Dasarathi
-
దాశరథి వారసుడు రామానుజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహాకవి దాశరథి పురస్కారం–2020ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో రామానుజానికి అందజేశారు. శాలువా కప్పి సన్మానించడంతో పాటు జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు. దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు. సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండటంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని కొనియాడారు. రామానుజం మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ , సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రామానుజం ఓ పద్యం రాసి, పాడి వినిపించారు. ‘‘శ్రీ తెలంగాణమును శ్రీ ఖండమును సేయ అవతరించిన యెట్టి అపర విష్ణుడవీవు.. తెలంగాణమున కోటి ఎకరాలు పారించి పంట భూమిగ మార్చ ప్రతిన బూనిన యట్టి రైతు స్వామివి నీవు జాతి నేతవు నీవు శ్రీ కల్వకుంట్ల క్షీరాబ్ధి చంద్రమా శ్రీ రస్తు శ్రీ చంద్రశేఖరా తెలంగాణ దీపమా విజయోస్తు’’ -
జగమేలే పరమాత్మా! నీకిది తగునా!!
ఆర్తత్రాణ పరాయణుడివి, శరణాగత రక్షకుడివి, పిలిస్తే పరుగెత్తేకొచ్చేవాడివి, ఎంతటి కష్టాల్నయినా వహించేవాడివి, సహించేవాడివి...ఒక్కసారి వచ్చి దర్శనమిమ్మంటే రావేం తండ్రీ...అంటూ త్యాగయ్య... బహుశః నీవు రాకపోవడానికి మరో కారణం కూడా ఉండి ఉండవచ్చంటూ ఆ కీర్తనలో ఇలా అంటాడు...‘‘ఖగరాజు నీయానతి విని వేగ చన లేడో –గగనానికిలకు బహుదూరంబని నాడో...’’. గరుత్మంతుడేమయినా..‘‘అబ్బో అంతదూరం ఎక్కడ పోతాం లేండి...ఎక్కడాకాశం !!! ఎక్కడ భూమి !!! ఇంతదూరం నుంచి అక్కడికి ఏం పోతాం లేండి.’’ అన్నాడా స్వామీ... భగవంతుడితో తమ ఆర్తిని ఎంత లలితమైన పదాలతో వాగ్గేయకారులు వ్యక్తం చేసారో చూడండి. ఒకవిధంగా అది దెప్పిపొడుపు.. ఇంత మొరపెట్టుకున్నా ఆయన రానందుకు... కానీ అంతరార్థంలో...‘నిజంగా నీవు రావాలనుకుంటే, నాకు కనపడాలనుకుంటే అక్కడి నుంచి ఇక్కడకు ప్రత్యేకంగా పనికట్టుకుని రావాలా స్వామీ. నువ్వెక్కడ లేవు కనుక...‘ఇందుగలడందులేడని సందేహము వలదు...’ అని ప్రహ్లాదుడంటే అక్కడే ఉన్న స్తంభం చీల్చుకుని రాలేదా స్వామీ... అలాటిది ఇవ్వాళ నిజంగా నువ్వు రావాలనుకుంటే..‘పాపం త్యాగయ్య అంత బాధపడుతున్నాడు, ఒక్కసారి కనపడిపోదాం...అనుకుంటే నీకు గరుత్మంతుడి అవసరమేముంది కనుక.. నీవెక్కడ లేవు కనుక అని మరో అర్థం. గజేంద్రుడు ఎప్పుడు పిలిచాడు... చిట్టచివర ఓపికంతా అడుగంటిన తరువాత..‘లా ఒక్కింతయు లేదు... ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులా ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె...’’ అంటూ ఊపిరి ఆగిపోయేముందు పిలిచిన పిలుపు నీకు వినపడినప్పుడు ఈరోజు ఇంత ఆర్తితో ఇంత ఎలుగెత్తి నిన్ను పిలుస్తున్నా నీ చెవినపడలేదా స్వామీ... ఒకవేళ నేనే తప్పు చేసానేమో...‘జగమేలే పరమాత్మ ఎవరితో మొరలిడుదు...’ అంటున్నారు త్యాగయ్య. నాకేదయినా కష్టం వస్తే నీకు చెప్పుకుంటాను. నాకు ఆకలేసింది, అన్నం దొరకలేదు, నాకు సంగీతంలో ఏదో సమస్య వచ్చింది, నేను అవి నీతో తప్ప మరెవరికి చెప్పుకుంటాను... కానీ ఇప్పుడు నా సమస్య నువ్వే. నేను పిలుస్తున్నా నీవు రాకపోతే నేనెవరికి చెప్పుకోను... జగాలను ఏలే వాడివి... లోకాలకన్నింటికీ ఏలికవు నువ్వు. ఇవ్వాళ నీవే కనపడకపోతే నేనెవరితో చెప్పుకోను తండ్రీ... రాముడు కనపడడం లేదు.. అని ఎవరితోనయినా చెప్పుకుంటే సిగ్గుచేటు..ఏమిటీ, నీకు రాముడు కనపడ్డం లేదా అని హేళన చేయరా స్వామీ.. నువ్వు కూడా తేలిగ్గా తీసేయవద్దు... నన్ను పగవాడిగా చూడకు. ఇంతకన్నా నాకు చేతకాదు... నా ఆర్తి విను.. చూడకుండా ఉండలేను రామా! ‘నగుమోము కనలేనీ నాదు జాలీ తెలిసీ... ఆలస్యం చేయకు... ఒక్కసారి కనపడు. వారి మనసు నొచ్చుకున్నప్పుడు సంగీతకారుల, భక్తి తాదాత్మ్యత ఎంత పరాకాష్టకు చేరుకుంటుందంటే... సాక్షాత్... వారి ఇష్టదైవాన్ని కూడా నిలదీసేస్తారు... అయితే దానిలో పారుష్యం ఉండదు, ఆర్తిమాత్రమే కనబడుతుంది.. దాశరథీ శతక కర్త.. ఒక సందర్భంలో ‘‘దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుల దాసుడా గుహుడు తావక దాస్యమొసంగినావు, నే జేసిన పాపమో వినుతి జేసిన గానవు, గావుమయ్య నీ దాసులలోన నేనొకడ దాశరథీ ! కరుణాపయోనిధీ!’’ అంటారు. అంటే ‘‘నీకేమయినా శబరి చుట్టమా, గుహుడు సేవకుడా... వారితో దాస్యం (సేవలు) చేయించుకున్నావు. నేను పనికి రాలేదా.. నీ దాసానుదాసుల్లో నేనూ ఒకడినే కదా... నన్నెందుకు కరుణించవు’’ అంటాడు..అప్పటికప్పుడు సందర్భాన్ని అనుసరించి గురువుగారు పాడమంటే రాముడి దర్శనం కోసం వెంపర్లాడిపోయిన త్యాగయ్య నోటివెంట అలవోకగా వచ్చిన అద్భుతమైన కీర్తన ఇది. ఇది ప్రప్రథమమైన ప్రయోగమే అయినా పండిపోయిన భక్తికి ప్రతి అక్షరం అద్దం పడుతుంది. ఆ తరువాత వారి నోటివెంట అజరామరమైన కీర్తనలు చాలా వచ్చాయి. -
జీవనవేదం
ప్రతి రచయితకీ కలం అందించే చేయి ఒకటి ఉంటుంది. సాధారణంగా ఆ చేయి భార్యది అయినప్పుడే ఆ రచయిత రచనాజీవనం ఒడుదొడుకులు లేకుండా సాగిపోతుంది. దాశరథి రంగాచార్య ఎన్ని వేల పుటలు రాశారో ఆయనకే తెలియదు. కాని ఆయన అక్షరం అల్లుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ఆయన భార్య కమల గొడుగు అయ్యింది. గోడ అయ్యింది. నీడ అయ్యింది. ఒక చక్కని చిరునవ్వుతో- ఇవాళ ఏదైనా రాస్తే బాగుండు అనే ఉత్సాహాన్ని కలిగించింది. కథలు, నవలలు, అనువాదాలు, వేద పరిచయాలు... తెలుగువారికి దాశరథి అందించిన సాహితీ రతనాలు ఎన్నో. కూర్చిన వచన రాశులు మరెన్నో. ఇవాళ ఆయన దిగంతాలలో దప్పికగొన్న దేవతలకు తన రచనామృతాన్ని పంచడానికి బయలుదేరి వెళ్లారు. కాని ’సాక్షి ఫ్యామిలీ’కి ఈ అపురూప జ్ఞాపకాన్ని మిగిల్చారు. గతంలో ‘బెటర్ హాఫ్’ శీర్షిక కోసం దాశరథి పంచుకున్న జ్ఞాపకాలను మరోసారి పాఠకులకు అందిస్తున్నాం. సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని దాశరథి రంగాచార్య నివాసంలోకి అడుగు పెడుతుండగా ఎనభై ఆరేళ్ల రంగాచార్యను ఆయన భార్య ఎనభై ఏళ్ల కమల తన రెండు చేతుల్తో పదిలంగా పొదువుకొని జాగ్రత్తగా కూర్చోబెడుతూ కనిపించారు. ఇద్దరినీ ఆ క్షణంలో చూస్తే ఫలాలు ఇచ్చీ ఇచ్చీ పరిపూర్ణతతో మిగిలిన రెండు మామిడివృక్షాలు గుర్తుకువచ్చాయి. పిందె, పత్రం, శాఖ, కాండం అన్నీ అనుభవాలను నింపుకున్నవే. భావితరాలకు విలువైనవి. భార్యను పక్కనే కూచోబెట్టుకుని పాత జ్ఞాపకాల వెలుగు కళ్లలో ప్రసరిస్తుండగా ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. ‘పెళ్లప్పుడు కమల వయసు ఆరు. నా వయసు 12. శారదా చట్టం ప్రకారం బాల్య వివాహం నేరంగా పరిగణించే రోజులు. పోలీసులొస్తే గుమ్మం దగ్గరే ఆపి, ఏదో పూజ అని చెప్పి, మా పెళ్లి చేశారు పెద్దలు. తర్వాత పదహారేళ్ల వయసులో కమల మా ఇంట అడుగు పెట్టింది. అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమాలలో ఉన్నాను. జైలుకు కూడా వెళ్లాను’ అన్నారాయన. కమల అందుకున్నారు - ‘అత్తింట అడుగుపెట్టాక నాకు ఈయన గురించి అర్థమైన సంగతి ఒకటే ఒకటి. అది ఈయనకు పుస్తకాలు ఇష్టమని. టీచర్ ఉద్యోగమైతే ఇంకా చదువుకోవడానికి వ్యవధి ఉంటుందని మెట్రిక్యులేషన్ పాసై, ఆ ఉద్యోగం తెచ్చుకున్నారు కూడా. అప్పుడే నిశ్చయించుకున్నాను ఈయన చదువుకు నేనో దీపంలా మసలాలని. నాలుగైదు ఊర్లు మారి హైదరాబాద్‌కు వచ్చాం. పగలంతా ఉద్యోగం చేయడం, సాయంత్రాలు రాసుకోవడం ఈయన పని. ఇంటిపనులు, పిల్లల వ్యవహారాలు నా బాధ్యత. ముందు వైపు నుంచి చూస్తే ముఖం కనపడుతుంది. వెనుక నుంచి చూస్తే వీపు. ఏదీ ఒక దాని కంటే ఒకటి తక్కువ కాదు. రెండూ ఉంటేనే మనిషి’ అన్నారామె. ఆయన మాట కలిపారు. ‘మాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. పిల్లల చదువులు, నా తోబుట్టువుల పెళ్లిళ్లు, కూతుళ్ల పెళ్లిళ్లు, వారి బారసాలలు.. అన్నీ కమలే చూసుకునేది. నా కోసం కుటుంబం కోసం ఇంత కష్టపడిన నా భార్యకు ఏమివ్వగలను అనిపించేది’ అని రంగాచార్య చెబుతుంటే ఆమె- ‘ఈయన షష్టిపూర్తి అయిన ఆరేళ్లకు నాకు అరవై ఏళ్లు వచ్చాయి. వెంటనే ‘మా ఆవిడకు షష్టిపూర్తి’ అని పెద్ద ఎత్తున వేడుక మొదలుపెట్టారు. ‘అదేమిటి, ఆవిడకు షష్టిపూర్తి ఏమిటి?’ అని అందరూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అన్నేళ్లయినా మా అనురాగం పదిలం అని చెప్పడానికే అని ఈయన జవాబు. ఇంతకన్నా ఏం కావాలి’ అన్నారు సంతోషం నిండిన హృదయంతో. రంగాచార్య స్పందించారు... ‘ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. వీల్‌చెయిర్‌కే పరిమితం అయ్యాను. ఈవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే! అయినా నా ఆరోగ్యం కోసం తహతహలాడుతుంది. ఈ వయసులో అంతకుమించిన బాంధవ్యం ఎవరి ద్వారా లభిస్తుంది? భార్య కాకుండా ఇలా ఎవరైనా అంతడగా నిలువగలరా’ అంటుంటే - ‘సంసారం నడపడానికి ఎన్నో పరుగులు తీశాం. ఇప్పుడు తీరిక దొరికింది. పిల్లలకు సంబంధించిన విషయాలు, రచనలు, సమకాలీన పరిస్థితులు ముచ్చటించుకుంటూ ఉంటాం. గతం తాలూకు జ్ఞాపకాలను కలబోసుకోవడంలో ఆనందాన్ని పొందుతుంటాం. మొదటినుంచి ఈయన ఏది చెప్పినా నేను ‘సరే’ అనే అన్నాను. ఆయన కూడా అంతే. అందుకే ఇన్నేళ్లలో ఒకరి మీద ఒకరం విసుక్కున్నది లేదు. కోపమన్నదే ఎరగం’ అన్నారు కమల. కాని విషాదాలు లేవా? ఆ సమయాలను ఎలా దాట గలిగారు? ఆ ప్రశ్నే అడిగితే రంగాచార్య కళ్లల్లో ఒకరమైన విచారం కమ్ముకుంది. ఆమె కళ్లల్లో పల్చటి కన్నీటి తెర. ఆయన గొంతు గద్గదమవుతుండగా జ్ఞాపకం బయటకు వచ్చింది. ‘మొదటి కాన్పు సమయంలో డెలివరీకని బెజవాడ ఆసుపత్రికి బయల్దేరాం. దారిలో ట్రెయిన్లో నొప్పులు. ఏం చేయాలో తోచలేదు. పాతరోజులు. నలుగురూ సాయం పట్టి కదులుతున్న ట్రెయిన్‌లోనే పురుడు పోశారు. కాని బిడ్డ మమ్మల్ని కరుణించలేదు. పుడుతూనే చనిపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఈమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలి? వేరే మార్గం కనిపించక, ఆ బిడ్డ కాయాన్ని కృష్ణానది ఒడిలో వదిలేయాల్సి వచ్చింది’ ఆ తర్వాత ఆయన మాట్లాడలేకపోయారు. ‘నేను ఎన్నిసార్లు అడిగినా మూడురోజుల వరకు బిడ్డ బతికుందనే చెప్పారు. నా ఆరోగ్యం పర్వాలేదనుకున్నాక అసలు విషయం చెప్పి ఎంతో బాధపడ్డారు’ అంటూ కమల భర్త చేతిపై తన చేయుంచారు. ఉద్యోగరీత్యా నగరానికి వచ్చాక ఇల్లు కట్టుకోవడంలో పడిన కష్టాన్ని రంగాచార్య గుర్తుచేసుకుంటూ- ‘యాభై ఏళ్ల క్రితం ఇప్పుడున్న ఈ ఇల్లు కట్టాలని నిశ్చయించుకున్నాం. అయితే ఇల్లు గోడల వరకు లేచి ఆగిపోయింది. పై కప్పు వేయడానికి పైకం లేదు. పిల్లలు చిన్నవారు. నిలవనీడ లేదు. ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లు కట్టడానికి పోసిన ఇసుకలో కూర్చొని కన్నీరు పెట్టుకున్నాం. జీవితంలో దుఃఖపూరితమైన సంఘటనలు ఏవేవో వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలోనే ఆలుమగలు ఒకరికొకరు ఓదార్చు కోవాలి. పంచుకునే హృదయం తోడుంటే ఎంతటి కష్టమైనా తట్టుకొని నిలబడవచ్చు. గాలిని ఎవరైనా తట్టుకుంటారు. వానను కూడా. కాని గాలీ వానా కలగలిసి వచ్చినప్పుడు తట్టుకుని నిలుచునేవారే భార్యాభర్తలు’ అని ముగించారాయన. తిరిగి వచ్చే ముందు వారి పాదాలను తాకాలనిపించింది. కాని - వారిని కలవడమే ఒక ఆశీర్వాదం కదా అని చిర్నవ్వుతో సాగనంపుతున్న ఆ ఇరువురిని చూసినప్పుడు అనిపించింది. - సాక్షి ఫ్యామిలీ నా రచనా వ్యాసంగానికి ఎలాంటి అడ్డంకి రానివ్వని నా భార్య కమల వల్లనే నాకు పేరుప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందాయి. - దాశరథి రంగాచార్య -
నిజాంను పొగడటం దివాలాకోరుతనమే
కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేల మంది పోరాటయోధులను చంపడంతోపాటు మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిజాం పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడటం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ లాంటి వారిని దారుణంగా చంపిన క్రూరమైన నిజాం పాలనను పొగుడుతున్న కేసీఆర్... ఆ మహనీయుల పోరాటం నిజం కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్తున్నట్టుగా నిజాంది గొప్ప పాలనే అయితే దాశరథి లాంటి వారు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారని, సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో కేంద్రం ఎందుకు పోలీసు చర్యకు దిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచకాలు సృష్టించిన నిజాం ప్రైవేట్ సైన్యం నుంచి పుట్టుకొచ్చిన మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కాగా, తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించే లక్ష్యంతో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. 7న సాయంత్రం వస్తున్న ఆయన మరుసటి రోజు ఉదయం పార్టీ రాష్ట్ర సలహా మండలి సమావేశం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పదాధికారులు, పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారన్నారు. -
ఇదో భువన విజయం
వరుసగా... అనువుుల(కుందావఝల కృష్ణవుూర్తి), దాశరథి కృష్ణమాచార్య (గిరిజావునోహర్బాబు), సురవరం ప్రతాపరెడ్డి(తిరువుల శ్రీనివాసాచార్య), ఆళ్వార్‌స్వామి(దత్తాత్రేయుశర్మ), కాళోజీ(యుల్లారెడ్డి) తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి దాశరథి కృష్ణమాచార్య 89వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఘనంగా నిర్వహించింది. కొన్ని దశాబ్దాలుగా ‘ఆంధ్రప్రదేశ్’లో ప్రాచుర్యంలో ఉన్న ‘భువనవిజయా’న్ని తలపిస్తూ ‘తెలంగాణ విజయా’న్ని గుర్తు చేస్తూ ‘సుకవితాశరథీ! దాశరథీ’ కార్యక్రమాన్ని అపూర్వంగా ప్రదర్శించింది. భువన విజయంలోని అష్టదిగ్గజ కవులు చారిత్రకంగా సమకాలికులు. అలాగే రవీంద్రభారతిలో మంగళవారం నిర్వహించిన ‘సుకవితాశరథి’లోని తెలంగాణ కవులు దాశరథికి సమకాలికులు, పూర్వీకులు. ప్రముఖ రచయిత సురవరం ప్రతాపరెడ్డిగా తిరుమల శ్రీనివాసాచార్య, దాశరథిగా గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు, వట్టికోట అళ్వారుస్వామిగా దత్తాత్రేయశర్మ, వానమామలై వరదాచార్యులుగా మధుసూదనరావు, కాళోజీగా పొద్దుటూరి యల్లారెడ్డి, అనుముల కృష్ణమూర్తిగా కుందావఝల కృష్ణవుూర్తి, చందాల కేశవదాసుగా పురుషోత్తమాచార్య, పల్లా దుర్గయ్యగా ఆచార్య వేణు, ఒద్దిరాజు సీతారామచంద్రరావుగా మడిపల్లి సుబ్బయ్య, ఆయన సోదరుడు ఒద్దిరాజు రాఘవరావుగా వనం లక్ష్మీకాంతరావు.. దాశరథితో ‘తెలంగాణ చారిత్రక, సాంప్రదాయ, ఉద్యమ ఘట్టాలను’ సమకాలీనులుగా పంచుకున్నారు. అప్పటికప్పుడు ఆయా పాత్రలను పోషించిన కవులు సహజంగా రూపొందించుకోవడం విశేషం. రూపకంలో కొన్ని వ్యక్తీకరణలు... వట్టికోట అళ్వారు స్వామి: నిజామాబాద్ జైల్లో దాశరథీ ‘ఓరోరి నైజాము...’ అంటూ నీవు ఆశువుగా కవిత్వం చెబుతుండగా పళ్లు తోముకునేందుకు ఇచ్చిన బొగ్గు ముక్కతో జైలు గోడలపై రాశాను కదా. రాసింది చూసి, రాసింది నేనేననుకుని పోలీసులు వేరే గదిలో వేసి కొట్టారు. దెబ్బలు గట్టిగా తగిల్నయి. నీది గట్టి కవిత్వం! చందాలకేశవదాసు: దాశరథీ... నీకంటే ఎంతో ముందు పుట్టినవాడిని. పరబ్రహ్మ పరమేశ్వరా, పురుషోత్తమ సదానంద అనే ప్రార్థనా గీతము, భలేమంచి చౌకబేరము- మీరజాలగలడా పాటలు రాస్తోన్న కాలం. నిన్ను అప్పట్లో చూడక పోయినా 15వ ఏట నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నావని నీ గురించి విన్నాను. ‘ నీ నినాదం తెలంగాణ మేనిసొమ్ము’! దాశర థి: తెలంగాణ స్వప్నం ఫలించడం వల్ల మనందరం ఇలా బతికి బట్టకట్టాం. తెలంగాణలో కవులు లేరన్న ‘ముడుంబై’ మాటలను పట్టుదలగా తీసుకుని గోలకొండ కవుల సంచికతో మూడు నూర్ల కవులను పరిచయం చేస్తూ సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన సమావేశమైన మనం పోతన వారసులం. ‘ఇమ్మనుజేశ్వరాధముల...’ అన్న పోతన నుంచి మన వరకూ, ఇకముందూ, తెలంగాణ కవులు ధిక్కార కవులే! సాహితీరూపకంలో పాల్గొన్న కవులను, క్వశ్చన్ మార్క్(?) శీర్షికతో దాశరథి రచన ‘ఆ చల్లని సముద్రంలో...’ ఆలపించిన దాశరథి గ్రామస్తుడు నందన్రాజును భాషా సాంస్కృతిక శాఖ డెరైక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ సత్కరించారు. - పున్నా కృష్ణమూర్తి -
అగ్నిధార
జూలై 22న కవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి సత్వం: ‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్?’’ అనడానికి ‘‘త్వకుంత్ర గచ్ఛసి’’ అనాలనేంతటి పట్టుదలవున్న ఇంట్లో జన్మించాడు దాశరథి. కానైతే ఆయనకు అంతటి సంస్కృత ‘ఛాందసం’ నచ్చేదికాదు. అలాగే, ‘తెలుగు మీద దండయాత్ర’ జరుగుతున్న నిజాం కాలంలో చదువుకున్నాడు. ఆయన అదీ సహించేవాడు కాదు. ఈ కారణాలవల్లేనేమో ఆయనలో రెండు పరస్పర విరుద్ధాంశాలు అద్భుతంగా సంలీనం చెందిన తీరు కనిపిస్తుంది. ‘సంప్రదాయం’లో బతుకుతూనే విప్లవమార్గాన్ని అనుసరించాడు; ‘పాత బూజు’గా ఎద్దేవా అవుతున్న పద్యాల్లోనే అభ్యుదయాన్ని కలగన్నాడు. దాశరథికి సాహిత్యం కేవలం సాహిత్యం కాదు; అది నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా జాతిని జాగృతం చేయాల్సిన పవిత్ర కర్తవ్యం. అందువల్లే, ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘తిమిరంతో సమరం’ లాంటి కావ్యాలు వెలువరించాడు. ‘అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్ని కాదా? అది ప్రవహించదా?’ అన్నాడు దాశరథి. అగ్నిని చైతన్యానికి సంకేతంగా, అది ఒక మానవహృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, జాతినంతటినీ ఏకసూత్రాన కట్టిపడేసేదిగా ఆయన తలచాడు. ‘నా గమ్యం ప్రపంచశాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం’ అని ప్రకటించుకున్న దాశరథి జీవితాన్నే పోరాటంగా మలుచుకున్నాడు. ‘తిమిరంతో ఘనసమరం, జరిపిన బ్రతుకే అమరం’ అన్నాడు. ‘ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగల్చి కాల్చి, నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు’ అని ప్రకటించాడు. కార్యాచరణ కూడా కవి కర్తవ్యంగా భావించినవాడు కాబట్టి, కటకటాల పాలయ్యాడు. 1948లో ఆయన్ని వరంగల్లు జైలునుంచి నిజామాబాద్ జైలుకు మార్చినప్పుడు మొదట వట్టికోట ఆళ్వారుస్వామి కనిపించి సంబరపడ్డాడట. వట్టికోట కోసం దాశరథి జైలుగోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాడు: ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్నుబోలిన రాజు మాకెన్నడేని;/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.’ గాఢమైన యౌవనప్రాయంలో ఆయన జైలుగోడల్లో బందీ అయ్యాడు. కానీ ఆయన మధురస్వప్నాల్ని ఎవరు బంధించగలరు? ‘అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి ఉంటాయి,’ అనేవారు ఆయన్ని చనువున్న మిత్రులు. సైనికుడు యుద్ధంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమైన కళ్లను తలచుకోవడం అస్వాభావికమా? అని ప్రశ్నిస్తాడు దాశరథి. అందుకేనేమో, ఆ భయానక ఒంటరి క్షణాల్లో వాళ్ల ఊరి నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి తలపుల్లో మెదులుతుండేదట! ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో కవ్వించేవట! మరోపక్కేమో జైలు బ్యారకు, నగ్న ఖడ్గం ధరించిన తుపాకీ భటుడు కనిపించేవాడు. వాణ్ని నరికేసి, లేదా వానిచే నరకబడి, ఆకాశంలోని మేఘభూమి వైపు సాగిపోవాలనిపించేదట! ఏ శషభిషలు లేకుండా రాయడం దాశరథి నిజాయితీ! ‘నేను పోతన కవీశానుగంటములోని ఒడుపుల కొన్నింటిని బడసినాను’ అని తన అభిమానాన్ని వెల్లడించిన దాశరథి... ‘మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష/ మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు’ అని తన రసహృదయాన్ని చాటుకున్నాడు. గాలిబ్‌ను అందువల్లే ఆయన పలవరించివుండొచ్చు. దాశరథిని తలుచుకోవడానికి నిజానికి గాలిబ్ గీతాల అనువాదం ఒక్కటి చాలు. ‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము/ నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము’. ‘దేవి! మన పూర్వబంధమ్ము త్రెంచబోకు/ ప్రేమలేకున్న నుండనీ ద్వేషమేని’. ‘మనిషి ఏకాకియౌనను మనసులోన/ గుంపులుగ భావములు జేరి గోష్ఠి జరుపు’. ఇక... ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’, ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’, ‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా’... సినిమా పాట స్థాయిని దిగజార్చకుండా పాటలు రాసిన అతికొద్దిమందిలో దాశరథీ ఒకరు. ఆయన ‘ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి’గా నియమితుడయ్యాడు. ‘యాత్రాస్మృతి’ పేరిట చక్కటి వచనం రాశాడు. ఆయన్ని ఎరిగినవారు స్నేహశీలి, మృదుస్వభావి, నిరాడంబరుడు అని చెబుతారు. వేటూరి అన్నట్టు, ‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’! -
గీత స్మరణం
పల్లవి : పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి... (2) నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి... చరణం : 1 కళకళలాడే నీ కళ్లు దేవుడి ఇళ్లమ్మా కిలకిల నవ్వే నీ మోము ముద్దుల మూటమ్మా ॥ నీ కోసమే నే జీవించాలి నీవే పెరిగి నా ఆశలు తీర్చాలి ॥ చరణం : 2 ఆటలలో చదువులలో మేటిగ రావాలి మంచితనానికి మారుపేరుగా మన్నన పొందాలి ॥ చీకటి హృదయంలో వెన్నెల కాయాలి నా బంగారుకలలే నిజమై నిలవాలి ॥ చరణం : 3 నచ్చినవాడు మెచ్చిన ప్రియుడు నాథుడు కావాలి (2) నీ సంసారం పూలనావలా సాగిపోవాలి నీ తల్లి కన్నీరు పన్నీరు కావాలి నిన్నే తలచి నే పొంగిపోవాలి ॥ చిత్రం: బంగారు కలలు (1974), రచన: దాశరథి సంగీతం: సాలూరి రాజేశ్వరరావు, గానం: పి.సుశీల నిర్వహణ: నాగేశ్ -
గీత స్మరణం
పల్లవి : ఆమె: చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ జోలపాట పాడేనూ లాలిపాట పాడేనూ చరణం : 1 అతడు: నీ ఒడిలో నిదురించీ తీయనీ కలగాంచీ పొంగి పొంగి పోయానూ పుణ్యమెంతో చేశానూ ఆ: నీ ఒడిలో నిదురించీ తీయని కలగాంచీ అ: పొంగి పొంగీ పోయానూ పుణ్యమెంతో చేశానూ ఏడేడు జన్మలకూ నాతోడు నీవమ్మా ఈనాటి ఈ బంధం ఏనాడు విడదమ్మా ఆ: అమ్మవలె రమ్మనగా పాపవలె చేరేవూ నా చెంత నీవుంటే స్వర్గమే నాదౌనూ అ: గాయత్రి మంత్రమునూ జపించే భక్తుడనే కోరుకున్న వరములనూ ఇవ్వకున్న వదలనులే చరణం : 2 ఆ: స్నానమాడి శుభవేళా కురులలో పువ్వులతో అ: దేవివలే నీవొస్తే నా మనసు నిలువదులే ఆ: అందాల కన్నులకూ కాటుకను దిద్దేనూ చెడుచూపు పడకుండా అదరు చుక్కపెట్టేనూ చిన్ని చిన్ని కన్నయ్యా కన్నులలో నీవయ్యా అ: నిన్ను చూసి మురిసేనూ నేను మేను మరిచేనూ ఆ: ఎత్తుకొని ముద్దాడీ ఉయ్యాలలూపేనూ అ: జోలపాట పాడేనూ ఆ: లాలిపాట పాడేనూ ఆ: జోలాలి... అ: జోలాలి... (2) ఇద్దరూ: జోజోజో... చిత్రం : భద్రకాళి (1977) రచన : దాశరథి సంగీతం : ఇళయరాజా గానం : జేసుదాస్, పి.సుశీల - నిర్వహణ: నాగేశ్