Artist Bhargavi Social Activism Exclusive Journey - Sakshi
Sakshi News home page

ఆమె చేయని మంచి ప‌ని లేదు, సేవా రంగం లేదు.. ఓ అలుపెరుగని సంచారి!! 

Published Sun, Oct 3 2021 4:41 PM | Last Updated on Mon, Oct 4 2021 9:55 AM

Artist Bhargavi Social Activism Exclusive Journey  - Sakshi

ఆమెకు నిరంతరం ఏదో ఒకటి చేయాలనే ఉత్సాహం. ఉత్సాహంగా ఉంటేనే అలసట తెలియదంటారు. యువత కోసం కొత్తకొత్తగా ఆలోచిస్తుంటారు అన్నీ నలుగురికీ చెప్పాలనేదే  ఆమె ఆకాంక్ష. చూసిన ప్రతిదీ రాస్తారు, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తారు. ఒంటరిగానే ప్రయాణిస్తారు. సైకిల్‌ తొక్కాలి, కొండలు ఎక్కాలి అనే ఆలోచ‌న‌తోనే ఉంటారు.. పాండమిక్‌ సమయంలోనూ ఎంతో ధైర్యంగా చురుగ్గా ప‌నిచేశారు. యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డానికి గ్యాల‌రీ తెరిచారు. యువ‌త జీవ‌నానికి కావ‌ల‌సిన విష‌యాలు ప్ర‌ముఖుల‌తో చెప్పిస్తున్నారు. హైద‌రాబాద్ లో నివ‌సిస్తున్న భార్గ‌వి నిరంతర సంచారి. ఆమె గురించి ఆమె మాట‌ల్లోనే...

మాస్టర్స్‌లో గోల్డ్ మెడల్
నేను పుట్టి పెరిగింది  హైద‌రాబాదులోనే. బి.కామ్ వ‌ర‌కు చ‌దువుకున్నాను. ఆ త‌ర‌వాత వివాహం జ‌ర‌గ‌డం, బాబు పుట్ట‌డం, వాడు స్కూల్ కి వెళ్ల‌టం... అన్నీ సామాన్యంగానే జ‌రిగిపోయాయి.  అప్పుడు నాకు ఆర్ట్ నేర్చుకోవాల‌ని కోరిక క‌లిగింది. చిన్న‌ప్ప‌టి నుంచే నేను బొమ్మ‌లు వేసేదాన్ని. ఏదో కార‌ణంగా అప్పుడు నాకు ఆర్ట్ మీద దృష్టి పెట్ట‌డానికి అవ్వ‌లేదు. అబ్బాయి స్కూల్ కి వెళ్లాక నాకు చాలా స‌మ‌యం దొరికేది. అప్పుడే నేను నా క‌ల‌ను నిజం చేసుకోవాల‌నుకున్నాను.

నాన్నగారి స్నేహితుడి ప్రోద్బలంతో ఆర్ట్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీకి అప్లయి చేశాను. నాలుగు సంవత్సరాల కోర్సు పూర్తి చేశాను. డిగ్రీ చదివేటప్పుడు నాతో ఉన్నవారంతా చిన్నపిల్లలు. వాళ్లందరూ మధ్యతరగతివాళ్లు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినవారు. అప్పటికే వాళ్లు వేసిన పెయింటింగ్స్‌ తీసుకుని డబ్బులు ఇచ్చేదాన్ని. ఊరికే డబ్బులు ఇస్తే వాళ్లకి డబ్బు విలువ తెలియదని ఎంతో కొంత డ‌బ్బులు ఇచ్చి కొంటూ వాళ్ల‌ని ప్రోత్స‌హించాను. మాస్టర్స్‌ కోసం సెంట్రల్‌ యూనివర్సిటీ కి అప్లయి చేసి, జాయిన్‌ అయ్యాను. గోల్డ్ మెడల్ సాధించాను. మాస్టర్స్ కోర్సు పూర్త‌య్యాక కలకత్తా, బరోడా ప్రాంతాలకు వెళ్లాను.

ప్రింట్ మేకింగ్‌
నేను కాలేజీ నుంచి బయటకు వచ్చాక ప్రింట్‌మేకింగ్‌ స్టూడియో పెట్టాలనుకుంటున్నారు. అప్పటికి హైదరాబాద్‌లో ఆ త‌ర‌హా స్టూడియో లేదు. నా స్పెషాలిటీ కూడా ప్రింట్‌మేకింగ్‌లోనే. ఈ స్టూడియోకి పెద్ద‌ మెషినరీ కావాలి. పెయింటింగ్‌కి కావ‌ల‌సిన‌ రంగులు, జింక్‌ ప్లేట్లు ఉప‌యోగించి, పేపర్‌ మీద ప్రింట్‌ తీస్తాం. ఈ స్టూడియో న‌డ‌ప‌డానికి చదువుకున్నవారు చాలామంది కావాలి.

నాతో చ‌దువుకున్న వారినే కొంద‌రిని ఇందులోకి తీసుకోవాల‌నుకున్నాను. ఫైనల్‌ డిస్‌ప్లే (ఫైనల్‌ ఇయర్‌) కి బరోడా, శాంతినికేత‌న్‌లాంటి ప్లేసెస్‌కి వెళ్లేదాన్ని. అక్కడ టీచర్‌ స్టూడెంట్ ప‌ద్ధ‌తి లేదు. గురుకులంలాగ ఉంటుంది. సాయంత్రం దాకా క్లాసెస్ జ‌రుగుతాయి. ఆ త‌ర‌వాత బడ్డీకొట్టు దగ్గర కూర్చుని ప్రపంచంలో జ‌రుగుతున్న ప‌రిణామాల గురించి, అన్ని విషయాలు ఒక‌రితో ఒక‌రు పంచుకుంటారు. హైదరాబాద్‌లో ఇటువంటి వాతావరణం లేదు. పిల్లలకు టీచర్‌ అంటే భయం. టీచరే అన్ని విషయాలు చెప్తారు.

బరోడా ఒక ఆర్ట్‌ హబ్‌
భార‌త‌దేశంలో బ్యాచిలర్స్ డిగ్రీ అవ్వగానే బరోడాలో మాస్టర్స్‌ చేస్తారు. బరోడాలో చాలా స్టూడియోలు, గ్యాలరీలు ఉన్నాయి. ఒక్కో గది ఒక్కో ఆర్టిస్టుకి ఇస్తారు. 20 మంది ఒకచోట కూర్చుని పనిచేసుకునే అవకాశాలు ఉన్నాయి అక్క‌డ‌. ఇక్కడ అలాంటిది లేదు. అటువంటి స్టూడియో ఇక్క‌డి విద్యార్థుల కోసం ప్రారంభించాల‌నుకున్నాను. 2014లో ది ఆర్ట్‌ స్పేస్ అని ఆర్ట్‌ గ్యాలరీ ప్రారంభించాను. బాలమురళి, సినారె ప్రారంభోత్సవం చేశారు. థి అనేది సంస్కృత పదం. ఈ పదానికి చాలా అర్థాలున్నాయి.

ఈ స్టూడియోలో లైబ్రరీ, పెయింటింగ్ గ్యాల‌రీ కూడా ప్రారంభించాను. యువతకు ఎవ్వరూ అవకాశాలకు ఇవ్వట్లేదు. ఆ అవ‌కాశం నేను ఇచ్చి వాళ్ల‌ని ప్రోత్స‌హించాల‌నుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటివరకు క్రియేటివ్‌గా ఉన్న యువతను ప్రమోట్ చేస్తూనే ఉన్నాను. అంతర్జాతీయంగా కూడా ఫొటోగ్రఫీ, పెయింటింగ్, స్కల్ప్చ‌ర్ అన్నీ చేస్తున్నాను.

మంచి విష‌యాలు
ప్ర‌తి సంవ‌త్స‌రం యువ‌త‌కు మంచి విష‌యాలు తెలిసేలా నాలుగు ప్రదర్శనలు చేస్తున్నాం. మోడరన్‌ ఆర్ట్, కాంటెంపరరీ ఆర్ట్.. అన్నీ చేస్తున్నాం. యువత చాలా బాగా వేసిన పెయింటింగ్స్‌ కొన్నాను. ఇప్పుడు వాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరారు. వాళ్ల పెయింటింగ్స్‌కి ఇప్పుడు లక్షల రూపాయలు వస్తాయి. పెయింటింగ్స్‌కి క్యూరేటర్‌ కోర్సు పెట్టి వారిని ప్రోత్స‌హిస్తున్నాను. బార్గ‌వి చేయ‌ని మంచి ప‌ని లేదు, చేయ‌ని సేవా రంగం లేదు. ఎంతోమందికి భార్గ‌వి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

నిరంత‌ర ప్ర‌యాణాలు
►వైయ‌స్సార్‌ యూనిర్సిటీ అడ్వయిజరీ బోర్డు మెంబ‌ర్
►ఎన్‌జీవో సేవలు
►ఆదిలాబాద్‌ గిరిజనులు, అంధులు, వృద్ధులకు కావ‌ల‌సిన సేవ‌లు
►గ్రామాన్నిద‌త్త‌తు చేసుకుని, బాగుచేయ‌టం
►వ్య‌వసాయానికి భూమి క్లియర్ చేయ‌టం

క‌రోనా స‌మ‌యంలో..
►బోనాలు వంటి మన సంప్రదాయం గురించి మనకు తెలీదు. నిపుణుల‌తో వాటి గురించి ఆన్ లైన్ లో చెప్పించ‌టం.
►ఫౌండేషన్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్ (ఫేస్‌) తరఫున గ్రాంట్స్ ఇవ్వడం
►ఆన్‌లైన్‌లో ఎటికేట్ నేర్ప‌టం
►కాలేజీలో నేర్పని విషయాలు బియాండ్‌ క్లాస్‌రూమ్‌లో నేర్పించ‌టం
►కళాకారులకు ఉండవలసిన క్రమశిక్షణ గురించి నేర్పించ‌టం
►పర్మనెంట్‌ రెసిడెన్సీకి ఎలా అప్లయి చేయాలి, అక్కడికి వెళితే ఎలా ఉండాలి, ఆర్టిస్టు క్యూరేట్‌ చేసి ఎలా గుర్తింపు తెచ్చుకోవాలి, ఫౌండేషన్‌ గ్రాంట్స్‌ ఎలా తెచ్చుకోవాలి వంటి విష‌యాల గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌టం
►చరిత్రకారులను పిలిపించి మాట్లాడించ‌టం

జ్ఞానాన్ని పంచ‌టం...
ఆర్టిస్టులు దేనిని ఎలా నేర్చుకుంటారోన‌నే అంశం మీద ఆధార‌ప‌డి, కొందరిని సెలక్ట్‌ చేసుకుని, వారికి ఉచిత తరగతులు (అమౌంట్‌ ఇస్తాం) నిర్వ‌హిస్తున్నాం. హైదరాబాద్‌ గురించి చాలామందికి తెలియని ఎన్నోఉన్న‌త‌మైన విష‌యాలు... అంటే హైదరాబాద్‌లోని దిగుడు బావులు, వైల్డ్‌ లైఫ్‌, రాయల్‌ లైఫ్‌, చార్మినార్‌, బేకరీలు, ఆర్జిజాన్లు, గ్లిట్టరింగ్‌ పార్ట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, అత్తరు, ప్రీ మిడీవల్ ... ఇలా ఎన్నో విష‌యాల‌ను వారికి తెలియ‌చేసే త‌ర‌గ‌తులు నిర్వ‌హిస్తున్నాం. ప‌ఠాన్‌చెరు అతి పురాతన ప్రదేశమ‌ని, అది ఒకప్పుడు వ్యాపార కేంద్రమ‌ని, కొలోనియల్‌ టైమ్‌ పీరియడ్ నాటి ప్ర‌దేశ‌మ‌ని, ఉర్దూ భాష మాట్లాడేవార‌ని, అప్ప‌టి జనజీవనం, సింగాడా కాయల గురించి (వాటర్‌ చెస్ట్‌నట్‌) ... ఇలా హైదరాబాద్‌ గురించినవన్నీ చెప్పాం.

సంభాష‌ణ‌: వైజ‌యంతి పురాణ‌పండ‌

చదవండి: జలియన్‌వాలాబాగ్‌ దురంతం: ఒక జాతి ఆత్మను తాకిన తూటా..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement