ఏప్రిల్ 22న ధరిత్రీ దినోత్సవం
కవులు ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడం శతాబ్దాలుగా తెలిసినదే. ప్రత్యేకించి ఆంగ్ల సాహిత్యంలో ప్రకృతి కవిత్వం అనగానే విలియం వర్డ్స్ వర్త్ (1770-1850) రాసిన ‘సాలిటరీ రీపర్’, ‘టు ది కకూ’, జాన్ కీట్స్ (1795-1821) రాసిన ‘ఓడ్ టు ఎ ఆటమ్’, ‘ఓడ్ టు ఎ నైటింగేల్’ వంటి చక్కటి కవితలు గుర్తుకొస్తాయి. కవితా ప్రపంచంలో ఇటీవల వినవస్తున్న సరికొత్త పదం ‘పర్యావరణ కవిత్వం’. ప్రకృతి, పర్యావరణం యొక్క సౌందర్యాన్ని కాక ‘పర్యావరణ పరిరక్షణ’ వస్తువుగా రాసేవి పర్యావరణ కవిత్వం (ఇకో పొయెట్రీ) కిందికి వస్తాయి.
అమెరికాలో 1970లో మొదటిసారి ‘ఎర్త్ డే’ శిఖరాగ్ర సభ జరిగింది. అప్పటినుంచీ 192 దేశాలలో ఏప్రిల్ 22ను ‘ఎర్త్ డే’గా పాటిస్తూ పర్యావరణ పరిరక్షణ చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ స్ఫూర్తితో రాబిన్సన్ జెఫర్స్, మేరీ ఆలివర్, డబ్ల్యూ.యస్.మెర్విన్, వెండెల్ బెర్రీ, లిండా హోగన్ వంటి పర్యావరణ కవులు తమ తమ ప్రాంతాలలో పర్యావరణ పరిరక్షణకు ఉద్యమించారు. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా స్త్రీలకూ, ప్రకృతికీ అన్యాయం జరుగుతున్నందున ఆ విషకౌగిలి నుండి ప్రకృతినీ, స్త్రీలనూ కాపాడే లక్ష్యంతో ‘ఇకో-ఫెమినిజం’ కూడా మొదలైంది.
పర్యావరణ పరిరక్షణ ఉద్యమాల ప్రభావం మన దేశం మీద కూడా పడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51-ఎ(జి) ప్రకారం అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో కూడిన సహజ పర్యావరణాన్ని సంరక్షించి అభివృద్ధి చేసుకోవడం, ప్రాణులన్నిటి పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుని ప్రాథమిక విధి. ఈ వెలుగులో ఖమ్మం జిల్లాకు చెందిన చేకూరి శ్రీనివాసరావు ‘ఇకో పొయెట్రీ’ రాశారు. కాలుష్యం, భూతాపం, ఓజోన్‌పొర తరిగిపోవడం, ఎడారులు పెరిగిపోవడం, జీవ జాతులు అంతరించిపోవడం గురించి ఆందోళన వెలిబుచ్చారు.
ఒక కవితలో వసంత మాసాన్ని ఎక్కడా కోయిలల ప్రతిధ్వనులే వినరాని నిశ్శబ్ద ఆమనిగా వర్ణిస్తారు. జీవ వైవిధ్యానికి సంకేతంగా వనమంతా ప్రతిధ్వనించే పక్షుల సుస్వరమైన కిలకిలారావాలు, కాకుల కాకలీ స్వనములు, కోతుల కిచకిచల వంటి ధ్వనులు - మొత్తంగా మటుమాయమై ప్రకృతి నీరవమయిందంటారు. వసంత రుతువులో తమ గాన మాధుర్యంతో ఓలలాడించిన పక్షులన్నీ కీటకనాశినులు వాడిన పంటలు తిని హతమయ్యాయట. ఆ వసంత రుతువులో బంగారు పిచ్చుక శ్రావ్యమైన గానం వినబడనే లేదంటారాయన.
మరో కవితలో గాంధీజీని పర్యావరణ కర్మయోగిగా అభివర్ణిస్తారు. ఇంకో కవితలో మతాలన్నీ వృక్షాలను పూజించమని చెప్పాయనీ, దాని అర్థం వృక్షాల విలువ తెలుసుకుని వాటిని సంరక్షించాలనేనంటారు. ఇంకొక కవితలో తమ గ్రామాన్ని ఆనుకుని ప్రవహించే వైరా నదిలో ఇసుక మాఫియా దుశ్చర్యలను ప్రస్తావిస్తూ, ఈ దోపిడీని అరికట్టడానికి బొలీవియా, కోస్టారికా దేశాల్లో లాగా మనదేశంలోనూ సహజ వనరులకూ హక్కులు కల్పిస్తూ చట్టాలు చేయాలంటారు.
ముత్తేవి రవీంద్రనాథ్
9849131029
బంగారు పిచ్చుక మళ్లీ పాడుతుందా?
Published Mon, Apr 18 2016 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 10:08 PM
Advertisement
Advertisement