నేనూ ఖమ్మం కుర్రాణ్నే
‘మన కుర్రాళ్లు’ మ్యూజిక్ డెరైక్టర్ భీమ్స్
ఖమ్మం : ‘విప్లవాల పురటి గడ్డ, కవులు, గాయకులు, కళాకారులకు జన్మనిచ్చిన ఖమ్మంలో పుట్టినందుకు గర్వపడుతున్నా’ అంటున్నారు ‘మన కుర్రాళ్లు’ చిత్రం సంగీత దర్శకుడు, సినీ పాటల రచయిత భీమ్స్. తానూ ఖమ్మం కుర్రాణ్నేనని తెలిపారు. నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో జరుగుతున్న ఇంప్యాక్ట్ కార్యక్రమానికి హాజరైన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. బయ్యారం మండల కేంద్రానికి చెందిన తానకు చిన్నతనం నుంచే పాటలు పాడటం, రాయడం ఇష్టమన్నారు. ఇదే తనను కళాకారులు, సాహితీవేత్తలకు దగ్గర చేసిందని తెలిపారు.
హాస్టల్ వార్డెన్ సీతారాములు ప్రోత్సాహంతో పాటలు రాయడం మొదలెట్టానన్నారు. ‘శ్రావణ మాసం’ చిత్రంలో ‘నీ కంచెర జుంపాలు చూసి సైదులు....’ ‘ఆయుధం’లో ‘ఓయ్ రాజూ..’ ‘సీమ టపాకాయలు’లో ‘దీరే ధీరే.. దిల్లే..’ పాటలు మంచి గుర్తింపునిచ్చాయని అన్నారు. త్వరలో విడుదల కానున్న సినిమాలు ‘మన కుర్రాళ్లు’, ‘అలా..ఎలా..?’ సినిమాలకు పాటలు రాసి మ్యూజిక్ డెరైక్టర్‌గా పనిచేశానని అన్నారు. ఇప్పటి వరకు సినిమాల్లో అవకాశం ఇచ్చిన ఆయుధం సినిమా డెరైక్టర్ శంకర్, కరెంట్ తీగల డెరైక్టర్ నాగేశ్వరరెడ్డి, మన కుర్రాళ్ళు డెరైక్టర్ వీరశంకర్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు.