లైంగిక దాడులు ఎదుర్కొవడంపై అవగాహన
చేవెళ్ల : మహిళలు, విద్యార్థినులపై జరుగుతున్న లైంగిక దాడులను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశంపై శుక్రవారం కళాజాత బృందంచే పోలీసులు చేవెళ్ల బస్‌స్టేషన్‌లో ఆట, పాటలతో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ శృతకీర్తి మాట్లాడుతూ.. మహిళలపై, విద్యార్థినులపై పోకిరీల వేధింపులు, దాడులను పసిగట్టడానికి, అరికట్టడానికి ఏర్పాటు చేసిన షీటీంలను వినియోగించుకోవాలన్నారు. ఎవరైనా వేధించినా, ఈవ్‌టీజింగ్‌కు పాల్పడినా షీటీంకుగాని, నేరుగా పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలన్నారు. బస్‌స్టేషన్లు, రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో షీటీంలు అనునిత్యం గమనిస్తుంటాయని తెలిపారు. దాడులను ధైర్యంగా ఎదుర్కోవాలని మహిళలకు సూచించారు. కార్యక్రమంలో సీఐ ఉపేందర్, ఎస్‌ఐలు భీంకుమార్, విజయభాస్కర్, వరప్రసాద్‌లు పాల్గొన్నారు.