సాక్షి, హైదరాబాద్: ‘మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రిని కలిసినా మీ వ్యక్తిత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. కాంగ్రెస్ నేతల ట్రాప్‌లో ఎమ్మెల్యేలెవరూ పడొద్దు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలి’అని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. ఎమ్మెల్యేగా గురువా రం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నందినగర్‌లోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈ భేటీ లో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. త్వరలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, ఇతర అంశాలపై కూడా పలు సూచనలు చేశారు.
ప్రజల సమక్షంలోనే వినతిపత్రాలు ఇవ్వండి
‘నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసం ప్రజల సమక్షంలోనే మంత్రులకు వినతిపత్రాలు ఇవ్వండి. వారి నివాసాలు, క్యాంప్ ఆఫీసులకు వెళ్లకుండా వారి కార్యాలయాల్లో కలిసి సమస్యలు విన్నవించండి. కాంగ్రెస్ పార్టీని విమర్శించడంలో తొందర అవసరం లేదు. వారిని పెద్దగా తిట్టాల్సిన అవసరం కూడా లేదు. కాంగ్రెస్ నేతలు వాళ్లను వాళ్లే తిట్టుకోవడం త్వరలోనే చూస్తాం. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదు. అవి హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత ప్రారంభమవుతుంది. బీఆర్‌ఎస్‌పై ప్రజలు నమ్మకం కోల్పోలేదు. ప్రతిపక్షంలో ఉన్నామని అధైర్యపడొద్దు, ప్రతిపక్షంలో ఉండటం తప్పుకాదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సన్నద్ధం కావాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు.
రాజీలేని పోరాటం చేసేది బీఆర్‌ఎస్ మాత్రమే ‘
తెలంగాణను సాధించి, స్వరాష్ట్రాన్ని పదేళ్ల కాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించాం. బీఆర్‌ఎస్ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది. ప్రభుత్వ విధానాలను నిశితంగా అ«ధ్యయనం చేస్తూ గాడి తప్పిన ప్రతీ సందర్భంలో ఎండగడదాం. ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారంలో అండగా నిలబడాలి’అని కేసీఆర్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment