మెదక్ ‘లాఠీచార్జీ’పై విచారణ జరిపించాలి
భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్
బహిరంగ చర్చకు మంత్రి హరీశ్ సిద్ధమా?: జస్టిస్ చంద్రకుమార్
హైదరాబాద్: మెదక్ జిల్లాలో భూ నిర్వాసితులపై జరిగిన లాఠీచార్జీ ఘటన, పూర్వాపరాలపై న్యాయ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని భూ నిర్వాసితుల పోరాట కమిటీ డిమాండ్ చేసింది. బయటి నుంచి వచ్చిన వారు రెచ్చగొట్టడం వల్లనే లాఠీచార్జీ జరిగిందని మంత్రి హరీశ్‌రావు చెబుతున్నారని.. లాఠీచార్జీలో గాయపడిన 175 మంది వివరాలు తమ వద్ద ఉన్నాయని, ఘటన వివరాలను వారి ద్వారా తెలుసుకోవచ్చని తెలిపింది. ప్రాజెక్టుల కోసం రైతులు స్వచ్ఛందంగా భూములు ఇస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నందున, నిర్వాసితులకు పరిహారంపై ముంపు ప్రాంతాల్లో స్వతంత్ర కమిటీల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని డిమాండ్ చేసింది. బుధవారం హైదరాబాద్‌లో కమిటీ గౌరవాధ్యక్షుడు జస్టిస్ బి.చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ, నిర్వాసితుల సమస్యలపై సమావేశాలు పెట్టే వాళ్లను, ఉద్యమాలకు నాయకత్వం వహించే వాళ్లను జైళ్లలో వేస్తామని హెచ్చరించడానికి హరీశ్‌రావు ఎవరని ప్రశ్నించారు.
భూములిచ్చేం దుకు రైతులు అంగీకారంతో ఉన్నారని హరీశ్ చెబుతున్నారని, దీనిపై బహిరంగచర్చకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రాజెక్టులకు భూసేకరణపై సీఎం జోక్యం చేసుకుని, వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలని కమిటీ కన్వీనర్ బి.వెంకట్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులకు పరిహారంపై రాష్ట్ర ప్రభుత్వం వారంలోగా రెఫరెండం నిర్వహించకపోతే తామే దానిని నిర్వహిస్తామన్నారు. భూ సేకరణలో రెవెన్యూ యంత్రాం గం టీఆర్‌ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నదని ధ్వజమెత్తారు. సమావేశంలో కమిటీ నాయకులు బొంతల చంద్రారెడ్డి, మచ్చా వెంకటేశ్వర్లు, మూడ్ ధర్మానాయక్, బండారు రవికుమార్, టి.సాగర్, బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.