మాట్లాడుతున్న జస్టిస్ చంద్రకుమార్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: కమ్యూనిస్టులు ఏ పార్టీతోనూ పొత్తుల కోసం ఆలోచించవద్దని.. దీని వల్ల పార్టీ క్యాడర్ దెబ్బ తింటుందని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన సూచించారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎంసీపీఐ(యు) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘సామాజిక న్యాయం–వామపక్షాల ఐక్య కార్యాచరణ, కమ్యూనిస్టుల ఐక్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ ఆర్థిక పోరాటాలను రాజకీయ పోరాటాలుగా మార్చాలని సూచించారు.
మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ తనది కమ్యూనిస్టు కులమని, తాను ఎప్పుడూ ప్యూడల్ విధానాన్ని ప్రోత్సహించలేదని అన్నారు. ఇవాల్టిదాకా కేసీఆర్‌ను కలవలేదని చెప్పారు. సీపీఐ శాసన సభాపక్ష మాజీ నేత గుండా మల్లేష్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, ఎంసీపీఐ(యు) జాతీయ కార్యదర్శి ఎం.డి గౌస్, ఐఎస్‌యూసీఐ(సి) రాష్ట్ర నాయకులు మురహరి, ఎంసీపీఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గాధగోని రవి, రాష్ట్ర కార్యదర్శి తాండ్ర కుమార్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, మాస్టార్జీ, నాయకులు కాలువ మల్లయ్య, ప్రొఫెసర్ విజయలక్ష్మి, సీపీఎం నాయకులు జి. రాములు తదితరులు పాల్గొన్నారు.