సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ తెలుగు మహాసభలకు విచ్చేసిన కవయిత్రుల ఆవేదన ఇది. కవి సమ్మేళనం ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అని నిర్వహకులు చెప్పారు. అక్కడికి వెళ్తే ‘ఇది మగవాళ్లకు మాత్రమే’నన్నారు అక్కడివారు. ‘మరి మాకు వేదిక ఎక్కడ’ అంటే రవీంద్రభారతికి వెళ్లమన్నారు. అక్కడ ‘బాల కవి సమ్మేళనం జరుగుతోంది, మరొక వేదిక మీద అష్టావధానం, మా ఏర్పాట్లలో మీకు వేదిక లేదు’ అన్నారు. ఇది తెలుగు మహాసభల మూడవ రోజు ఆదివారం నాటి పరిస్థితి.
మహబూబ్‌నగర్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పుష్పలత, తెలుగు ఉపాధ్యాయిని జీవనజ్యోతి, అంబుజ, మరో ముగ్గురు రచయిత్రులకు ఎదురైన చేదు అనుభవం ఇది. ‘ప్రియదర్శిని ఆడిటోరియం నుంచి రవీంద్రభారతికి వస్తే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉన్న వాళ్లకే అవకాశమన్నారు. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకుంటామంటే నిన్నటితోనే ముగిసిందంటున్నారు. ఇక్కడ పడిగాపులు కాస్తూ నిర్వహకులను అడగ్గా అడగ్గా ‘రేపు రెండు గంటల సమయమిస్తాం, ఆ టైమ్‌లోనే ఎంతమంది రచయిత్రులు ఉంటే అందరూ మీ పద్యాలను చదువుకోవచ్చు’ అంటున్నారు. రెండు వందల మంది రచయిత్రులం ఉన్నాం. రెండు గంటల టైమంటే ఒక్కొక్కరికి ఒక్క నిమిషం కూడా ఇవ్వరా? మేము అర నిమిషంలో ముగించాలా? మగవాళ్లకైతే ఏకంగా నాలుగు రోజులు.. రోజుకు ఏడు గంటలా..! మహిళలమని ఇంత వివక్షా! అయినా పద్యానికి, పద్యం రాసిన వాళ్లను కూడా మగ, ఆడ అని వర్గీకరిస్తారా? ప్రపంచ తెలుగు మహాసభలు మగవాళ్లకేనా?’ అని ఆవేశంగా ప్రశ్నిస్తున్నారు జీవనజ్యోతి. ఆమె మాటల్లో ఆవేశం వెనుక ఉన్న ఆవేదనలో అర్థముంది. ఆమెది ఆగ్రహం ధర్మాగ్రహమే. సభల నిర్వాహకులూ మీరేమంటారు..!
Comments
Please login to add a commentAdd a comment