అగ్నిధార
జూలై 22న కవి దాశరథి కృష్ణమాచార్యుల జయంతి
సత్వం: ‘‘నువ్వు ఎటు వెళుతున్నావ్?’’ అనడానికి ‘‘త్వకుంత్ర గచ్ఛసి’’ అనాలనేంతటి పట్టుదలవున్న ఇంట్లో జన్మించాడు దాశరథి. కానైతే ఆయనకు అంతటి సంస్కృత ‘ఛాందసం’ నచ్చేదికాదు. అలాగే, ‘తెలుగు మీద దండయాత్ర’ జరుగుతున్న నిజాం కాలంలో చదువుకున్నాడు. ఆయన అదీ సహించేవాడు కాదు. ఈ కారణాలవల్లేనేమో ఆయనలో రెండు పరస్పర విరుద్ధాంశాలు అద్భుతంగా సంలీనం చెందిన తీరు కనిపిస్తుంది. ‘సంప్రదాయం’లో బతుకుతూనే విప్లవమార్గాన్ని అనుసరించాడు; ‘పాత బూజు’గా ఎద్దేవా అవుతున్న పద్యాల్లోనే అభ్యుదయాన్ని కలగన్నాడు.
దాశరథికి సాహిత్యం కేవలం సాహిత్యం కాదు; అది నిర్బంధం, చిత్రహింసలకు వ్యతిరేకంగా జాతిని జాగృతం చేయాల్సిన పవిత్ర కర్తవ్యం. అందువల్లే, ‘అగ్నిధార’, ‘రుద్రవీణ’, ‘మహాంధ్రోదయం’, ‘పునర్నవం’, ‘తిమిరంతో సమరం’ లాంటి కావ్యాలు వెలువరించాడు. ‘అగ్నిధార అనేపేరును కొందరు ఆక్షేపించారు. అగ్ని ధారలా ప్రవహిస్తుందా? అన్నారు కొందరు. విద్యుత్తు అగ్ని కాదా? అది ప్రవహించదా?’ అన్నాడు దాశరథి. అగ్నిని చైతన్యానికి సంకేతంగా, అది ఒక మానవహృదయంలోనుండి ఇంకొకనిలోకి ప్రవహించి, జాతినంతటినీ ఏకసూత్రాన కట్టిపడేసేదిగా ఆయన తలచాడు.
‘నా గమ్యం ప్రపంచశాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం’ అని ప్రకటించుకున్న దాశరథి జీవితాన్నే పోరాటంగా మలుచుకున్నాడు. ‘తిమిరంతో ఘనసమరం, జరిపిన బ్రతుకే అమరం’ అన్నాడు. ‘ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగల్చి కాల్చి, నాలో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు’ అని ప్రకటించాడు. కార్యాచరణ కూడా కవి కర్తవ్యంగా భావించినవాడు కాబట్టి, కటకటాల పాలయ్యాడు.
1948లో ఆయన్ని వరంగల్లు జైలునుంచి నిజామాబాద్ జైలుకు మార్చినప్పుడు మొదట వట్టికోట ఆళ్వారుస్వామి కనిపించి సంబరపడ్డాడట. వట్టికోట కోసం దాశరథి జైలుగోడమీద బొగ్గుతో ఈ పద్యం రాశాడు: ‘ఓ నిజాము పిశాచమా! కానరాడు/ నిన్నుబోలిన రాజు మాకెన్నడేని;/ తీగెలను తెంపి అగ్నిలో దింపినావు/ నా తెలంగాణ, కోటిరత్నాల వీణ.’
గాఢమైన యౌవనప్రాయంలో ఆయన జైలుగోడల్లో బందీ అయ్యాడు. కానీ ఆయన మధురస్వప్నాల్ని ఎవరు బంధించగలరు? ‘అంగారం, శృంగారం నీ రచనలో కలగలిసి ఉంటాయి,’ అనేవారు ఆయన్ని చనువున్న మిత్రులు. సైనికుడు యుద్ధంలో పోరాడుతూకూడా అప్పుడప్పుడూ తన ప్రియురాలి అందమైన కళ్లను తలచుకోవడం అస్వాభావికమా? అని ప్రశ్నిస్తాడు దాశరథి. అందుకేనేమో, ఆ భయానక ఒంటరి క్షణాల్లో వాళ్ల ఊరి నదికి మంచినీళ్లు తీసుకుపోవడానికి వచ్చే పచ్చని అమ్మాయి తలపుల్లో మెదులుతుండేదట! ఆకాశంలోకి తలెత్తి చూస్తే, మేఘాలు అందమైన అమ్మాయిల ఆకారాలు ధరించి, పొంగిన వక్షస్థలాలతో కవ్వించేవట! మరోపక్కేమో జైలు బ్యారకు, నగ్న ఖడ్గం ధరించిన తుపాకీ భటుడు కనిపించేవాడు. వాణ్ని నరికేసి, లేదా వానిచే నరకబడి, ఆకాశంలోని మేఘభూమి వైపు సాగిపోవాలనిపించేదట! ఏ శషభిషలు లేకుండా రాయడం దాశరథి నిజాయితీ!
‘నేను పోతన కవీశానుగంటములోని ఒడుపుల కొన్నింటిని బడసినాను’ అని తన అభిమానాన్ని వెల్లడించిన దాశరథి... ‘మంచి కవిత్వం ఏ భాషలో వుంటే అది నా భాష/ మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు’ అని తన రసహృదయాన్ని చాటుకున్నాడు. గాలిబ్‌ను అందువల్లే ఆయన పలవరించివుండొచ్చు. దాశరథిని తలుచుకోవడానికి నిజానికి గాలిబ్ గీతాల అనువాదం ఒక్కటి చాలు. ‘ప్రతిది సులభమ్ముగా సాధ్యపడదు లెమ్ము/ నరుడు నరుడౌట యెంతొ దుష్కరము సుమ్ము’. ‘దేవి! మన పూర్వబంధమ్ము త్రెంచబోకు/ ప్రేమలేకున్న నుండనీ ద్వేషమేని’. ‘మనిషి ఏకాకియౌనను మనసులోన/ గుంపులుగ భావములు జేరి గోష్ఠి జరుపు’.
ఇక... ‘ఖుషీఖుషీగా నవ్వుతూ చలాకి మాటలు రువ్వుతూ’, ‘నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’, ‘ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా’... సినిమా పాట స్థాయిని దిగజార్చకుండా పాటలు రాసిన అతికొద్దిమందిలో దాశరథీ ఒకరు.
ఆయన ‘ఆంధ్రప్రదేశ్ తొలి ఆస్థానకవి’గా నియమితుడయ్యాడు. ‘యాత్రాస్మృతి’ పేరిట చక్కటి వచనం రాశాడు. ఆయన్ని ఎరిగినవారు స్నేహశీలి, మృదుస్వభావి, నిరాడంబరుడు అని చెబుతారు. వేటూరి అన్నట్టు, ‘అతను బుడుగైనా ఆర్తి పొడుగు. మూర్తి చిన్నదైనా కీర్తి దొడ్డది’!