సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: సమాజంలో 52 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం బీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మహాజన పాదయాత్రను పురస్కరించుకుని బీసీల సమస్యలపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. బీసీ సబ్‌ప్లాన్ చట్టం వస్తేనే వారు అభివృద్ధి చెందుతారని, దీని కోసం రెండేళ్లుగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
92 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధే తెలంగాణ అభివృద్ది అన్నారు. వెనకబడిన కులాల ప్రజల అభివృద్ది కోసం ప్రత్యేక చట్టాలు రావాలన్నారు. రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు వీజీఆర్ నారగోని మాట్లాడుతూ... ప్రజల్లో చైతన్యం తీసుకురావల్సిన బాధ్యత రాజకీయ పార్టీలపై ఉందన్నారు. బలహీన వర్గాల అభివృద్ధిపై ప్రభుత్వాలు స్పందించడం లేదని విమర్శించారు. ఉన్నత వర్గాల వారే అధికారంలోకి రావడం వల్ల బడుగుల జీవితం అరణ్య రోదనగా మారిందన్నారు.
రాజ్యాధికారం బడుగుల చేతుల్లోకి రావాలంటే మన ఓట్లను మనమే వేసుకోవాల న్నారు. బీసీ సబ్ ప్లాన్ సాధన కమిటీ కన్వీనర్ కిల్లె గోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు జి. రాములు, పి. ఆశయ్య, ప్రొఫెసర్ ప్రభంజన్‌యాదవ్. ఎంవీ రమణ, ఆర్. శ్రీరాంనాయక్, లెల్లెల బాలకృష్ణ, పి. రామకృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.