రైతు ఆత్మహత్యలను నివారిద్దాం
మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: రైతు ఆత్మహత్యల నివారణకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రైతన్నల ఆత్మహత్యలను నివారిద్దాం’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం, రైతు ఏడ్చిన రాజ్యం సంక్షేమంగా ఉండదన్నారు. పెట్టుబడి కూడా రాకపోవటంలో అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అయినా ప్రభుత్వాలు గుర్తించకపోవటం బాధాకరమని పేర్కొన్నారు. మాజీ ఎంపీ మధుయాస్కీ మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా రైతుకు మేలు చేసే విధానాలను అమలు చేసినప్పుడే బాధలు దూరమై సుస్థిరంగా వ్యవసాయం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయన్నారు.
ప్రొఫెసర్ జానయ్య మాట్లాడుతూ వ్యవసాయం సంక్షోభంలో లేదని, పాలకుల విధానాల వల్ల రైతులు మాత్రమే సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ పంటను నే రుగా ప్రభుత్వాలు తీసుకోకుండా దళారి వ్యవస్థను ప్రోత్సహించటంతో మార్కెట్‌లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అభిప్రాయపడ్డా రు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల్లో కల్తీని అరికట్టాలని, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న 40 మంది రైతు కుటుంబాలకు తె లంగాణ రైతు సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రూ.10 వేల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి, ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి, బాబురావు, ఉమామహేశ్వర్, జితేందర్‌రెడ్డి, రమణమూర్తి, నాగరత్నం, నైనాల గోవర్ధన్, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.