ఆర్తత్రాణ పరాయణుడివి, శరణాగత రక్షకుడివి, పిలిస్తే పరుగెత్తేకొచ్చేవాడివి, ఎంతటి కష్టాల్నయినా వహించేవాడివి, సహించేవాడివి...ఒక్కసారి వచ్చి దర్శనమిమ్మంటే రావేం తండ్రీ...అంటూ త్యాగయ్య... బహుశః నీవు రాకపోవడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చంటూ ఆ కీర్తనలో ఇలా అంటాడు...‘‘ఖగరాజు నీయానతి విని వేగ చన లేడో –గగనానికిలకు బహుదూరంబని నాడో...’’. గరుత్మంతుడేమయినా..‘‘అబ్బో అంతదూరం ఎక్కడ పోతాం లేండి...ఎక్కడాకాశం !!! ఎక్కడ భూమి !!! ఇంతదూరం నుంచి అక్కడికి ఏం పోతాం లేండి.’’ అన్నాడా స్వామీ... భగవంతుడితో తమ ఆర్తిని ఎంత లలితమైన పదాలతో వాగ్గేయకారులు వ్యక్తం చేసారో చూడండి. ఒకవిధంగా అది దెప్పిపొడుపు.. ఇంత మొరపెట్టుకున్నా ఆయన రానందుకు... కానీ అంతరార్థంలో...‘నిజంగా నీవు రావాలనుకుంటే, నాకు కనపడాలనుకుంటే అక్కడి నుంచి ఇక్కడకు ప్రత్యేకంగా పనికట్టుకుని రావాలా స్వామీ.
నువ్వెక్కడ లేవు కనుక...‘ఇందుగలడందులేడని సందేహము వలదు...’ అని ప్రహ్లాదుడంటే అక్కడే ఉన్న స్తంభం చీల్చుకుని రాలేదా స్వామీ... అలాటిది ఇవ్వాళ నిజంగా నువ్వు రావాలనుకుంటే..‘పాపం త్యాగయ్య అంత బాధపడుతున్నాడు, ఒక్కసారి కనపడిపోదాం...అనుకుంటే నీకు గరుత్మంతుడి అవసరమేముంది కనుక.. నీవెక్కడ లేవు కనుక అని మరో అర్థం. గజేంద్రుడు ఎప్పుడు పిలిచాడు... చిట్టచివర ఓపికంతా అడుగంటిన తరువాత..‘లా ఒక్కింతయు లేదు... ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులా ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె...’’ అంటూ ఊపిరి ఆగిపోయేముందు పిలిచిన పిలుపు నీకు వినపడినప్పుడు ఈరోజు ఇంత ఆర్తితో ఇంత ఎలుగెత్తి నిన్ను పిలుస్తున్నా నీ చెవినపడలేదా స్వామీ... ఒకవేళ నేనే తప్పు చేసానేమో...‘జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు...’ అంటున్నారు త్యాగయ్య. నాకేదయినా కష్టం వస్తే నీకు చెప్పుకుంటాను.
నాకు ఆకలేసింది, అన్నం దొరకలేదు, నాకు సంగీతంలో ఏదో సమస్య వచ్చింది, నేను అవి నీతో తప్ప మరెవరికి చెప్పుకుంటాను... కానీ ఇప్పుడు నా సమస్య నువ్వే. నేను పిలుస్తున్నా నీవు రాకపోతే నేనెవరికి చెప్పుకోను... జగాలను ఏలే వాడివి... లోకాలకన్నింటికీ ఏలికవు నువ్వు. ఇవ్వాళ నీవే కనపడకపోతే నేనెవరితో చెప్పుకోను తండ్రీ... రాముడు కనపడడం లేదు.. అని ఎవరితోనయినా చెప్పుకుంటే సిగ్గుచేటు..ఏమిటీ, నీకు రాముడు కనపడ్డం లేదా అని హేళన చేయరా స్వామీ.. నువ్వు కూడా తేలిగ్గా తీసేయవద్దు... నన్ను పగవాడిగా చూడకు. ఇంతకన్నా నాకు చేతకాదు... నా ఆర్తి విను.. చూడకుండా ఉండలేను రామా! ‘నగుమోము కనలేనీ నాదు జాలీ తెలిసీ... ఆలస్యం చేయకు... ఒక్కసారి కనపడు. వారి మనసు నొచ్చుకున్నప్పుడు సంగీతకారుల, భక్తి తాదాత్మ్యత ఎంత పరాకాష్టకు చేరుకుంటుందంటే... సాక్షాత్... వారి ఇష్టదైవాన్ని కూడా నిలదీసేస్తారు... అయితే దానిలో పారుష్యం ఉండదు, ఆర్తిమాత్రమే కనబడుతుంది.. దాశరథీ శతక కర్త..
ఒక సందర్భంలో ‘‘దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుల దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు, నే జేసిన పాపమో వినుతి జేసిన గానవు, గావుమయ్య నీ దాసులలోన నేనొకడ దాశరథీ ! కరుణాపయోనిధీ!’’ అంటారు. అంటే ‘‘నీకేమయినా శబరి చుట్టమా, గుహుడు సేవకుడా... వారితో దాస్యం (సేవలు) చేయించుకున్నావు. నేను పనికి రాలేదా.. నీ దాసానుదాసుల్లో నేనూ ఒకడినే కదా... నన్నెందుకు కరుణించవు’’ అంటాడు..అప్పటికప్పుడు సందర్భాన్ని అనుసరించి గురువుగారు పాడమంటే రాముడి దర్శనం కోసం వెంపర్లాడిపోయిన త్యాగయ్య నోటివెంట అలవోకగా వచ్చిన అద్భుతమైన కీర్తన ఇది. ఇది ప్రప్రథమమైన ప్రయోగమే అయినా పండిపోయిన భక్తికి ప్రతి అక్షరం అద్దం పడుతుంది. ఆ తరువాత వారి నోటివెంట అజరామరమైన కీర్తనలు చాలా వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment