పచ్చదనమివ్వని చెట్టు రాష్ట్ర చిహ్నమా?
జన జీవితాలలో టేకు చెట్ట్టు ప్రసక్తి ఎక్కడా ఉండదు. వైద్యానికి ఇది చాలా దూరం. ప్రజల సంస్కృతిలో ఇది భాగం కాదు. ఏ రకంగా చూసినా ఇది తెలంగాణ ప్రజల ప్రాతినిధ్యపు వృక్షం కాలేదు. టేకు చెట్టుని రాష్ట్ర చిహ్నంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం చూడటం సరికాదు.
జాతీయ, రాష్ట్రీయ చిహ్నాలు తప్పక ఆ నేలతో సంబంధం కలిగి ఉండాలి. అక్కడ నివసించే ప్రజలకు చిరపరిచితాలై ఉండాలి. ప్రజల సంస్కృతిలో భాగం కావాలి. పైగా గౌరవనీయత, పవిత్రత ఉండాలి. 90 శాతం ప్రజలు వాటిని తమవిగా భావించగలగాలి. అలా కాని పక్షం లో ఆ చిహ్నాలకు విలువ ఉండదు. ప్రజలు గౌరవిం చని చిహ్నాలు కాగితాలలో చిహ్నాలుగానే మిగిలిపో తాయి. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా మోదుగ పువ్వు ను, రాష్ట్ర పక్షిగా పాలపిట్టను, రాష్ట్ర జంతువుగా అడవి దున్నను ఎంపిక చేయడం ముదావహం. కాని రాష్ట్ర వృక్షంగా టేకు చెట్టుని ఎంపిక చేయడాన్ని పునఃపరిశీలించవలసి ఉంది.
ఒక దేశం లేదా రాష్ట్రం ఎంచుకునే చిహ్నాలకు ప్రజలతో సాంస్కృతికపరమైన అనుబంధం ఉండాలి. వాటికి గౌరవప్రదమైన సామాజిక విలువ ఉండాలి. ఆదివాసులు ఉండే ప్రాంతాలలో పెరిగే ఖరీదైన చెట్లను వారు ఏ రకంగానూ గుర్తించరు. వారిది వ్యాపార దృక్పథం కాదు. కేవలం కలప కోసం మాత్రమే పనికి వచ్చే చెట్లకు వారి సమాజాల్లో ఎలాంటి విలువా లేదు. అందుకే గిరిజన జానపద విజ్ఞానం దృక్పథం లోంచి చిహ్నాలను చూడవలసి ఉంటుంది. చారిత్రకంగా అవి మన నేలతో సంబంధం కలిగి ఉండాలి. ప్రజల జీవితాలలో భాగం కావాలి. వారి భావనలలో మంచి విలువలు కలిగి ఉం డాలి. అప్పుడే అది ప్రజలు మెచ్చే చిహ్నం కాగలదు.
రాష్ట్ర పక్షిగా పాలపిట్టని రాష్ట్ర జంతువుగా అడవి దున్నను ఎంపిక చేయడాన్ని అన్ని రకాలుగా స్వాగతించవచ్చు. తెలం గాణలో దసరా ఉత్సవంలో భాగంగా ఊరి బయట జమ్మి చెట్టుకి నమస్కరించి పాలపిట్టను చూడటం సంప్రదాయం. అది శుభసూచకం. ఒక పిట్టను వేలాది మంది ఏకకాలంలో చూడటం ఒక గొప్ప సంస్కృతి. చిన్న పెద్ద, స్త్రీ పురుష, ధనిక పేద అనే తేడాలు లేకుండా ఆ పక్షిని చూడటం అనేది తరతరాలుగా వస్తున్న సంప్ర దాయం. పాలపిట్టని కాదని బలంగా ఉందని గద్దను గుర్తించలేం కదా. అలాగే టేకు చెట్టుని కూడా ప్రజలు రాష్ర్ట వృక్షంగా స్వీకరించలేరు. అందుకు కారణాలు అనేకం.
టేకుకి తెలంగాణ సంస్కృతికి, సంప్రదాయా నికీ, విశ్వాసాలకి ఎలాంటి సంబంధం లేదు. ఆ చెట్టుకు ప్రజల జీవితాలతో ఎలాంటి అనుబంధం లేదు. టేకుని కేవలం వ్యాపార వృక్షంగానే గుర్తి స్తారు. వలస పాలనలో ఇబ్బడి ముబ్బడిగా పరాధీనమైన భూములను ఖాళీగా ఉంచకుండా, వాటిలో టేకు చెట్లు నాటి డబ్బు చేసుకోవడానికి రియల్టర్లు నగరాలకి తెచ్చారు. నిజానికి ఆనాడు ఆంగ్లేయులు భారతదేశాన్ని నాలుగు వృక్ష విభాగా లుగా చేసి చెట్లు పెంచారు. సెంట్రల్ ఇండియాలో బర్మా తదితర ప్రాంతాల నుంచి తెచ్చిన టేకు చెట్లను ఇక్కడి అడవు లలో విస్తారంగా విత్తారు. దీని కలప పడవలు, ఓడలు తయారు చేయడానికి బాగా పనికివస్తుంది. అందుకే టేకు చెట్ల పెంపకాన్ని ఆంగ్లే యులు విశృంఖలంగా పెంచారు.
టేకు కలపలో ఒక రకమైన తైల గుణం ఉంటుంది. అందు వల్ల అది గట్టిగా, దృఢంగా ఉంటుంది. అయితే టేకు పెరిగిన చోట ఇతర వృక్షాలు పెరగవు. ఆ ప్రాంతం అంతా చెదలు పడు తుంది. టేకు చెట్టు మీద పక్షులు వాలవు. టేకు ఆకులు తిన డానికి పశువులు సైతం నిరాకరిస్తాయి. పైగా టేకు విత్తనాలు మొలకెత్తాలంటే అవి కాలి టప్‌మని పగలాలి. అందుకే వర్షా కాలానికి ముందు అడవిని కాలుస్తారు. అంటే చిన్న చిన్న మొల కలు, గడ్డి అంతా సర్వనాశనం అవుతుంది. పచ్చదనం స్థానే ఒక రకమైన శ్మశాన దృశ్యం కానవస్తుంది. టేకు నీడన జీవజా లం, జంతువులు కూడా సౌకర్యంగా బతకలేవు. పక్షులు గూడు కట్టడానికి కూడా టేకు చెట్టు దరిదాపులకి రావు. కేవలం కలప కోసమే తప్ప టేకు చెట్టు అన్ని రకాలుగా నష్టం. తెలంగాణలో అడవుల విధ్వంసానికి, పర్యావరణ నష్టానికి టేకు ఒక కారణం.
టేకు వృక్షం ఈ నేలలో స్వతసిద్ధంగా పెరగలేదు. పరాయి ప్రాంతం నుండి వలస వచ్చి ఇక్కడి దేశీయ వృక్షాలకు నిలువ నీడ లేకుండా చేసిన చెట్టది. దాని పంచన తలదాచుకుందా మన్నా నీడను ఇవ్వలేని రూపం దానిది. అడవుల్లో ఆదివాసీలు టేకు చెట్టుని ముట్టుకుంటే శిక్షిస్తారు. జైల్లో పెడతారు. టేకు ఎవ రబ్బ చెట్టని ప్రభుత్వాధికారులు, అటవీ శాఖాధికారులు భావి స్తారో తెలియదు. ఇవ్వాల్టికీ టేకుని అనుమతి లేకుండా పెంచితే నేరం. ఇవాళ టేకుని రియల్టర్లు పెంచుతున్నారు. వ్యాపార స్థులకి మాత్రమే ఉపయోగపడే టేకు ప్రజలను భయభ్రాంతు లకు గురిచేస్తుంది.
అనాదిగా ప్రజలు మన దేశీయ వృక్షాలను ఆరాధించి వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఏనాడు కూడా వ్యాపార సంబంధమైన చెట్లను వారి జీవితాలలో భాగం చేయలేదు. మేడి చెట్టుని తండ్రిగా, అందుగ చెట్టుని తల్లిగా, మారేడు, నేరేడు చెట్లని పూజనీయంగా భావించారు. ఇప్ప చెట్టుని, వేప చెట్టుని ఆది తల్లిగా భావించారు. ప్రతి పెళ్లి రోజున ఒక చెట్టుని పెంచే అనాది ఆచారం ఉన్నా తెలంగాణలో డబ్బులు ఇచ్చి ఇంట్లో టేకుని పెంచమన్నా నిరాకరిస్తారు. ప్రజలకు తెలుసు పక్షి కూడా వాలని చెట్టు ప్రకృతికి శ్రతువు అని. ఇప్పుడు కాలుష్యం వెదజల్లని, ప్రకృతి పర్యావరణానికి పెద్ద పీట వేయాలని భావించే ప్రభుత్వం టేకుని రాష్ట్ర చిహ్నంగా ఉంచితే అది బంగారు తెలంగాణ భావనకి విరుద్ధమే.
నవ తెలంగాణలో చెట్టుని కూడా వ్యాపారం చేసే ఆలోచన ఉంటే, పర్యావరణాన్ని సైతం లెక్క పెట్టనితనం ఉంటే బేషర తుగా ప్రకటించుకోవచ్చు. కాని ప్రజలు మాత్రం హర్షించరు. కోట్లాది చెట్లు పెంచాలనే ఆలోచన ఉన్నప్పుడు, పెంచిన టేకు చెట్లని అమ్ముకోవడానికి నిరంతరం నరకడం తప్పదు. నరు క్కునే చెట్లు చిహ్నాలా? తల్లి లాంటి ఇప్ప చెట్టు, నీడనిచ్చే వేపలు చిహ్నాలు కావా?
ఒక్క కాగితం తయారీ కోసం వలస పాలకులు కాగజ్ నగర్‌నీ, భద్రాచలం ఐటీసీని ఏర్పరిచి వెదురుని ఆసాంతం కుళ్లబెరికారు. ఇప్పుడు వాటి అవసరాలకు అడవులను నరికి వేసి నీలగిరి చెట్లు పెంచుతున్నారు. సహజమైన అడవుల స్థానే కృత్రిమ అవసరాలను తీర్చే సంస్కృతి తెలంగాణ పర్యావర ణానికి శత్రువు. నరకడం కోసమే చెట్లను పెంచడం బాధాకరం. మనిషి కోసం చెట్టుని పెంచడం మానవత్వం. అలాంటి చెట్టే ఆదర్శం కావాలి. తెలంగాణలోని చెట్లని కాల్చి బొగ్గు చేసి ఇతర ప్రాంతాల విద్యుత్ ప్రాజెక్టులకు పంపడం ఆపాలి. పచ్చదనం ఇవ్వని చెట్టు తెలంగాణకు చిహ్నం కారాదు. ఆ సంస్కృతి ప్రజావ్యతిరేకమే.
(వ్యాసకర్త జానపద సాహిత్య వేత్త) జయధీర్ తిరుమలరావు