మే ఐ కమిన్ సార్! | May I kamin sir! | Sakshi
Sakshi News home page

మే ఐ కమిన్ సార్!

Published Fri, Mar 20 2015 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM

మే ఐ కమిన్ సార్!

మే ఐ కమిన్ సార్!

పొలిమేరలో నిలిచిన పండుగని ‘టుబి ఆర్ నాట్ టుబి’ అనే విచికిత్స వేధిస్తూ ఉంటుంది. ఎటూ పాలుపోక చివరకు ‘‘అయామ్ మన్మథ, మే ఐ కమిన్ సార్!’’ అంటూ వినయంగా జనావళిని అడుగుతుంది.
 
ప్రతిసారీ ఉగాదికి కవులు అగ్నిపరీక్ష పెడుతుంటారు. ఒకరేమో ‘‘రా! రా! ఉగాదీ! నీ కోసం ఇళ్లలికాం! ముగ్గులు పెట్టాం! మా మామిడి తోర ణాలు కట్టింది. మా వేప నీకై విరగబూసింది!’’ అంటూ గొంతెత్తి రెండేసి మూడేసి సార్లు పిలుస్తారు. మరొకరు ‘‘రావద్దు ఉగాదీ! రావద్దు! ఏముందని వస్తావ్? వేప చెట్లు నరికేశాం! మామిడి మారాకు తొడగనే లేదు! నీకై పాటలు పాడే కోయిలలు ప్రెస్‌మీట్‌లో బిజీగా ఉన్నా యి! తుమ్మెదలు దారి తప్పి బ్రాందీ షాపుకి వెళ్లాయి! రావద్దు ఉగాదీ!’’ అంటూ ఇక్కడి సంగతులని కవిత్వీ కరిస్తూ హెచ్చరిస్తారు. పొలిమేరలో నిలిచిన పండుగని ‘టుబి ఆర్ నాట్ టుబి’ అనే విచికిత్స వేధిస్తూ ఉం టుంది. ఎటూ పాలుపోక చివరకు ‘‘అయామ్ మన్మథ, మే ఐ కమిన్ సార్!’’ అంటూ వినయంగా జనావళిని అడుగుతుంది. అట్టి అతిథి మన్మథ యావత్ తెలుగు జాతికి సర్వ సుఖ శాంతి సౌభాగ్యాలనిచ్చి కాపాడుగాక!
 
ఈ నవ తొలి ఉగాది గోల్కొండ ఖిల్లాలో జరగను న్నదా? ఉర్దూ, తెలుగు భాషా కోయిలలు కోటలో అక్షర దీపాలు వెలిగించనున్నవా? మనదీ చాంద్రమానమే, వారిదీ చంద్రహారమే. అయినప్పుడిక  కుడిఎడమల తేడాలేల? పండుగపూట హృదయాన్ని విప్పి, పొరల్ని వేదిక మీద ఆరేశారా లేదా అన్నది ముఖ్యం. తెలం గాణకి కావలసినన్ని కవితా గోష్టి సెంటర్లున్నాయి. ఖిల్లా నించి జిల్లా జిల్లాలో జరపవచ్చు. రవీంద్రభారతిలో అడుగు పెట్టొద్దనుకుంటే పేరు మార్చిన రంగా వ్యవ సాయ విశ్వవిద్యాలయంలో పచ్చందనాల నేపథ్యంలో సమ్మేళనం సాగించవచ్చు. కావాలనుకుంటే  దైవసన్నిధి యాదాద్రి ఉండనే ఉంది. క్షేత్ర మహత్తు వల్ల ప్రతి కవీ ఒక న రసింహమై విజృంభిస్తే కొంచెం ఇబ్బంది. శాం తింప చేయడానికి కనీసం ఒక్క ప్రహ్లాదుడైనా దొరకడం కష్టం.
 
ఇక అవశేష ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దయనీయంగా ఉంది. ఉగాది వద్దామంటే చిరునామా కూడా లేదు. ఈ-మెయిల్ లేదు. సెల్ నంబరు ఉందిగాని, సిగ్నల్స్ సరిగ్గా లేవు. ఎక్కడికని వస్తుంది పాపం! తెచ్చిన కాను కలు ఎక్కడ దింపి వెళుతుంది? ఇటీవల వసంత కోయి ళ్లకి చెట్లు దొరక్క కరెంటు స్తంభాల మీద కూచుని కూస్తు న్నాయి. లైటు వెలిగితే వసంతకాలం కాబోలని భ్రమ పడుతున్నాయి. ఎందుకంత ఆలోచన? అసలీసారికి నూజివీడు మామిడితోటలోకి కవులను రప్పిస్తే ప్రతి కవీ వంద కోయిళ్ల పెట్టున ధ్వనిస్తారు. ఆ తర్వాత ఆ తోట లకి గొప్ప ధర పలుకుతుంది. నాగార్జున విశ్వవిద్యాల యం పేరు చెబితేనే ముఖ్యమంత్రికి దడుపు జ్వరం వస్తోంది. పోనీ పంచాంగ శ్రవణం రాయలసీమలో పెట్టుకుని, ప్రసాదం పంపిణీ విశాఖలో పెడితే అన్ని ప్రాంతాలకూ న్యాయం చేసినట్టు అవుతుంది. చూసు కోండి బాబూ, ఆదాయ వ్యయాలూ, అవమానాలూ రాజ్యపూజ్యాలు. ‘‘ఈసారి చంద్రన్న కానుకలు లేవా?’’ అన్నారెవరో. ‘‘లేవు... ఓల్డ్ స్టాక్స్ అన్నీ సంక్రాంతికి చెల్లి పోయాయి. పోగుపడితే వినాయక చవితికి...’’ అన్నా రింకొకరెవరో.
 
మాకుగాదులు లేవు, మాకుషస్సులు లేవంటూ కొందరి ఆందోళన. పిక మహాసభ అంటే పిలవని కవుల మహాసభ అని కూడా అర్థం. జానెడు మైకు కోసం వాళ్లు తహతహలాడతారు. ప్రతి సమకాలీన సమస్య మీదా నిజాయితీగా స్పందించే ఒకే ఒక్క కులం కవికులం. చెరువుల పూడికలు ఒక ఉద్యమంగా నడుస్తుంటే- ‘‘అవి చెరువులు కావు, కొందరి మెదళ్లు. దశాబ్దాలుగా పేరుకుపోయిన మట్టిని మశానాన్ని తోడేస్తోంది మిషన్ కాకతీయ’’ అంటూ దిగి, తిరిగి తిరిగి ఎక్కడో తేలాడు ప్రాంతీయ కవి.
 
‘‘... వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలో కోటి డెబ్బయ్ ఆరు లక్షల నాలుగు వేల నలభై రెండు వేపచెట్లని అదనంగా పెంచుతాం. ప్రపంచంలోనే అతి పెద్ద వేప హబ్ వేస్తాం. గిరాకీ లేని కవులకు పింఛన్ పథకం కూడా ఆలోచనలో ఉంది. నే చెప్పిన మాట మర్చిపోవద్దు. ఇది మన్మథ నామ సంవత్సరం. మన కోసమే వచ్చింది. తమ్ముళ్లూ, ఆల్ ది బెస్ట్!
 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement