా కొంత అప్రతిష్టగా మారింది.
ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆయన బీజేపీవైపు వెళ్లలేరు. అలాగని కాంగ్రెస్‌తో స్నేహం చేయలేరు. సొంతంగా పార్టీ నిలబడాలంటే కేసీఆర్ చాలా కష్టపడవలసి ఉంటుంది. నిత్యం ప్రజలలోనే సంచరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలగాలి. ఈ లోగా తన ప్రభుత్వ హయాంలో జరిగిన స్కాములు ఆయన మెడకు చుట్టుకోకుండా ఉండాలి. ఐదేళ్లపాటు బీఆర్‌ఎస్ నిలబడగలిగితే, అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏర్పడే అసంతృప్తిని క్యాష్ చేసుకుని మళ్లీ అధికారంలోకి రాగలుగుతారు. అంత వరకు వేచి ఉండే ఓపిక, పోరాడే శక్తి కేసీఆర్‌కు ఉన్నాయా? అన్నదే ప్రశ్న.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment