సాక్షి, హైదరాబాద్: ‘కమ్యూనిస్టులను కేసీఆర్ దూరం పెట్టడానికి ప్రధాన కారణం బీజేపీకి భయపడటమే. ఒకవేళ పొత్తు కుదిరితే కమ్యూనిస్టులు ఒకే వేదికపై బీజేపీని విమర్శిస్తారు. ఇది కేసీఆర్‌కు ఇబ్బందికరమైన అంశం. అలా చేస్తే కేసీఆర్‌ను బీజేపీ సహించదు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మళ్లీ బీజేపీనే వస్తే ఏమవుతుందోనని కేసీఆర్‌కు భయం పట్టుకుంది’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ పట్ల బీఆర్‌ఎస్ వైఖరి మారడం వల్లే ఆ పార్టీ తో పొత్తు కుదరలేదన్నారు.
ఆ తర్వాత కాంగ్రెస్ తమను సంప్రదించిందని చెప్పారు. తమకు భయపడే కాంగ్రెస్ పొత్తుల విషయంలో కిరికిరి చేసిందన్నారు. కొన్ని జిల్లాల్లో తమ పార్టీ ఉనికినే దెబ్బతీయాలనేది వాళ్ల కుట్ర అని ఆరోపించారు. సీపీఐ, సీపీఎంతో పొత్తు పెట్టుకుంటే కాంగ్రెస్‌కు నష్టమని కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తమ్మినేని మండిపడ్డారు. రెండు ఎమ్మెల్సీలు ఇస్తామని, అధికారం వస్తే సోనియాతో మాట్లాడి చెరో మంత్రి పదవి ఇప్పిస్తామనడంపై ధ్వజమెత్తారు. 1996లో జ్యోతిబసును ప్రధానిని చేస్తామంటేనే తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు.
అధికార పార్టీపై ఎదురుగాలి...
బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఈ తొమ్మిదేళ్లలో ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని తమ్మినేని అన్నారు. ఈ ప్రభుత్వంపై ప్రస్తుతానికి ఎదురుగాలి వీస్తోందని, అయితే, అధికారం కోల్పోయేంత ఎదురుగాలి వీస్తుందో లేదో చూడాలన్నారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. కాంగ్రెస్‌లో ఇప్పుడు చేరిన అనేక మంది నాయకులు అప్పుడు బీజేపీతో మంతనాలు జరిపిన వారేనన్నారు.
బీఆర్‌ఎస్‌ను ఎవరు ఓడించగలరో ఆలోచిస్తున్నామని, మునుగోడు ఉప ఎన్నిక తర్వాత నిర్ణయం తీసుకుంటామని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వంటి వారు చెప్పారన్నారు. మునుగోడులో బీజేపీ గెలిచినట్లయితే ఇప్పుడు కాంగ్రెస్ ఇలా ఉండేది కాదన్నారు. బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ నుంచి ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌లా మారిందన్నారు. బీజేపీ ఐదారు సీట్లలో గెలిచే అవకాశముందనీ, అక్కడ ఆ పార్టీని ఓడించే సత్తా ఉన్న బీఆర్‌ఎస్ లేదా కాంగ్రెస్ లేదా ఇతర లౌకిక ప్రజాతంత్ర అభ్యర్థులకు ఓటేస్తామన్నారు.
మగదేవుళ్ల ఆధిపత్యం
సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారడం వల్ల కమ్యూనిస్టులు కొంత వెనుకబడుతున్నారని తమ్మినేని చెప్పారు. కమ్యూనిస్టులు ఇప్పటివరకు ఆర్థిక అంశాలపైనే దృష్టిపెట్టారన్నారు. కడుపు నిండే డిమాండ్లపైనే దృష్టిపెట్టామని, మైండ్‌ను వదిలేశామన్నారు. పార్టీ ఆలోచనా విధానంలో మార్పు రావాలని, సామాజిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. క్యాపిటలిజంలో సజీవ దేవుళ్లు అంటే బాబాలు ఉంటారన్నారు. వెంకటేశ్వరస్వామి, శ్రీకృష్ణుడు వంటి దేవుళ్లంతా ఫ్యూడల్ సమాజంలో భాగమేనన్నారు. ఇంకా వెంకటేశ్వరస్వామి ఆధిపత్యమే ఉందన్నారు. సమాజంలో మగదేవుళ్ల ఆధిపత్యమే ఉందని చెప్పారు. మగ ఆధిపత్యం ఎక్కడున్నా అది ఫ్యూడల్ సమాజమే అవుతుందన్నారు.
వచ్చేసారి పార్టీ రాష్ట్ర కార్యదర్శి మారుతాడేమో...
పార్టీ లో ఇంకా కమ్మ, రెడ్డోళ్ల ఆధిపత్యమేనా? జెండాలు మోసేది మాత్రం అణగారిన వర్గాలా అన్న ప్రశ్నపై తమ్మినేని స్పందిస్తూ... ‘కమ్యూనిస్టు ఉద్యమం అనేది రెవెల్యూషనరీ మూవ్‌మెంట్. నాలెడ్జ్ లేకుండా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లలేం. కొన్ని వేల సంవత్సరాల వరకు కొన్ని కులాలకు చదువు, జ్ఞానం నిషేధం. నాలెడ్జ్ సంపాదించకుండా అభ్యుదయ ఉద్యమాలకు రావడం అసాధ్యమైన విషయం. ఆస్తి, చదువు సమకూరినప్పుడు అక్కడ విజ్ఞానానికి అవకాశం ఉంటుంది.
ఈ చారిత్రక అసమతుల్యతను సరిదిద్దేందుకు కమ్యూనిస్టులు కృషిచేస్తున్నారు. తెలంగాణలో 33 జిల్లాల్లో ఐదారు జిల్లాలు తప్ప ఓసీలు ఎక్కడా సీపీఎం జిల్లా కార్యదర్శులుగా లేరు. ఎస్సీల జనాభా ఎంతుందో అంతమంది జిల్లా కార్యదర్శులున్నారు. బీసీ జనాభా ఎంతుందో అంతకంటే ఎక్కువగా పార్టీ కార్యదర్శులున్నారు. రాష్ట్ర కార్యదర్శి (తమ్మినేని) ఒకడున్నాడు. బహుశా వచ్చేసారి అది కూడా ఆలోచిద్దాం. ఒక్క లీడర్‌ను బట్టి కమ్మ అనడం సరికాదు. పార్టీలో చాలా మార్పులు తెచ్చామని’తమ్మినేని చెప్పారు. సీపీఐ, సీపీఎం ఐక్యమయ్యే అవకాశముందని, అయితే, దానికి సమయం పడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment