మూగబోయిన సంగీత ఝరి
చెన్నైలో ఎంఎస్ విశ్వనాథన్ మృతి సినీ పరిశ్రమ అశ్రు నివాళి
తన అసమాన ప్రతిభతో సంగీత కళామతల్లిని ఓలలాడించిన ముద్దుబిడ్డ ఎంఎస్ విశ్వనాథన్ తనను వదలి తిరిగిరాని లోకాలకు వెల్లడంతో ఆ సంగీత కళామతల్లి కంటతడి పెట్టింది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చెన్నై అడయారులోని ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 87 ఏళ్ల ఈ కురువృద్ధుడు మరణానికి సినీలోకం అశువులు బాసింది. నెల రోజుల క్రితం శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరిన ఎంఎస్ విశ్వనాథన్ చికిత్స పొందుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు.
భారతీయ సినిమా అపర సంగీత చాణుక్యుడు ఎం ఎస్ విశ్వనాథన్. ఎం అంటే మహా ఎస్ అంటే సంగీతం. విశ్వనాథన్ సొంతం. 70 వసంతాలకు పైగా సంగీత కళామతల్లి ఒడిలో ఓలలాడుతూ సరిగమలతో జతులుకడుతూ తాను ఎదుగుతూ సంగీత మాధుర్యాన్ని ఇతరులకు పంచుతూ సంగీత కుటుంబాన్ని పెంచుతూ సంగీత రారాజుగా మన్ననలను అందుకున్న ఎం ఎస్ విశ్వనాథన్‌ను అమరజీవి అయ్యారు. అయినా సంగీత పిపాసి చిరంజీవినే. తమిళ సినిమా సంగీత చక్రవర్తి అంటూ సాక్షాత్తూ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితనే 2012లో బిరుదుతో సత్కరించి 60 బంగారు నాణేలతో పాటు కారును బహూకరించారు.
బాల్యం : మెల్లిసై మన్నర్ (ది కింగ్ ఆఫ్ లైట్ మ్యూజిక్) బిరుదాంకితుడైన ఎం ఎస్ విశ్వనాథన్ 1928 జూన్ 24న కేరళ రాష్ట్రం పాలక్కాడు సమీపంలోని ఎలపుల్లి గ్రామంలో జన్మించారు. మనయాంగల్ సుబ్రమణియన్, నారాయణి కుట్టి తల్లిదండ్రులు. నాలుగేళ్ల వయసులోనే ఎంఎస్‌కు పితృయోగం కలిగింది. దీంతో విరక్తి చెందిన తల్లి ఎంఎస్‌ను చంపి తన జీవితాన్ని చాలించాలని ప్రయత్నించారు. ఆ సమయంలో ఎంఎస్ తాత సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు.
ఎంఎస్‌కు చదువుల తల్లి దగ్గరవ్వలేదు. సంగీతంపై ఆసక్తి కనబరచడంతో నీలకంఠం భాగవతార్ వద్దకు పంపారు. ఆయన వద్ద మూడేళ్లు సంగీతంలో సాధన చేశారు. అలా 13 ఏళ్ల వయసులోనే నిర్విరామ సంగీత కచేరి చేసి ప్రశంసలు అందుకున్నారు. ఎంఎస్‌కు నటనపైనా మక్కువే. తాత జైలు వార్డెన్ కావడంతో జైలు రోజున ఖైదీలతో హరిచంద్రనాటకం వేయించారు. అందులో ఎం ఎస్ లోహితుడిగా నటించి అదరగొట్టేశారు.
మద్రాస్ పయనం: అది 1941వ సంవత్సరం విజయదశమి పర్వదినం మేనమామ సహాయంతో ఎం ఎస్ విశ్వనాథన్ మద్రాస్ మహానగరంలో కాలు మోపారు. జూపిటర్ పిక్చర్స్ అధినేతలు ఎం.సుందరం శెట్టియార్, మొహిద్దీన్ చిత్రం నిర్మించ తలపెట్టారు. అందులో ఒక పాత్ర కోసం ఎం ఎస్‌కు మేకప్ టెస్ట్ చేశారు. అయితే ఆయన ఆ పాత్రకు నప్పకపోవడంతో తరువాత చూద్దాం అంటూ చేతులు దులిపేశారు. పరిస్థితి పాలుపోని ఎంఎస్ వారిని బ్రతిమలాడుకుని వారి కార్యాలయంలోనే బాయ్‌గా చేరారు.
ఆ తరువాత ఆ సంస్థ నిర్మించిన కుబేర కుశలుఅనే చిత్రంలో సైనికుడిగా నటించారు. అయితే నటుడిగా తాను పనికి రానని గ్రహించి సంగీత రంగంపై దృష్టి సారించారు. సేలం మోడ్రన్ థియేటర్స్ సంస్థలు సంగీత దర్శకుడు కేవీ మహదేవన్ ఉన్నారని తెలిసి ఆయన్ని కలిశారు. ఎంఎస్ విశ్వనాథన్‌తో ఒక పాట పాడించుకున్న మహదేవన్ ఆయనలోని ప్రతిభను గ్రహించి సెంట్రల్ స్టూడియోకు వెళ్లు పని దొరుకుతుందని చెప్పారు. ఎంఎస్ నేరుగా సెంట్రల్ స్టూడియోలో సంగీత దర్శకుడు ఎస్ఎం సుబ్బయ్య నాయుడిని కలిశారు. అంతే ఆయన ట్రూప్‌లో హార్మోనిస్టుగా చేరారు. ఆ తరువాత సీఆర్ సుబ్బరాయన్ సంగీత ట్రూప్‌లో చేరారు. అక్కడ టీకేరామమూర్తితో పరిచయం ఏర్పడింది. 1952లో సీఆర్ సుబ్బరాయన్ మరణించడంతో ఆయన సంగీతాన్ని అందిస్తున్న దేవదాస్, చండీరాణి చిత్రాలను పూర్తి చేసే బాధ్యతలను ఎం ఎస్ విశ్వనాథన్, రామమూర్తి నిర్వహించారు.
అలా ఆ చిత్రాల విజయాలతో ఎం ఎస్ విశ్వనాథన్ జెనోవా చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ చిత్ర కథా నాయకుడు ఎంజీఆర్ కావడం విశేషం. రామమూర్తి విశ్వనాథన్‌ల ద్వయం : ఆ తరువాత నిర్మాత టీకే కల్యాణం తన చిత్రం పణంకు రామమూర్తి విశ్వనాథన్‌లను కలిపి సంగీతం అందించమని చెప్పారు. అలా మొదలైన ఆ సంగీత ద్వయం తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ అంటూ 700 చిత్రాల వరకు నిర్విఘ్నంగా కొనసాగింది. మొత్తం 1200 చిత్రాలకు సంగీతాన్ని అందించిన ఘనత ఎం ఎస్ది. ఎం ఎస్ విశ్వనాథన్ భార్య పేరు జానకి అమ్మన్. వీరికి గోపికృష్ణ, మురళీధరన్, ప్రకాష్, హరిదాస్ అనే నలుగురు కొడుకులు. లతా మోహన్, మధు ప్రసాద్, శాంతికుమార్ అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.
చెన్నై శాంతోం రోడ్డులో నివసిస్తున్న ఎంఎస్ విశ్వనాథన్ కుటుంబం నివశిస్తోంది. ఎం ఎస్ విశ్వనాథన్ భౌతిక కాయానికి బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బీసెంట్‌నగర్ శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. నేడు ఎంఎస్ అంత్యక్రియల కారణంగా సినిమా షూటింగ్‌లు రద్దయ్యాయి.
సీఎంల చిత్రాలకు సంగీతం : ముఖ్యమంత్రులుగా తమిళ, తెలుగు రాష్ట్రాలను పరిపాలించిన, పాలిస్తున్న ముఖ్యమంత్రులు ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నటించిన పలు చిత్రాలకు ఎం ఎస్ విశ్వనాథన్ సంగీతం పక్క బలాన్నిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధితోను ఎంఎస్‌కు సన్నిహిత సంబంధాలున్నాయి.
గాయకులకు పేరు ప్రఖ్యాతులు : ఎం ఎస్ విశ్వనాథన్ చాలామంది గాయనీ గాయకులకు పేరు ప్రఖ్యాతులు అందించారు. నేటి ప్రఖ్యాత గాయనీ గాయకులు ఎస్పీ బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి, ఎల్ఆర్ ఈశ్వరి, టీఎం సౌందరరాజన్, కేజే ఏసుదాస్ మొదలగు వారందరూ ఎం ఎస్ సంగీతంలో ఆలపించి ప్రశంసలందుకున్న వారే.
నటుడు, గాయకుడు కూడా: ఎం ఎస్ గొప్ప సంగీత దర్శకుడే కాదు. గాయకుడు, నటుడు కూడా. ఆయన తన చిత్రాలతో పాటు ఇతర సంగీత దర్శకుల చిత్రాల్లోనూ పాడారు. మొత్తం 500లకు పైగా పాటలను పాడారు. ఇక చిన్నతనంలో నటుడవ్వాలన్న కోరికను ప్రముఖ సంగీత దర్శకుడైన తరువాత తీర్చుకున్నారు. కాదల్‌మన్నన్ చిత్రంలో ఎంఎస్ తొలిసారిగా హాస్యపాత్రలో అలరించారు. ఆ తరువాత కాదలా కాదలా తదితర 10 చిత్రాల్లో నటించారు.
జాతీయ అవార్డులు లేవు కాని....
ఎం ఎస్ విశ్వనాథన్ జాతీయ అవార్డులకు అలంకారం అయ్యే అవకాశాన్ని పొందలేదు గాని ఆయనికి అంతకం టే గొప్ప అవార్డులే వరించాయి. 1963 జూలై 16న గీత రచయిత కన్నదాసన్, దర్శకుడు శ్రీధర్, నటుడు జెమినీ గణేశన్, చంద్రబాబు చిత్రాలయ గోపుల సమక్షంలో శి వాజీ గణేశన్ రామమూర్తి, విశ్వనాథన్‌లకు మెల్లిసై మ న్నన్ అనే బిరుదు ఇచ్చి సత్కరించారు. కలైమామణి, ఫిలింఫేర్ లాంటి పలు బిరుదులు ఎం ఎస్‌ను వరించా యి. అన్నింటికంటే పెద్ద బిరుదు సంగీత ప్రియులు ఎం ఎస్‌ను గుండెల్లో స్థిరస్థాయిగా నింపుకున్నారు. సంగీతం ఉన్నంత కాలం ఎంఎస్ విశ్వనాథన్ చిరంజీవినే.