
సంక్రాంతి సంబరాలు అదిరిపోవాలి
కలెక్టర్ యువరాజ్
విశాఖపట్నం: రాష్ర్ట ప్రభుత్వం ఈ నెల 13న అధికారికంగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాల ద్వారా అన్ని మండలాలు, పట్టణాల్లో పండుగ వాతావరణం తీసుకురావాలని కలెక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు.సంబరాల్లో భాగంగా ప్రతీ గ్రామం నుంచి ముగ్గురు ఉత్తమ రైతులను ఎంపిక చేసి వారికి మండలస్థాయిలో జరిగే కార్యక్రమంలో పురస్కారాలు అందజేయాలన్నారు. ఒక్కో మండలానికి రూ.1.50లక్షలు సంబరాల నిర్వహణకు తక్షణం విడుదల చేస్తున్నట్టుగా చెప్పారు. మండల కేంద్రాల్లో నిర్వహించే సంబరాల్లో యువతకు కబడ్డీ పోటీలు, మహిళలకు ముగ్గులు, పిండివంటలు, రైతులకు పశువులు, పం టల ప్రదర్శన పోటీలు నిర్వహించాలన్నారు. విశాఖ నగరాన్ని సంక్రాంతి కళ ఉట్టిపడేలా గొబ్బమ్మలు, రంగవల్లులతో అలంకరించాలని సూచించారు. నగరంలో ఒక్కో జోన్‌లో రెండు చోట్ల ఈ సంబరాలు నిర్వహించాలన్నారు.
సంక్రాంతి సంబరాల నిర్వహణపై కలెక్టర్ తన ఛాంబర్‌లో శనివారం జిల్లా అధికారులతో సమీక్షించారు. కైలాసగిరిపై గాలిపటాల ఉత్సవం, గంగిరెద్దులు, సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. మండలాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చెప్పారు. విశాఖ నగరంలో పలుచోట్ల సంక్రాంతి పండుగను ప్రతిబింబించేలా తోరణాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మహా నగరపాలక సంస్థ కమిషనర్ ప్రవీణ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి కె.నాగేశ్వరరావు, జెడ్పీ సీఈవో మహేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పాల్గొన్నారు.