ఇకపై మన భాష.. మన సంస్కృతి
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
పలువురికి సాహితీ పురస్కారాల ప్రదానం
సాక్షి,సిటీబ్యూరో : ఇంతకాలం అణచివేతకు గురైన తమ భాష, సంస్కృతిని పరిరక్షించుకునే దిశగా తెలంగాణ రచయితలు, కవులు రచనలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విస్తరణ సేవా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ కళామందిరంలో 2012 సంవత్సర సాహితీ పురస్కార ప్రదాన సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా ప్రమాణాలు అడుగంటుతున్నాయని, ప్రపంచంలోని 200 ఉత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో మనది ఒకటీ లేకపోవడం బాధాకరమన్నారు.
తెలుగు వర్సిటీ నుంచి రచయితలు తమ గ్రంథాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించే నిమిత్తం రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి ప్రసంగిస్తూ.. తెలంగాణ రచయితలకు మునుపటికంటే ఎక్కువ సహాయం అందించాలన్నారు. ఉపాధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 11 నుంచి విశ్వవిద్యాలయం తెలంగాణ ప్రభుత్వం పరిధిలోకి వచ్చిందన్నారు.
పురస్కార గ్రహీతలు వీరే..
వచన కవితా ప్రక్రియలో ‘దండెడ’ గ్రంథానికి పొన్నాల బాలయ్య, బాలసాహిత్యం ప్రక్రియలో ‘శృతిలయలు’ గ్రంథానికి ఆలపర్తి వెంకట సుబ్బారావు, కథా ప్రక్రియలో ‘గదిలోపలి గోడ’ రచయిత పలమనేరు బాలాజి, సాహిత్య విమర్శలో ‘సాహిత్యాకాశంలో సగం’ గ్రంథకర్త ఆచార్య కాత్యాయని విద్మహే, అనువాద ప్రక్రియలో ‘అనంతాకాశం’ గ్రంథానికి గోవిందరాజు రామకృష్ణారావు, నవలా ప్రక్రియలో ‘జిగిరి’ రచయిత పెద్దింటి అశోక్‌కుమార్, నాటక ప్రక్రియలో ‘లవంగి’ నాటకానికి కేవీఎల్‌ఎన్ శర్మ, వచన రచనలో ‘ముంగిలి- తెలంగాణ ప్రాచీన సాహిత్యం’ గ్రంథానికి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, రచయిత్రి ఉత్తమ గ్రంథంలో ‘తెలుగు నృత్యకళా సంస్కృతి’ రచయిత ఆచార్య కె. కుసుమారెడ్డి పురస్కారాలు అందుకున్నారు. పద్య కవితా ప్రక్రియలో ‘సప్తగిరిథామ కలియుగ సార్వభౌమ’ గ్రంథానికి దివంగత రాళ్లబండి కవితాప్రసాద్ తరపున ఆయన సతీమణి నాగినీదేవి పురస్కారం అందుకున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ తోమాసయ్య, డాక్టర్ జె.చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.