
శనివారం ప్రగతిభవన్‌లో రామానుజానికి దాశరథి పురస్కారాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సీఎస్ సోమేశ్‌కుమార్, ఎంపీ కేకే, మామిడి హరికృష్ణ, దేశపతి శ్రీనివాస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాతి గర్వించదగ్గ సాహితీవేత్త తిరునగరి రామానుజం అని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. మహాకవి దాశరథి సాహితీ వారసుడిగా రామానుజం నిలుస్తారని అభిప్రాయపడ్డారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహాకవి దాశరథి పురస్కారం–2020ని సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో రామానుజానికి అందజేశారు. శాలువా కప్పి సన్మానించడంతో పాటు జ్ఞాపిక, రూ.1,01,116 నగదు పురస్కారం అందించారు. దాశరథి పురస్కారానికి రామానుజం వందకు వంద శాతం అర్హుడని సీఎం అన్నారు. రామానుజం రాసిన బాలవీర శతకం, అక్షరధార, తిరునగరీయం లాంటి రచనలు ఎంతో ఆదరణ పొందాయని చెప్పారు.
సంప్రదాయ, సంస్కృత భాష పరిజ్ఞానం కలిగి ఉండటంతో పాటు ఆధునిక సాహిత్య అవగాహన కలిగిన సాహితీవేత్తగా రామానుజం నిలుస్తారని కొనియాడారు. రామానుజం మరిన్ని రచనలు చేసి తెలుగు సాహిత్యాన్ని మరింత సుసంపన్నం చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ , సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రామానుజం కుమారుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై రామానుజం ఓ పద్యం రాసి, పాడి వినిపించారు.
‘‘శ్రీ తెలంగాణమును శ్రీ ఖండమును సేయ అవతరించిన యెట్టి అపర విష్ణుడవీవు.. తెలంగాణమున కోటి ఎకరాలు పారించి పంట భూమిగ మార్చ ప్రతిన బూనిన యట్టి రైతు స్వామివి నీవు జాతి నేతవు నీవు శ్రీ కల్వకుంట్ల క్షీరాబ్ధి చంద్రమా శ్రీ రస్తు శ్రీ చంద్రశేఖరా తెలంగాణ దీపమా విజయోస్తు’’
Comments
Please login to add a commentAdd a comment