
‘నేను బతుకుతానా అమ్మా?‘ అని అమాయకంగా అడిగింది సడాకో. తల్లి ఏమీ చెప్పలేక పక్కకు వెళ్లి ఏడ్చింది. సడాకోను ఆసుపత్రిలో ఉంచి రకరకాల చికిత్సలు అందిస్తున్నారు. 12 ఏళ్ల సడాకోది జపాన్ దేశం. ఆటపాటల్లో, చదువులో ఉత్సాహంగా ఉంటుంది. అలాంటి పిల్ల ఒక రోజు ఉన్నట్టుండి అనారోగ్యం పాలైంది. డాక్టర్లు తనకు రకరకాల పరీక్షలు చేశారు. పిడుగు లాంటి వార్త తెలిసింది. ఆ చిన్నారి పాపకు లుకేమియా. అంటే కేన్సర్. తనకీ పరిస్థితి ఎందుకు వచ్చిందని సడాకో తల్లిని అడిగింది.‘అణుబాంబు వల్ల’ అంది తల్లి.
1945 ఆగస్టులో అమెరికా జపాన్ మీద అణుబాంబు వేసే సమయానికి సడాకో వయసు రెండేళ్లు. సరిగ్గా బాంబు వేసిన ప్రదేశానికి మైలు దూరంలోనే సడాకో కుటుంబం ఉంటోంది. ఆ బాంబు దాడి నుంచి ఆ కుటుంబం ఎలాగో తప్పించుకుని బతికింది. కానీ అణుధార్మికత వల్ల సడాకోకు క్యాన్సర్ వచ్చింది.
‘అలాంటి బాంబును ఎందుకు వేశారు? ఎందుకు ఇంత నష్టం కలిగించారు?‘ అని అడిగింది సడాకో. తల్లి దగ్గర సమాధానం లేదు. ఏమని చెప్పగలదు? దేశాల మధ్య వైరంలో సామాన్యులే బాధితులు అని ఆ చిన్నారికి ఎలా అర్థం చేయించాలి? ‘ఇకపై ఎక్కడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?‘ అని మరో ప్రశ్న వేసింది సడాకో. ‘ప్రపంచంలో శాంతి నెలకొనాలి‘ అంది తల్లి.
’అవును! శాంతి నెలకొనాలి. ప్రపంచంలో అందరూ హాయిగా ఉండాలి. ఎవరికీ ఏ కష్టం రాకుండా ఉండాలి’ అని సడాకో నిర్ణయించుకుంది. కానీ తాను ఏం చేయగలుగుతుంది? తట్టిందో ఆలోచన.జపాన్ దేశ నమ్మకం ప్రకారం కాగితంతో కొంగు బొమ్మలు చేసి దేవుణ్ని ప్రార్థిస్తే అనుకున్నది నెరవేరుతుంది. వెంటనే ఆస్పత్రి మంచం మీదే సడాకో కాగితాలతో కొంగ బొమ్మలు చేయడం ప్రారంభించింది.
ఒకటి.. రెండు.. మూడు.. చేతులు నొప్పి పుట్టేవి. అలసట వచ్చేది. అయినా సడాకో ఆగిపోకుండా బొమ్మలు చేసేది. అలా చేస్తూ ఉంది. చేస్తూనే ఉంది. 1300 బొమ్మలు తయారు చేసింది. ఆపై చేయలేక΄ోయింది. 12 ఏళ్లకే సడాకో క్యాన్సర్‌తో మరణించింది. ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన కోరిక ఇంకా సజీవంగా ఉంది.
ఈ విషయం తెలిసిన జపాన్ ప్రభుత్వం సడాకో కోసం స్మారకం నిర్మించింది. కాగితపు కొంగ బొమ్మ పట్టుకున్న సడాకో విగ్రహాన్ని చూస్తే ప్రపంచంలో శాంతి నెలకొనాలన్న తన ఆశ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. నేటికీ అనేక మంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్లి కాగితంతో కొంగ బొమ్మలు చేసి అక్కడ పెడతారు.
ప్రపంచంలో శాంతి నెలకొనాలని ప్రార్థిస్తారు. కాని నేటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. పసిపిల్లల ప్రాణాలు తీస్తూనే ఉన్నాయి. పిల్లలు ఈ పెద్దల్ని చూసి ఏమనుకుంటారు? వీరికి బుద్ధి లేదు అనే కదూ..?.
(చదవండి: యమ్మీబ్రదర్స్: చదువుకుంటూనే వ్యాపారం చేస్తున్న చిచ్చరపిడుగులు..!)
Comments
Please login to add a commentAdd a comment