అణచివేయాలని చూస్తే పుట్టగతులుండవు
మల్లన్నసాగర్ ఘటనపై జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్ : ‘ప్రజల్ని అణచివేసిన ప్రతి ప్రభుత్వం కూలిపోయింది. ప్రజల రక్తం చవి చూసిన ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పో యింది. ఇది సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలి. మల్లన్నసాగర్ నిర్వాసితులపై పోలీసుల చర్యను ఖండిస్తున్నాం’ అని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. తెలంగాణ భూనిర్వాసితుల పోరాట కమిటీ సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహిం చిన విలేకరుల సమావేశంలో జస్టిస్ చంద్రకుమార్‌తో పాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోదండరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గొంతు నొక్కితే ఊరుకోం: చాడ
చాడ మాట్లాడుతూ.. ‘ఉద్యమ పార్టీ అని చెప్పుకొంటూ టీఆర్‌ఎస్ ఉద్యమాలను అణచివేస్తోంది. అణచివేతే లక్ష్యంగా ప్రజల గొంతు నొక్కితే ఊరుకోం’ అన్నారు. నిరసనకారులను ఇంత దారుణంగా హింసించడం సరికాదని, దీని వెనుక కేసీఆర్, హరీశ్‌రావుల హస్తం ఉందని తమ్మినేని అన్నారు. రైతులు, మహిళలను హింసించడం సిగ్గుచేటని కోదండరెడ్డి అన్నారు. సీపీఎంఎల్ న్యూడెమొక్రసీ నాయకుడు రంగారావు, సీపీఐఎంఎల్ అచ్యుతరావు, రైతు సంఘాల నాయకులు చంద్రారెడ్డి, రాంనర్సయ్య, రంగన్న, పీఓడబ్ల్యూ ఝాన్సీ పాల్గొన్నారు.