కుంచెడు సేవ | The social Artists. ORG open site | Sakshi
Sakshi News home page

కుంచెడు సేవ

Published Fri, Mar 20 2015 12:27 AM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

కుంచెడు సేవ - Sakshi

కుంచెడు సేవ

‘దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ పెద్దలు చెప్పిన మాట. అలాంటి తరగతి గదుల గోడలకు అందమైన రంగులద్దుతూ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు దిద్దుతున్నారు. గోడలపై బొమ్మలతో విద్యార్థుల ఊహలకు రెక్కలు తొడుగుతూ వాళ్ల అధ్యయనానికీ తోడ్పడుతున్నారు. వాళ్లే... ది సోషల్ ఆర్టిస్ట్స్! ఆ ఆన్‌రోడ్ వారియర్స్ పరిచయం....
- భువనేశ్వరి

 
ఓ కళాకారుడు గీసిన చిత్రం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. కానీ ఈ ఆర్టిస్టులు చేస్తున్న సేవ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మేథాశక్తిని పెంచుతోంది. ‘ది సోషల్ ఆర్టిస్ట్స్. ఓఆర్‌జి’ సైట్ ఓపెన్ చేయగానే తరగతి గదులకు సున్నాలేసే యువత కనిపిస్తారు. వీళ్లు అరకొర వసతులున్న ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులకు కొత్త రంగులద్ది... విద్యార్థుల మెదడుకు పదును పెడుతున్నారు. రకరకాల పెయింటింగ్స్‌తో పిల్లల మనసు దోచుకుంటున్నారు. ‘మేం గీసే ప్రతి చిత్రం ఆ చిన్నారుల భవిష్యత్తుకి ఓ పునాది రాయి, ఆ రాళ్లు పాతడంలో ఉన్న సంతృప్తిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం. మరో పదిమందికి కూడా పంచుతున్నాం’ అని అంటున్నారు ‘ది సోషల్ ఆర్టిస్ట్స్’ స్థాపకురాలు కావ్య.
 
బొమ్మల పాఠాలు...
బ్రాహ్మణబస్తీ, సీతాఫల్‌మండి, మైలార్‌గడ్డ... ఇలా నగరంలో, నల్గొండ జిల్లాలో కలిపి ఇప్పటి వరకూ తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసింది ‘ది సోషల్ ఆర్టిస్ట్స్’ టీం. పెయింటింగ్ వేయడం అంటే నచ్చిన బొమ్మ గీయడం కాదు. ఆయా తరగతుల పాఠ్యపుస్తకాల్లోని పిల్లలు నేర్చుకోవాల్సిన చిత్రాలను గోడలపై వేస్తున్నారు. ఒకటో తరగతి గోడలపై పక్షులు, జంతువుల బొమ్మలు కనిపిస్తే, ఏడోతరగతి గోడలపై గుండె, మూత్రపిండాలు, ఇండియా మ్యాపులు... కనిపిస్తాయి. చేసేది ఉచితంగా కదా అని నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఖరీదైన పెయింటింగ్‌లనే వాడుతున్నారు.

‘నేను ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. రెండేళ్లక్రితం ఒక అనాథపిల్లల ఆశ్రమంలో పరిచయం అయ్యింది కావ్య. ఆమె చిత్రాలు అందంగా ఉంటాయి. అలాగే ఆమె ఆశయం కూడా. నేను చిత్రకారుడ్ని కాకపోయినా ఆమెతో చేయి కలిపాను. అలాగే మా స్నేహితులు చాలామంది సోషల్ ఆర్టిస్టులుగా మారిపోయి వారాంతాల్లో పెయింటింగ్ బక్కెట్లు చేతబట్టి ప్రభుత్వ పాఠశాలలకు పయనమవుతున్నాం’ అని చెప్పారు మరో సభ్యుడు శ్రీకృష్ణ.
 
రంగులతో పాటు...
ప్రభుత్వ పాఠశాలల పరిసరాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత భవంతులు, వెలసిన రంగులు, పెచ్చులూడిన గోడలు.. అలాంటి చోటకి వెళ్లి పనిచేస్తున్నాం అంటోంది మరో సభ్యురాలు నిఖిల .‘కావ్యతో పరిచయం ఏర్పడి మూడేళ్లవుతోంది. ఆమెతో కలిసి ప్రయోజనకరమైన సేవ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్‌లో దాదాపు వందమంది సభ్యులున్నారు. వీరిలో చాలామందికి పెయింటింగ్ అంటే ఏమిటో తెలియదు. నాక్కూడా. పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం, వారికి తెలియని విషయాలపై అవగాహన కల్పించడం వంటి పనులు కూడా చేస్తున్నాం.

కావ్య బొమ్మలు బాగా వేస్తుంది. మేం ఎవరికి తోచిన పని వాళ్లం చేస్తాం. కొందరు పెయింటింగ్స్ వేస్తే ఇంకొందరు వారికి సాయం చేస్తారు. పెయింటింగ్ రాకపోయినా ఆసక్తి ఉన్నవారు నేర్చుకుని మరీ పిల్లలకు నేర్పుతున్నారు’ అని చెప్పారామె. ఒక పాఠశాల గోడలకు రంగులేయడంతో సరిపెట్టకుండా అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి పిల్లలకు అవసరమైన అక్షరసాయం కూడా చేస్తున్న ఈ సేనకు స్నేహితుల ప్రోత్సాహం చాలా బాగుంది.
 
టీచర్స్ సహకారం...
ఈ సోషల్ ఆర్టిస్టులు అడుగుపెట్టిన ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు వీరికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. ‘మీ రాక మా తరగతుల గదుల్లోనే కాదు విద్యార్థుల మొహాల్లో కూడా వెలుగులు నింపుతోంది’ అని అంటున్నారు వాళ్లు. ‘నేను చదివింది ఇంజనీరింగ్ అయినా చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్రాణం. నా కళ విద్యార్థులకు ఉపయోగపడాలనుకున్నాను. మొదట బ్రాహ్మణబస్తీలోని పాఠశాలకు నేనొక్కదాన్నే నాలుగు పెయింట్ డబ్బాలు మోసుకుని వెళ్లాను. ఈరోజు నావెంట వందమంది ఉన్నారు. దానికి కారణం... ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రేమాభిమానాలే.

ఈరోజుకీ నేను వెళ్తే... అక్కా అంటూ అతుక్కుపోతారు. వారికి ఇంకా ఏదో చేయాలని ఉంది’ అని చెప్పారు కావ్య. ఆర్టిస్టు కావ్యగా అందరికీ పరిచితురాలైన ఈ కళాకారిణి ఈ మధ్యనే పేరు మార్చుకున్నారు. ‘అవునండి. పెళ్లయ్యాక పేరు మారింది. ఇప్పుడు నా పేరు ఉద్విత. మా నాన్నగారు నటులు సి.వి.ఎల్ నర్సింహారావ్, అమ్మ అడ్వకేట్ అనురాధ. వారిద్దరి గురించి అందరికీ తెలుసు’ అని ముగించారు కావ్య. ఈ సోషియల్ ఆర్టిస్ట్స్ సభ్యుల్ని చూస్తుంటే... కుంచె అందమైన బొమ్మలనే కాదు, అందమైన ఆలోచనలకు కూడా ప్రాణం పోస్తుందనిపిస్తుంది కదా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement