ఒకప్పుడు నాడి పట్టుకుంటే చాలు.. రోగి ఒంట్లోని జబ్బేంటో చెప్పేసేవారు వైద్యులు. ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా.. వైద్యుడిని సంప్రదించే ముందే డయాగ్నోస్టిక్ సెంటర్ గురించి వాకబు చేయాల్సిందే. నగరంలోని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అడ్రస్‌లను, ఇతర వివరాలను అందుబాటులో ఉంచుతోంది ‘బుక్ మై ల్యాబ్’ వెబ్‌సైట్. కామన్ పీపుల్ భారంగా భావించే వైద్య పరీక్షలను సులభతరం చేస్తోంది.
- భువనేశ్వరి
ఒంట్లో నలతగా ఉంటే డాక్టర్‌ను సంప్రదిస్తాం. డాక్టర్ ఫలానా వైద్య పరీక్షలు చేయించండని చెబుతారు. ఆ టెస్ట్‌లు చేయించడం కోసం మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లను వెతకాల్సిన పని లేకుండా చేస్తోంది ‘బుక్ మై ల్యాబ్’. ముందుగా మీరు ఈ వెబ్‌సైట్‌లోకి ఎంటరై.. మీ పేరిట అకౌంట్ ఓపెన్ చేయాలి. వెబ్‌సైట్‌లో మూడు వందలకు పైగా డయాగ్నోస్టిక్ సెంటర్ల అడ్రస్‌లు, ఫోన్‌నంబర్లు అందుబాటులో ఉన్నాయి. మీరున్న ఇంటికి దగ్గరగా ఉన్నది, లేదా మీకు నమ్మకమైంది ఎంచుకుని ఒక్క ఫోన్ కొడితే చాలు.. సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు మీ ఇంటికొచ్చి మరీ బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తారు. ఇక్కడితోనే బుక్ మై ల్యాబ్ పని అయిపోదు.. శాంపుల్స్‌ను పరీక్షించాక ఆ వివరాలను మీ అకౌంట్‌లో పొందుపరుస్తారు. మీ రిపోర్ట్స్ మీరెక్కడికి వెళ్లినా వన్ క్లిక్ దూరంలో మీకు అందుబాటులో ఉంటాయన్నమాట.
ఒక పరిష్కారంగా..
‘మేం ఈ వెబ్‌సైట్ మొదలుపెట్టి ఆరు నెలలు కావొస్తోంది. వెయ్యిమంది పేషెంట్లు అకౌంట్ ఓపెన్ చేస్తే సక్సెస్ అయినట్టేనని భావించాం. అయితే ఇప్పటి వరకు నగరంలోని 2,600 మంది బుక్ మై ల్యాబ్‌లో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. మనకు వైద్యం అందుబాటులోకి వచ్చినంత వేగంగా.. డయాగ్నోసెంటర్ల సేవలు అందడం లేదు. ఏదైనా పేరున్న సెంటర్‌కి వెళ్తే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే బుక్ మై ల్యాబ్‌ను తీసుకొచ్చాం’ అని చెబుతారు దీని రూపకర్త శంకర్.
నిక్షేపంగా..
ఈ రోజుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఎంత పదిల ంగా దాచుకోవాలో.. టెస్ట్ రిపోర్ట్స్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తోంది. దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ఇది అత్యంత అవసరం. నగరంలో చాలా మంది రోగులు రిపోర్ట్స్‌ను భద్రంగా దాచుకోలేక.. చేయించుకున్న టెస్ట్‌లే మళ్లీ చేయించుకోవాల్సి వస్తోందని ఒక సర్వేలో తేలింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బుక్ మై ల్యాబ్‌కు రూపకల్పన చేశామంటారు శంకర్. ‘మొదట కేవలం పరీక్షల రిపోర్ట్స్ భద్రపరిచే ప్లాట్‌ఫామ్‌గా దీన్ని ఉంచాలనుకున్నాం. కానీ, రోగుల అవసరాల దృష్ట్యా వారికి డయాగ్నోస్టిక్ సెంటర్ల వివరాలను అందుబాటులో ఉంచాం’ అంటారు శంకర్. అతని స్నేహితులు కాశి, ప్రమోద్‌తో పాటు మరో ఏడుగురు కుర్రాళ్లు ఈ వెబ్‌సైట్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు.
అన్నీ ఆన్‌లైన్...
వైద్యపరీక్షల పత్రాలే కాదు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీని స్కాన్ చేసి అకౌంట్‌లో పెట్టుకుంటే సరి. ఈ వివరాలు అకౌంట్ హోల్డర్ అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. మరొకరు ఈ వివరాలు తెలుసుకునే వీలుండదు. ఇటీవల శ్రీనగర్‌కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌కు చెందిన 200 మంది ఒకేసారి బుక్ మై ల్యాబ్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. నిత్యజీవితంలో అన్నీ ఆన్‌లైన్ అయిపోతున్న ఈ తరుణంలో.. వైద్యపరీక్షలు మాత్రం ఎందుకు ఆన్‌లైన్‌లో భద్రపరచకూడదని వారు భావిస్తున్నారు.
క్లిక్ & బుక్
Published Sun, Apr 26 2015 11:25 PM | Last Updated on Wed, Apr 3 2019 4:22 PM
Advertisement