నిజాంను పొగడటం దివాలాకోరుతనమే
- కేసీఆర్‌పై కిషన్‌రెడ్డి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వేల మంది పోరాటయోధులను చంపడంతోపాటు మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించిన నిజాం పాలనను ముఖ్యమంత్రి కేసీఆర్ పొగడటం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. కొమురం భీమ్, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, షోయబుల్లాఖాన్ లాంటి వారిని దారుణంగా చంపిన క్రూరమైన నిజాం పాలనను పొగుడుతున్న కేసీఆర్... ఆ మహనీయుల పోరాటం నిజం కాదని చెప్పగలరా? అని ప్రశ్నించారు.
శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ చెప్తున్నట్టుగా నిజాంది గొప్ప పాలనే అయితే దాశరథి లాంటి వారు ఆయనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడారని, సర్దార్ పటేల్ ఆధ్వర్యంలో కేంద్రం ఎందుకు పోలీసు చర్యకు దిగిందని ప్రశ్నించారు. తెలంగాణలో అరాచకాలు సృష్టించిన నిజాం ప్రైవేట్ సైన్యం నుంచి పుట్టుకొచ్చిన మజ్లిస్ పార్టీ ప్రాపకం కోసం కేసీఆర్ ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాగా, తెలంగాణలో బీజేపీ బలపడేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై చర్చించే లక్ష్యంతో పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హైదరాబాద్‌కు వస్తున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు. 7న సాయంత్రం వస్తున్న ఆయన మరుసటి రోజు ఉదయం పార్టీ రాష్ట్ర సలహా మండలి సమావేశం, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు పదాధికారులు, పార్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలతో సమావేశమవుతారన్నారు.