రైట్ టైమ్
చేయి తిరిగిన రచయితలు, కవులు.. ఇప్పుడిప్పుడే కలానికి పదును పెడుతున్న యువతరం.. ఒకచోట చేరి తమ భావాలను పంచుకున్నారు. అభిప్రాయాలను కలబోసుకున్నారు. సీనియర్స్ తమ అనుభవాల నుంచి పాఠాలు చెబితే.. జూనియర్స్ తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. రచనలో రాణించడమెలా? కథల ఎంపిక ఎలా? శిల్పం ఎలా ఉండాలి? రాసేస్తాం సరే... పబ్లిషింగ్, మార్కెటింగ్‌ల మాటేమిటి? ఇలా అనేక అంశాలపై ఎడతెగని చర్చకు వేదికైంది సికింద్రాబాద్‌లోని అవర్ సేక్రెడ్ స్పేస్. రెండు రోజులపాటు జరిగిన రైటర్స్ కార్నివాల్ సలహాలు, సూచనలతో యువ రచయితలకు దిశానిర్దేశం చేసింది. పదహారేళ్ల అనూష నుంచి 65 ఏళ్ల రాజ్‌కుమార్ చోబ్రా వరకు రచనల్లో వచ్చే ఇబ్బందులు, మంచి రచనకు కావాల్సిన మెలకువలు నేర్చుకున్నారు.
..:: దార్ల వెంకటేశ్వరరావు
రచనలు చేయడాన్ని హాబీ చేసుకోవాలని చాలామం దికి ఉంటుంది. మనసులో అందమైన ఊహలు రెక్క లు తొడుక్కుంటాయి. వాటిని కాగితంపై పెట్టాలను కునే సరికి చేయి కదలదు. ఏవేవో కలలు.. కలం పట్టి కళ్లకు కడదామంటే అక్షరం పడదు. ఇలాంటి వారితో పాటు సీనియర్స్ నుంచి సలహా సూచనలు పొందాల నుకుని.. ఆ చాన్స్ దక్కని రచయితలూ ఎందరో.. అటువంటి వారంతా తమ సందేహాలను తీర్చుకుని కొత్త ఉత్సాహం నింపుకొన్నారు.
కలం బాటలో..
సాధారణంగా రచనా వ్యాసంగంలోకి రావాలనుకునేవాళ్లు క్లాసిక్స్ చదవడానికే ప్రాధాన్యమిస్తారు. కానీ.. సమకాలీన రచనలూ చదవాలి. ఇది సీనియర్ రచయితలు ముక్తకంఠంతో చెప్పేమాట. అప్పుడే ప్రస్తుత కవిత్వంలో వస్తున్న మార్పులు, స్టాండర్డ్స్ తెలుస్తాయి. కొత్త రచయితలు సొంతంగా పబ్లిష్ చేసుకుని పుస్తకాలు బయటకు తెస్తే అవి కేవలం తెలిసిన వారి వద్దకే వెళతాయి. దీంతో విమర్శలు తక్కువగా ఉండి రచయిత చేసిన పొరపాట్లు తెలియవు. సంప్రదాయ పబ్లిషర్స్ ద్వారా వెళ్తేనే ఎక్కువ మంది దగ్గరకు రచనలు వెళ్తాయి. తప్పొప్పులు తెలుస్తాయి. కేవలం పుస్తకాల పబ్లిషింగ్‌పైనే ఆధారపడటం వల్ల ప్రయోజనం లేదు. అందరూ ఉపయోగిస్తున్న సోషల్ మీడియాలో పబ్లిషింగ్ ఎలా చేసుకోవచ్చో కూడా ఆలోచించాలి. ఇవన్నీ వివరించి చెప్పిందీ రైటర్స్ కార్నివాల్. సొంత బ్లాగులు నిర్వహించడం, పేరొందిన వెబ్‌సైట్స్‌లో ‘ఈ పబ్లిషింగ్’ గురించీ సీనియర్స్ వివరించారు.
‘పెన్’టాస్టిక్ థీమ్..
యువ, ఔత్సాహిక రచయితలను ప్రోత్సహించడానికి, వారికి ‘కొత్త కథ’ల్లోకి దారి చూపడానికి కార్నివాల్ ప్లాట్‌ఫామ్‌లా ఉపయోగపడింది. మూడేళ్లుగా రైటర్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నారు. 2012లో డాక్యుమెంట్రీ, జర్నల్స్‌పై, 2013లో చిల్డ్రన్ రైటర్స్, 2014లో పబ్లిషింగ్ ఎలా.. అనే అంశాలపై నిర్వహిం చారు. నాలుగోసారి సెన్సిటివ్ అంశాలను థీమ్‌గా ఎంచుకున్నారు. యువ రచయితలు తమ రచనలెలా పబ్లిష్ చేసుకోవాలో ఇందులో వివరించారు.
తెలుగు రైటర్స్‌కూ వేదిక కావాలి...
అనితా దేశాయ్ షార్ట్ స్టోరీ రైటర్. వివిధ సామాజికాంశాలపై తన బ్లాగ్‌తో పాటు వివిధ వెబ్‌సైట్లలో, సోషల్ మీడియాలో ఆర్టికల్స్ ప్రచురించారు. ఈ కార్నివాల్‌లో విడుదల చేసిన ‘సెలబ్రేటింగ్ ఇండియా’ పుస్తకంలో ఆమె రాసిన ‘ఎపిలిప్టిక్’ షార్ట్ స్టోరీ పబ్లిష్ అయింది. ఫిట్స్ వచ్చే ఓ మహిళ పుట్టుక నుంచి ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంతో ప్రస్తుతం ఆమె రాస్తున్న కథ ‘డొమెస్టిక్ మేడ్’. ‘పబ్లిషింగ్‌లో ఇబ్బందులు, కాపీరైట్ చట్టాల గురించి కార్నివాల్ వల్లే తెలుసుకోగలిగాను’ అని అనితా దేశాయ్ చెప్పారు. రిటైర్డ్ ఐఏఎస్ ముక్తేశ్వరరావుకి చిన్ననాటి నుంచి రచనలు చేయడం హాబీ. ‘..కానీ విధి నిర్వహణలో ఒత్తిళ్లతో రచనా వ్యాసంగంపై దృష్టి పెట్టలేదు. పదవీ విరమణతో సమయం దొరికింది. సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై ఆర్టికల్స్ రాసినా.. అవి ఆంగ్లంలోనే. తెలుగు రైటర్స్ కు ఇలాంటి వే దిక అవసరం. నేను సైతం కార్నివాల్‌లో ఉత్సాహంగా పాల్గొన్నా’నంటారాయన.
మతం కన్నా.. మానవ సంబంధాలు మిన్న...
65 ఏళ్ల రాజ్‌కుమార్ ఛాబ్రా స్టేట్‌మెంట్ ఇది. అందుకే ఆ సంబంధాల్లోని బాంధవ్యాల గురించి ఎక్కువగా రాస్తుంటారాయన. నిత్యం తన కళ్లముందు జరిగే అంశాలే ఆయన కథా వస్తువు. పెళ్లికోసం మతం మారతాడు ఓ కశ్మీరీ పండిట్. మతం మారాక అతని కుటుంబంతో కొనసాగే అనుబంధాలు, బంధాలకు కథా రూపమిచ్చారు. అంతేకాదు... ఓసారి హాంగ్‌కాంగ్‌కు వెళ్లిన రాజ్‌కుమార్ మొబైల్ బ్యాటరీ పాడైంది. కొత్త బ్యాటరీ కొనేందుకు వెళ్తే... అప్పటికే టైమ్ అయిపోయింది. అయినా షాపు యజమాని ఓ మొబైల్ ఇచ్చి అది ఉదయం వరకూ వాడుకోమని, పొద్దున్నే కొత్త బ్యాటరీ తీసుకోమని ఇచ్చాడు. ‘దేశంకాని దేశంలో... ఎవరో ఏమిటో తెలియకుండా ఫోన్ ఇవ్వడం నమ్మకం. అదే మనుషుల మధ్య ఉండే గొప్ప బంధం. వీటి నేపథ్యంతో ఎన్ని కథలై నా రాయొచ్చు’ అంటారు రాజ్‌కుమార్. ఆయన నుంచి యువ, ఔత్సాహిక రచయితలు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. మనసులో మెదిలో ఊహలకు ఎలా అక్షర రూపమివ్వాలో ఆయన చెప్పిన తీరు ఆకట్టుకుంది. ‘నేను చూసిన ప్రదేశాలు, ప్రకృతి గురించి సొంత బ్లాగ్‌లో పెడుతుంటాను. ఈ కార్నివాల్ నాకు కొత్త దారి చూపింది’ అని ఆనందంగా చెప్పింది ఇందిర. ఆమెలాంటి ఔత్సాహికులు మరెందరో ఇక్కడ రచనా మెలకువల్ని ‘కలం’ నిండా నింపుకొన్నారు.
చాలా నేర్చుకున్నా...
చిన్నప్పటి నుంచి చిన్నచిన్న కథలు, కవితలు రాయడం అలవాటు. నేను రాసిన కథలు నా బ్లాగ్‌లోనే పబ్లిష్ చేస్తుంటాను. ఎమోషనల్ అంశాలపై రాయడమంటే ఇష్టం. ఈ కార్నివాల్‌లో ట్రాన్స్‌జెండర్స్ సమస్యల గురించి తెలుసుకోగలిగాను. ఇలాంటి సెన్సిటివ్ అంశాలపై రచనలు చేయాలని అనుకుంటున్నా. ఇక్కడ చాలా నేర్చుకున్నా.
- అనూష, ఇంటర్ ఫస్టియర్
సెల్ఫ్ డిస్కవరీతో...
పుట్టుకతోనే అంధురాలిని. 14 ఏళ్లనుంచే తెలుగు, ఇంగ్లిష్‌లో కథలు, కవితలు రాస్తున్నాను. ఇఫ్లూలో ఎంఏ ఇంగ్లిష్ పూర్తి చేసి ఇప్పుడు ఇంగ్లిష్ సాహిత్యంలో పీహెచ్‌డీ చేస్తున్నాను. నేను రాసిన ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు పత్రికల్లో అచ్చయ్యాయి. విజన్ వాయిస్ సాఫ్ట్‌వేర్‌తోకంప్యూటర్‌లో రాస్తుంటాను. నాలాంటి అంధులు, డిజేబుల్డ్ పర్సన్స్‌లో ఉండేసెల్ఫ్ డిస్కవరీతో ఎక్కువ రచనలు చేయొచ్చు. ఈ మధ్యే ఓ నవల రాయడం ప్రారంభించా. ఒక గ్రామీణ మహిళ కొత్త ప్రపంచంలోకి వెళితే ఎలా ఉంటుంది అనే అంశంపై. సగం పూర్తయింది. దీన్ని పుస్తక రూపంలో తీసుకురావాలని ఉంది.
- జోత్స్న ఫణిజా, రచయిత్రి
యువ రచయితలను ప్రోత్సహించాలని...
యువ రచయితలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మూడేళ్లుగా రైటర్స్ కార్నివాల్ నిర్వహిస్తున్నాం. ఒక్కో సంవత్సరం ఒక్కో థీమ్. ఈసారి అంధులు, ట్రాన్స్ జెండర్స్‌తోపాటు కామెడీ అంశాలను చేర్చాం. గతంలోలాగే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఉత్సాహంతో వచ్చే సంవత్సరం కూడా కండక్ట్ చేస్తాం. అయితే తెలుగు రచయితల కోసం ప్రత్యేక కార్నివాల్ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం.
- నివే దిత, నివాసిని పబ్లిషర్స్, కార్నివాల్ నిర్వాహకురాలు