కవిభల్లూక
ఉద్దండపిండాలైన కవులను పుంగవులుగానే పోల్చారు మనవాళ్లు. బహుశ నాటి కవులలో వృషభ గతి కనిపించి ఉంటుందని అప్పటి విమర్శకులకు. భగవంతుడి దయవల్ల మనకు కవిభల్లూకాలు, కవిజంబూకాలు ఎవరూ లేరు. ఆ బిరుదులకు బహుశ తగిన అర్హులెవరూ మనకు లేరు. అయితే, ప్రాచీన ఇంగ్లిష్ కవులలో అగ్రగణ్యుడిగా, విలియమ్ షేక్స్‌పియర్ తర్వాత అంతటి వాడుగా ఖ్యాతి పొందిన లార్డ్ బైరన్ మాత్రం ‘కవిభల్లూక’ బిరుదుకు ప్రపంచంలోనే ఏకైక అర్హుడు. ఎందుకంటారా..? లార్డ్ బైరన్ అంటే ప్రాచీనాంగ్ల మహాకవులలో ఒకరిగా సాహితీ ప్రియులలో చాలామందికి ఆయనపై ఎనలేని భక్తిప్రపత్తులు నేటికీ ఉన్నాయి. పద్నాలుగో ఏటనే కవన రచన మొదలు పెట్టిన బైరన్ కవిగారు యవ్వనారంభ కాలంలో సుప్రసిద్ధ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చేరారు. తరగతికి హాజరయ్యేటప్పుడు తన వెంట తన పెంపుడు జాగిలాన్నీ తీసుకొచ్చారు. జాగిలాలను తరగతి గదుల్లోకి తీసుకు రావడం నిషిద్ధమని, విశ్వవిద్యాలయ నిబంధనలకు అది విరుద్ధమని అధికారులు అభ్యంతర పెట్టారు.
అధికారుల అభ్యంతరంతో జాగిలాన్ని తరగతి గది నుంచి వెలుపలకు తీసుకుపోయినా, ఈ తతంగమంతా బైరన్ కవిగారికి అవమానకరంగా తోచింది. అధికారులకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాడు. ముందుగా విశ్వవిద్యాలయ నియమ నిబంధనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. తరగతి గదులకు జాగిలాలను తేకూడదన్న నిబంధనను రూఢి చేసుకున్నాడు. అయితే, నిబంధనల్లో భల్లూకాల ప్రస్తావన లేకపోవడాన్ని కూడా గమనించాడు. అంతే, ఈసారి తరగతి గదికి ఏకంగా ఒక భల్లూకాన్నే వెంటేసుకు రావడం మొదలుపెట్టాడు. అధికారులకు ఇది ఇబ్బందిగానే ఉన్నా, భల్లూకాలపై నిషేధం లేకపోవడంతో నోరు మెదపలేకపోయారు.
కూర్పు: పన్యాల జగన్నాథదాసు