అచ్చయ్యనగర్‌లో పౌరసరఫరాల శాఖకు చెందిన గోడౌన్‌లను పరిశీలించిన కమీషనర్ సి.వి.ఆనంద్
సుందరయ్య విజ్ఞానకేంద్రం: ‘రేషన్ బియ్యంతో చేసిన అన్నం రుచికరంగా ఉంది.. అనవసరంగా బ్లేమ్ (ఆరోపణ) చేయడం తగదు.. రేపటినుంచీ నేనూ తింటా’ అని పేర్కొన్నారు పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్. శనివారం ఆయన బాగ్‌లింగంపల్లి అచ్చయ్యనగర్‌లోని పౌర సరఫరాల శాఖకు చెందిన గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. హమాలీలు ఎంత మంది ఉన్నారు.. వారికి ఎంత మొత్తం వస్తోందని అడిగి తెలుసుకున్నారు. తరువాత బియ్యం ఎలా ఉన్నాయి, ఎలా ఉడుకుతున్నాయో రుచి తెలుసుకోవటానికి అరకిలో బియ్యాన్ని ఉడకబెట్టమని సిబ్బందిని కోరారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. తాను బాధ్యత తీసుకున్న తర్వాత మొదటి సారిగా ఫీల్డ్ విజిట్ చేస్తున్నానన్నారు.ఈ పాస్ మిషన్లు ఎలా పని చేస్తున్నాయో, సరుకులు ఎలా సప్లయ్ అవుతున్నాయో తెలుసుకుంటానన్నారు. పోలీస్ శాఖలో చేసిన అనుభవంతో అక్రమాలను అదుపు చేస్తానని చెప్పారు. సరుకుల అ క్రమ రవాణా వల్ల వేల కోట్ల నష్టం జరుగుతోందని, దీంతో నిజమైన లబ్దిదారులకు నష్టం జరుగుతుందని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుంటే అవినీతిని అరికట్టవచ్చన్నారు.