జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో జేఏసీ?
హైదరాబాద్: తెలంగాణ జేఏసీలో లుకలుకలు, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పార్టీ పెడుతున్నారన్న వార్తలు షికార్లు చేస్తున్న నేపథ్యంలో మరో జేఏసీ పురుడు పోసుకోనున్నదా? జేఏసీపట్ల అసంతృప్తిగా ఉన్న వ్యక్తులు, శక్తులను కూడగట్టే ప్రయత్నాలు సాగుతున్నాయా? అంటే అవుననే అంటున్నాయి పలు ప్రజా సంఘాలు. ప్రజాసంఘాలు, మేధావులు, నేతలు కలసి మరో టీజేఏసీని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, తెలంగాణ ఉద్యమ వేదిక అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌ల ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పలువులు ప్రజా సంఘాల నేతలు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా అమెరికా జాత్యహంకార దాడులను ఖండించిన నేతలు ఇకపై తమ అంతర్గత సమావేశం ఉంటుందని, మీడియా ప్రతినిధులు బయటకు వెళ్లిపోవాలని కోరారు. ఐతే విలేకరులు స్పందించి సమావేశం అనంతరం విలేకరులకు ఏమైన వివరాలు చెబుతారా అని అడిగినప్పటికీ అలాంటిదేమీ లేదని జస్టిస్ చంద్రకుమార్ సమాధానం చెప్పారు. డాక్టర్ చెరుకు సుధాకర్ జోక్యం చేసుకుని వివరాలను విలేకరులకు చెప్పాలి కదా అన్నప్పటికి జస్టిస్ చంద్రకుమార్ సమాధానం దాటవేశారు.
ఏది ఏమైనప్పటికీ త్వరలో మరో జేఏసీకి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి జేఏసీ రూపకల్పనకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈలోపు జేఏసీకి సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని ఆ నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.