
హైదరాబాద్: ప్రైవేటు యూనివర్సిటీల బిల్లు వస్తే విద్య పూర్తిగా వ్యాపారంగా మారుతుందని తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లులో రిజర్వేషన్లు ఉండవని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యను ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించడం దారుణమన్నారు.
ఈ అరెస్టులను చూస్తుంటే రాష్ట్రంలో అసలు ప్రాథమిక హక్కులనేవి ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన అంకెళ్ల పృధ్వీరాజ్, చందన్‌లను వెంటనే విడుదల చేయాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను బేషరతుగా ఎత్తేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు నలమాస కృష్ణ, పీవోడబ్ల్యూ సంధ్య, వేదిక కార్యదర్శి చిక్కుడు ప్రభాకర్ పాల్గొన్నారు.