స్త్రీల గీతానికి 'శ్రుతి'
మహిళా దినోత్సవం స్పెషల్
శ్రుతీహాసన్ మల్టీ ట్యాలెంటెడ్. ఆమెలో మంచి నటి, గాయని, సంగీత దర్శకురాలు, రచయిత్రి ఉన్నారు. రానున్న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరిలో చైతన్యం నింపే విధంగా ఆమె ‘మై డే ఇన్ ది సన్...’ అనే పాట రాశారు. ప్రతి స్త్రీ ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థయిర్యంతో ఉండాలని ఈ పాట ద్వారా చెప్పడమే తన ప్రధానోద్దేశమని శ్రుతీహాసన్ పేర్కొన్నారు. మార్చి 8న మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పాటను విడుదల చేయనున్నారు. పాట రాయడం, పాడటంతో పాటు సంగీత దర్శకులు ఎహ్‌సాన్-లాయ్ జంటతో కలిసి ట్యూన్ తయారు చేయడానికి కూడా కృషి చేశారామె.
‘‘ఇది మన (మహిళలను ఉద్దేశించి) టైమ్. మనం ఎదగాలి. మానసికంగా బలంగా ఉండాలి. ఆత్మన్యూనతా భావంతో, అభద్రాతాభావంతో తమను తాము ఎదగనివ్వ కుండా చేసుకుంటున్న మహిళలకు స్ఫూర్తిగా నిలవాలి. ఈ పాట అలానే ఉంటుంది. ఇది మనసుతో పాడుకోదగ్గ పాట. ఎహ్‌సాన్-లాయ్ వంటి ప్రతిభావంతులతో కలిసి ఈ పాట చేయడం ఆనందంగా ఉంది. వాళ్ల పాటలు వింటూ పెరిగినదాన్ని నేను’’ అని శ్రుతి చెప్పారు. ఆడియో విడుదల చేసి, ఆ తర్వాత కొన్ని నెలలకు వీడియోను కూడా విడుదల చేయాలనుకుంటున్నారు.