మాట్లాడుతున్న మంత్రి ఈటల రాజేందర్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: గుర్తింపు లేని కులాల గుర్తింపుకోసం కమిషన్ వేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్ధికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పేద పిల్లల చదువుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, ఇందులో భాగంగానే 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 2 లక్షల మంది విద్యార్ధులకు విద్యనందిస్తున్నామన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఏడు పదుల స్వాతంత్య్రంలో సంచార జాతులకు ఏడుపే మిగిలిందని, రాష్ట్రంలో అనేక కులాలకు ఇప్పటికీ గుర్తింపు లేకుండా పోయిందన్నారు. బీజేపీ శాసన సభాపక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా సంచార జాతుల బతుకులు మారలే దని, సంచార జాతులను గుర్తించేందుకు కమిషన్‌ను వేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ తిరుమలి, సంఘం నేతలు నరేందర్, వెంకటనారాయణ, కాటేపల్లి వీరస్వామి, మందుల గోపాల్, ఫకీర్ హుస్సేన్, రాజేశ్వర్ రావు, చవ్వ ఇస్తారి తదితరులు పాల్గొన్నారు.