ఉస్మానియా ఆసుపత్రి
let's see చూసొద్దాం రండి
రాష్ట్రంలోనే అతిపెద్ద ధర్మాసుపత్రిగా ప్రసిద్ధికెక్కింది ఉస్మానియా. మూసీ నదీ తీరంలో 1866 ప్రాంతంలో నిర్మించిన ఈ ఆసుపత్రి నాడే రెండు అంతస్థుల భవనంలో ఆధునిక వైద్య సేవలు అందించేది. ఆ రోజుల్లో దీన్ని అఫ్జల్‌గంజ్ దవాఖానా అనేవారు. అయితే ఈ ఆసుపత్రి భవనాలు 1908లో వచ్చిన మూసీ వరదల తాకిడికి పూర్తిగా దెబ్బతిన్నాయి. దాంతో ఏడో నిజాం 1920లో తిరిగి ఇదే ప్రాంతంలో ఆసుపత్రి కోసం నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
ఐదేళ్ల కాలంలో పనులన్నీ పూర్తి చేసుకుని 1925లో నూతన ఆసుపత్రి ప్రారంభమైంది. అప్పటి నుంచి దీన్ని ఉస్మానియా ఆసుపత్రిగా పిలుస్తున్నారు. భవిష్యత్‌లో ఎప్పుడైనా మూసీకి వరదలు వచ్చినా ఎలాంటి ఇబ్బందులూ లేని రీతిలో దీన్ని నిర్మించారు. భవనాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. వెయ్యి పడకల ఆసుపత్రిగా ఎందరో పేద రోగులకు ఆధునిక వ్యై సేవలు అందిస్తున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి ప్రధాన భవనంలోకి ప్రవేశించగానే... సుమారు 110 అడుగుల ఎత్తై ద్వారం స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది.
ఆసుపత్రి లోపల భాగంలో నిజాం మహబూబ్ అలీఖాన్ (1869-1911), నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (1911-1948) నిలువెత్తు చిత్రపటాలు చూపరులను ఆకర్షిస్తాయి. ప్రధాన హాలు లోపలి భాగాలు కూడా సుమారు 70-80 అడుగుల ఎత్తులో నాలుగు కమాన్లతో ఎంతో అందంగా కనిపిస్తుంది. కమాన్ల పైభాగాన నిజాం ప్రభువులు ఉపయోగించిన తలపాగా ఆకారంలోని కుడ్య చిత్రాలు నేటికీ చెక్కు చెదరలేదు. భవనం లోపల కూడా నాటి చిత్రకారులు గీసిన లతలు, పుష్పాలు ఇప్పటికీ ఆకర్షిస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం ఏడాదికి ఏడు లక్షల మంది ఔట్ పేషెంట్‌లకు, అలాగే మరెందరో ఇన్‌పేషెంట్స్‌కు వైద్య సేవలందిస్తున్నారు. 250 మంది వైద్యులు, 300 మంది హౌస్ సర్జన్లు, 500 మందికి పైగా నర్సింగ్, 800 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. ఉస్మానియా భవనాలు 27 ఎకరాల్లో విస్తరించాయి. 1160 పడకల ఆసుపత్రిగా నిత్యం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిపోయే పేద రోగులతో కిటకిటలాడుతోంది.
- మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com